ఎన్నికల సంగ్రామం ముగిసింది. మూడు రోజులు గడిస్తే.. ఇక ఫలితాల జాతర మొదలవనుంది.
- 12న మున్సిపల్, 13న ‘ప్రాదేశికం’ కౌంటింగ్
- 16న తేలనున్న అసెంబ్లీ,
- పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం
- ఆ తర్వాత ‘పది’ పరీక్ష ఫలితాలు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఎన్నికల సంగ్రామం ముగిసింది. మూడు రోజులు గడిస్తే.. ఇక ఫలితాల జాతర మొదలవనుంది. వార్డు కౌన్సిలర్ మొదలుకొని పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 16వ తేదీ నాటితో తేలిపోనుంది. మున్సిపాలిటీ, ప్రాదేశిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు 10వ తరగతి పరీక్షల ఫలితాలు కూడా ఈ నెలలోనే వెలువడనుండటం ‘ఫలితాల మేళా’ను తలపిస్తోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడి కాగా.. పదో తరగతి విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు మార్చి నెల 30న ఎన్నికలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్ 2న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఆ రోజే ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై చూపుతుందనే పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఫలితాల విడుదలపై స్టే విధించింది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం మే 12న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు 76 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా జిల్లాలో 53 జెడ్పీటీసీ, 815 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఫలితాలను మే 13న ప్రకటించాలని న్యాయస్థానం ఆదేశించడంతో దాదాపు 35 రోజుల నుంచి ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ ముగిసింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు విజేతలను ప్రకటించనున్నారు. ఇకపోతే జిల్లాలో 47 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. మార్చి నెలలో ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనం కూడా ముగిసింది. సార్వత్రిక ఎన్నికల ఫలి తాలు వెలువడిన వారం రోజుల్లోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సేమ్ ‘డే’ 2009లో ఏప్రిల్ 16న సాధారణ ఎన్నికల పోలింగ్ జరగ్గా, సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మే 16న ఓట్లను లెక్కించారు. ఈ సారి మే 7న పోలింగ్ జరగ్గా, 16వ తేదీనే ఓట్లను లెక్కించనుండటం విశేషం.