ప్రచారం పరిపరి విధాలు..
పార్టీ గుర్తులతో పేపర్ గ్లాసులు
సైకిళ్లు, ఫెక్సీలకు భలే గిరాకీ
ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : నామినేషన్ వేసింది మొదలు గుర్తులు కేటాయించాక వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పది మందికి తగ్గకుండా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి ఓట్లు పడతాయో.. ఈవీఎంలో ఏ గుర్తుపై ఓటేస్తారో అర్థంకాని పరిస్థితి. తమదైన శైలిలో ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త కొత్త ప్రచారాస్త్రాలను అభ్యర్థులు ఎంచుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఊపిరి సలపకుండా ప్రచారం చేస్తున్నారు. తమకు కేటాయించిన గు ర్తుతో ఇంటింటికి తిరుగుతూ పలకరిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు వారి పనిలో భాగస్వాములవుతున్నారు. ఒక నాయకుడు కొబ్బరిబొండా కొడి తే.. మరొకరు చాయ్ అమ్ముతూ..
ఇంకొకకు హోటల్‌లో గరిటె తిప్పుతూ.. పొలం గట్ల వెంట కూలీలను పలకరిస్తూ.. బస్సు లు, ఆటోల్లో ప్రయాణికులను కలుస్తూ ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఇవేకాక ఫ్లెక్సీలు, డీజే సౌండ్లతో గల్లీగల్లీ తిరుగుతున్న అభ్యర్థులు ప్రచారంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
ఎల్‌ఈడీ ద్వారా త్రీజీ షోలలో వారి ప్రసంగాలను ప్రజలకు వినిపిస్తున్నారు. ఈ ప్రచారం కొద్దిమందికే చేరుతుందని గమనించిన అభ్యర్థులు.. గ్రామీణ ఓటర్లకు చేరువయ్యేందుకు కొత్త ప్రచార అస్త్రాలను ఉపయోగిస్తున్నారు.
హోటళ్లే అడ్డా..
నలుగురు మిత్రులు కలిసినప్పుడు ఓ హోటల్‌లో కూర్చొని రాజకీయ, సామాజిక అంశాలపై చిన్నపాటి చర్చ. అయితే చాయ్ తాగి పడేసే పేపర్ కప్పులను కూడా ప్రచార అస్త్రాలు గా నాయకులు మల్చుకున్నారు. చాయ్ కప్పుపై బరిలో నిలిచిన అభ్యర్థుల ఫొటోలు, వారి గుర్తులను ముద్రించి అందజేస్తున్నారు.
కొత్తగా కనిపించే కప్పులను తీక్షణంగా పరి శీలిస్తున్న ప్రజలు ఆసక్తికర ప్రచారంపై గంటలకొద్దీ చర్చకు దారితీస్తోంది. దీంతో పార్టీగుర్తు సామాన్యుడికి సైతం సులువుగా గుర్తుండిపోతుందని భావిస్తున్నారు. అంతేకాక ఖర్చు తక్కువ, ప్రచారం ఎక్కు వ ఉండడంతో నాయకులు టీ గ్లాసుల ప్రచారానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
మెదక్ నుంచి జిల్లాకు...
పేపర్ కప్పులపై నాయకుల ఫొటోలు, గుర్తులు వేసే సరికొత్త ప్రచారానికి మెదక్ జిల్లా వేదికైంది. పేపర్ గ్లాసులు అంతటా దొరికినప్పటికీ నాయకులకు అనుగుణంగా రంగులను ముద్రించే ప్రొడక్షన్ మాత్రం మెదక్‌లో తయారవుతోంది. సాధారణ పేపర్ గ్లాసుకు 60 పైసలు ఉంటే.. రంగులు అద్దుకున్న ఈ గ్లాసు రూ.1.60 పైసలు పలుకుతోంది.
ఫ్లెక్సీలకు గిరాకీ
గతంలో క్లాత్‌పై రాసిన బ్యానర్లు సందడి చేసేవి. వాటి స్థానా న్ని ఇప్పుడు ఫ్లెక్సీలు ఆక్రమించాయి. క్షణాల్లో కంప్యూటర్‌పై కొత్త డిజైన్లలో వచ్చే ఫ్లెక్సీలు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో పలు ఫ్లెక్సీ షాపులు బిజీబిజీగా మారాయి.
ఆటోకు మూడు వైపులా సరిపడే ఫ్లెక్సీలు కడితే రూ.3వేలు, టాటా ఏస్‌కు రూ.6వేలు, డీసీఎం, లారీ, బస్సులకు అయితే రూ.15 నుంచి రూ.20వేలు తీసుకుంటున్నారు. ట్రైసైకిళ్లపై కూడా ప్రచారం చేయిస్తున్నారు.