గెలిచేదెవరో..
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: పురసమరంలో విజేతలెవరో తేలే సమయం ఆసన్నమైంది. కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, యర్రగుంట్లలో 236 వార్డులకు పోటీపడిన 1183 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 12వ తేదీ సోమవారం తేటతెల్లం కానుంది. ఆరోజు మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను కడప నగరంలోని నాగార్జున మహిళా డి గ్రీ కళాశాలలోనే నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మార్చి 30వ తేదిన కడప కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి. కడప నగర పాలక సంస్థలో 2,71,532 మంది ఓటర్లు ఉండగా 62.67 శాతం అంటే 1,70,169 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2005లో ఇక్కడ 59.69 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అలాగే ప్రొద్దుటూరులో 1,23,481 మంది ఓటర్లు ఉండగా 75.82 శాతం, జమ్మలమడుగులో 35,485 మంది ఓటర్లు ఉండగా 80.65 శాతం, రాయచోటిలో 62,054 మంది ఉండగా 68.60 శాతం, పులివెందులలో 55,159 మంది ఓటర్లు ఉండగా 62.43 శాతం, బద్వేలులో 52,401 మంది ఓటర్లు ఉండగా 73.38 శాతం, మైదుకూరులో 33,318 మంది ఓటర్లు ఉండగా 76.03 శాతం, ఎర్రగుంట్లలో 23,368 మంది ఓటర్లు ఉండగా 82.16 శాతం ఓట్లు పోలయ్యాయి. కడప కార్పొరేషన్‌లో 50 వార్డులకు 311 మంది, బద్వేలులో 26 వార్డులకు 145 మంది, ఎర్రగుంట్లలో 20 వార్డులకు 54 మంది, ప్రొద్దుటూరులో 40 వార్డులకు 244 మంది, జమ్మలమడుగులో 20 వార్డులకు 98 మంది, పులివెందులలో 26 వార్డులకు 87 మంది, మైదుకూరులో 23 వార్డులకు 110 మంది, రాయచోటిలో 31 వార్డులకు 134 మంది కలిపి మొత్తం 236 వార్డులకు 1183 మంది బరిలో ఉన్నారు.
ప్రధాన పార్టీలలో వైఎస్సార్‌సీపీ నుంచి 232 మంది, టీడీపీ నుంచి 225 మంది బరిలో ఉన్నారు. అందరికంటే ఎక్కువగా 629 మంది స్వతంత్రులు పోటీ పడ్డారు. వీరందరి భవితవ్యం సోమవారంతో తేలిపోనుంది.ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2న మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే పురపాలక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ఎన్నికల కమిషన్ మే 12న మున్సిపల్ ఎన్నికలు, 13న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఓట్ల లెక్కింపు ఇలా!
నగర పాలక ఎన్నికల కౌంటింగ్ కోసం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై నాలుగు డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. నాలుగు డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయితే తొలిరౌండ్ ఫలితాలు ప్రకటిస్తారు. కడపలో ఒక్కో రౌండుకు నాలుగు డివిజన్లు చొప్పున 50 డివిజన్ల ఫలితాలను 13 రౌండ్లలో లెక్కిస్తారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించనున్నారు. 12వ తేది ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
టేబుల్ వద్దకు ఒకరికే అనుమతి - కమిషనర్ చల్లా ఓబులేశు
కడప కార్పొరేషన్, మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి పోటీ చేసిన అభ్యర్థి, జనరల్ ఏజెంటును మాత్రమే అనుమతిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేశు తెలిపారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉండాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ పాసులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆదివారం పాసులను జారీ చేస్తామన్నారు. 12వ తేది తెల్లవారుజామున 4 గంటలకు కొత్త కలెక్టర్ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూము నుంచి ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రమైన నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలకు తరలించనున్నామని తెలిపారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను పరిశీలించాలనుకుంటే అభ్యర్థులు రావచ్చని కమిషనర్ సూచించారు. ఓట్ల లెక్కింపులో తొలుత డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తామని వివరించారు.