లగడపాటి సర్వే వట్టిదే..
* వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు
* ఆయన ఎలాంటి సర్వే చేరుుంచలేదు..
* టీడీపీ, కాంగ్రెస్ నేతలు
* ఆయనతో అలా చెప్పించారు
* జగన్ వెంటే జనం..
* జగన్ సీఎం కావడం ఖాయం
సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళిపై లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సర్వే చేయించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆయన ప్రతిసారీ ఒక ఏజెన్సీతో సర్వే చేయించేవారని, కానీ ఈసారి మాత్రం ఆయన అసలు సర్వే చేయించలేదని తెలిపారు. తాను చెప్పేది అవాస్తవమైతే లగడపాటి వెంటనే స్పందించాలని అంబటి సవాల్ చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కక్షతో, జగన్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాకూడదనే దుగ్ధతో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు లగడపాటిని మేనేజ్ చేసి ఆయనతో ఆ విధంగా చెప్పించారని మండిపడ్డారు. లగడపాటి నిజంగా సర్వే చేయించి ఉంటే వైఎస్సార్‌సీపీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఎంత శాతం చొప్పున ఓట్లు వచ్చారుు అనే విషయాలు ఎందుకు చెప్పలేదని అంబటి నిలదీశారు. ఇవేవీ చెప్పకుండా టీడీపీకి అన్ని స్థానాలు వస్తాయి, ఇన్ని స్థానాలు వస్తాయంటూ లగడపాటి తన మనస్సులోని కోరికను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు.
నిన్న, మొన్న వెలువడిన మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి వైఎస్సార్‌సీపీ కంటే అత్యధిక సీట్లు వచ్చాయి కానీ, అత్యధిక ఓట్లు మాత్రం రాలేదని ఆయన స్పష్టం చేశారు. అరుునప్పటికీ ఆ ఫలితాలను చూపుతూ కొందరు వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడంటూ ఊదర గొడుతున్నారని, కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదని తేల్చి చెప్పారు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ముగిసిన నెలరోజుల తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల్లో అనేకమైన రాజకీయ మార్పులు, పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను చూసో, చంద్రబాబును చూసో ఓట్లు వేయలేదని, స్థానిక వ్యక్తులకు, అక్కడి సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి ఓట్లు వేశారని వివరించారు.
ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం.. ఈ రాష్ట్రానికి జగన్ సీఎం కావాలో, లేక చంద్రబాబు సీఎం కావాలో ఆలోచించుకుని మరీ ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారని అంబటి వెల్లడించారు. ఇదే విషయాన్ని నీల్సన్ మార్గ్ సర్వే కూడా వెల్లడించిందని, గతంలో ఈ సంస్థ చేసిన అనేక సర్వేలు నూటికి నూరు శాతం నిజం అయ్యూయని ఆయన చెప్పారు. శుక్రవారం వెలువడే ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 110 అసెంబ్లీ సీట్లు, 20కి పైగా పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతుందని, సీమాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు.
ఇతర అనేక సర్వేలు కూడా సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డేనని స్పష్టం చేస్తున్నాయన్నారు. అరుుతే చంద్రబాబు, టీడీపీ నాయకులు ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తున్నారని, వారి ఉత్సాహంపై శుక్రవారం వెలువడే ఫలితాలు నీళ్ళు చల్లనున్నాయని అంబటి చెప్పారు. లగడపాటి సర్వేను చూసి కొంతమంది అమాయకులు చట్ట వ్యతిరేకంగా పందేలు కాస్తున్నారని, వారు నష్టపోయే ప్రతి పైసాకు లగడపాటే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ సర్వేను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.