సార్వత్రికం ప్రశాంతం | general election polling at Khammam | Sakshi
Sakshi News home page

సార్వత్రికం ప్రశాంతం

Published Thu, May 1 2014 3:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

సార్వత్రికం  ప్రశాంతం - Sakshi

సార్వత్రికం ప్రశాంతం

 
- ఉదయం 7 గంటల నుంచే ఈవీఎంల మొరాయింపు
- గంటల తరబడి క్యూలో నిల్చున్న ఓటర్లు
- రోళ్లపాడు, బేతాళపాడులో పోలింగ్
- బహిష్కరణ.. అధికారుల బుజ్జగింపులు
 
 సాక్షి, ఖమ్మం, తెరవడంతోనే ఈవీఎంల మొరాయింపు.. ఉదయమే భారీ క్యూలైన్లు... పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు, నాయకుల ఘర్షణ.. వసతుల లేమి.... సమస్యలు పరిష్కరించలేదని పలు గ్రామాల్లో ఓటు బహిష్కరణ.. అధికారుల బుజ్జగింపులు...ఇలాంటి ఘట్టాల నడుమ సార్వత్రిక సమరం బుధవారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మండుటెండను దృష్టిలో ఉంచుకుని ఉదయమే ఓటు వేద్దామని  వచ్చిన ఓటర్లకు ఈవీఎంల మొరాయింపుతో పలుచోట్ల ఇబ్బందులు తప్పలేదు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

ఖమ్మం నియోజకవర్గంలోని ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. గొల్లగూడెం, రఘునాథపాలెం, యూపీహెచ్‌కాలనీ, పాండురంగాపురం, రోటరీనగర్ ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పాండురంగాపురంలో కేంద్రానికి ఏజెంట్లు రాకపోవడంతో ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

 కాడా కార్యాలయం, రమణగుట్ట, వేపకుంట్ల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. జమ్మిబండ బజారులో పోలింగ్‌కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న లోక్‌సత్తా పార్టీ అభ్యర్థి రవిమారుత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడులో సీపీఐ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేసిన ఘటనలో ఆ పార్టీకి చెందిన నలుగురికి, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలింగ్ బూత్‌లో సీపీఐకి చెందిన ఏజెంట్ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లకు చెబుతుండగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగింది. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్, ఎంవీపాలెం, తిరుమలాయపాలెం మండలంలోని తాళ్లచెర్వు, కొక్కిరేణి, జూపెడ, కూసుమంచి మండలం గంగబండతండా, గురవాయిగూడెం, జీళ్లచెర్వు గ్రామాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించాయి.

నేలకొండపల్లి మండలం శంకరగిరితండాలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో నామా నాగేశ్వరరావు కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ నామా పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట, జమ్మిగూడెం, మామిళ్లవారిగూడెం,  నారంవారిగూడెం, నారాయణపురం, దమ్మపేట మండలం దమ్మపేట, మందలపల్లి, నాగుపల్లి, ఆర్లపెంట, అకినేపల్లి, ముల్కలపల్లి మండలం పూచిగూడెం, మాదారం, పాతగంగారం, చంద్రుగొండ మండలం చంద్రుగొండ, మద్దుకూరు, తుంగారం, రావికంపాడు, కుక్కునూరు మండలం మారేడుబాక, వేలేరుపాడు మండలం పాతపూచిరాల గ్రామాల్లో పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే ఈవీఎంలను అమర్చారు. అయితే అన్నిచోట్లా పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

అశ్వారావుపేట మండలం కొత్తమామిళ్లవారిగూడెంలో 119, 120 బూత్‌లలో ఈవీఎంలపై ఫ్యాను గుర్తు బటన్‌లు లోనికి ఇరుక్కొని పోవడంతో వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసి టెక్నీషియన్లను పోలింగ్ కేంద్రాలకు పంపించారు. అనంతరం పోలింగ్ మొదలైంది.


ఇల్లెందు నియోజకవర్గంలో 14 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈ ఈవీఎంలను మార్చిన తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. కామేపల్లి మండలంలో కొమ్మినేపల్లి, బండిపాడు, ముచ్చర్ల, జాస్తిపల్లి గ్రామాల్లో మొదట ఈవీఎంలు పని చేయకపోవడంతో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.  టేకులపల్లి మండలం రోళ్లపాడు పోలింగ్ స్టేషన్ పరిధిలోని 438 మంది ఓటర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నికలను బహిష్కరించారు.

ఉదయం 9 గంటల వరకూ ఏజెంట్లు కూడా రాలేదు. పోలింగ్ మొదలు కాలేదు. దీంతో సీఐ రాజిరెడ్డి, తహశీల్దార్ ఉప్పలయ్య గ్రామస్తులతో మాట్లాడడంతో ఉదయం 9,30 గంటలకు గ్రామస్తులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. బొమ్మనపల్లి ఓటర్లు శంభునిగూడెంలో,  శంభునిగూడెం ఓటర్లు బొమ్మనపల్లిలో ఓటు వేశారు.

కొత్తగూడెం మండలంలోని రేగళ్ల, రుద్రంపూర్ ఐటీఐ, గౌతంపూర్, చాతకొండ, పోలింగ్ స్టేషన్లలో, కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామచంద్ర గర్ల్స్ హైస్కూల్, బాబుక్యాంప్, పాల్వంచ రాతిచెరువు బంజర, ఆశ్రమ పాఠశాల, ఇందిరా కాలనీలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం 11 గంటల నంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా, హమాలీ కాలనీలో సుమారు 300 మందికి ఓటరు గుర్తింపు కార్డులున్నా జాబితాలో పేర్లు లేవని, స్లిప్పులు లేవని అధికారులు వారిని ఓటు వేయనివ్వలేదు. జయమ్మ కాలనీలో గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని 100 కుటుంబాలు ఓటును బహిష్కరించాయి.


భద్రాచలంతో పాటు చింతూరు, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల్లో ఏజెం ట్లు సకాలంలో రాకపోవడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభించారు. భద్రాచలం మండలం లక్ష్మీపురంలో ఈవీఎం మెరాయించడంతో అరగంటకు పైగా పోలింగ్ నిలిచిపోయింది. భద్రాచలం- చింతూరు రహదారిలో బండిరేవు సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా చెట్టు వేశారు. వీటిని మావోయిస్టులు వేసినట్లుగా అనుమానిస్తున్నారు. భద్రాచలంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు యశోద రాంబాబు డబ్బు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదైంది.


బూర్గంపాడు మండల కేంద్రంలోని పినపాక పట్టినగర్, కృష్ణసాగర్, సారపాకలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ సుమారు 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. అశ్వాపురం మండలంలోని వెంకటాపురం, మల్లెలమడుగు, కుమ్మరిగూడెం, అశ్వాపురంలోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పినపాక మండలంలోని ఆరు గ్రామాల్లో, మణుగూరు మండలంలో ఐదు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.


సత్తుపల్లి పట్టణంలోని 183, 155, 175 పోలింగ్ కేంద్రాలు, పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల 121, లంకపల్లి 143, వేంసూరు మండలం పల్లెవాడ పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించటంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. వెంటనే అధికారులు వేరే ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు బారులుదీరారు. పలు పోలింగ్ కేంద్రాల్లో షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఎండలోనే క్యూలో నిల్చొని ఓటు వేశారు.


 ఏన్కూరు మండలం రాజులపాలెం, జూలూరుపాడు మండలంలోని భేతాళపాడు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డి మాండ్ చేస్తు గ్రామస్తులు గ ంటన్నరపాటు పోలింగ్‌ను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఎస్పీ రంగనాధ్, ఎఎస్పీ ఏసుబాబు, ఇతర అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించి ఓటు వేశారు. వైరా మండల కేంద్రంలోని 159వ పోలింగ్ కేంద్రం, గరికపాడు, గొల్లపూడి, విప్పలమడక గ్రామాలతో పాటు, తాటిపూడి గ్రామాలలో ఈవీఎంల వైర్లు ఊడిపోవడంతో పనిచే యలేదు.

జూలూరుపాడు మండలం పాపకొల్లు, కోయకాలనీ, అనంతారం, వెంగన్నపాలెం, కొణిజర్ల మండలం కొండవనమాల, చిన్నమునగాల, చిన్నగోపతి, కారేపల్లి మండలంలోని గేట్‌కారేపల్లి, ఉసిరికాయలపల్లి, గుంపెలగూడెం గ్రామాల్లో గంట పాటు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమయింది. ఏన్కూరు మండలంలోని తూతక్క లింగన్నపేట, ఆరికాయలపాడు, శ్రీరామగిరి, గ్రామాల్లో పోలింగ్ గంట ఆలస్యమైంది.

మధిర మండలం ఆత్కూరు, దెందుకూరు, ఎస్‌ఎఫ్‌ఎస్, చింతకాని మండలంలోని చిన్నమండవ, బోనకల్ మండలంలోని గోవిందాపురం, బోనకల్, ఎర్రుపాలెం మండలంలోని సత్తెనవీడు, ముదిగొండ మండలంలోని వల్లభి పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగూడెంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే సీపీఐ అభ్యర్థి నారాయణ కంకి కొడవలి గుర్తుకు ఓటు పడింది. దీన్ని గమనించిన ఓటర్లు, ఏజెంట్లు పోలింగ్ కేంద్రం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడ అధికారులు వేరే ఈవీఎంను ఏర్పాటు చేశారు.
 
 టీంవర్క్‌కు నిదర్శనం: ఎస్పీ రంగనాథ్
 ‘జిల్లా ప్రజలందరి సహకారంతో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించుకోగలిగాం. ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా, పోలింగ్ సిబ్బంది... ఇలా అన్ని వర్గాలు మాకు సహకరించాయి. గత రెండునెలలుగా విపరీతమైన పని ఒత్తిడి ఉన్నా మన జిల్లా పోలీసులతో పాటు ఇతర జిల్లాల పోలీసులు కూడా బాగా పనిచేశారు. వరుస ఎన్నికల విధులు, రాజకీయ నాయకుల పర్యటనలకు బందోబస్తుతో పోలీసు యంత్రాంగం రెండు నెలలుగా విరామం లేకుండా పనిచేస్తోంది. ఎలాంటి సంఘటనా జరగకుండా ఎన్నికలు పూర్తి చేయడం టీంవర్క్‌కు నిదర్శనం. జిల్లా పోలీసు యంత్రాంగానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.’
 - ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement