మహబూబాబాద్ జిల్లా రెడ్యాలలోని ఓ పోలింగ్ కేంద్రంలో బారులుదీరిన ఓటర్లు
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన లోక్‌సభ ఎన్నికలు
కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకూ ఓటింగ్
వివిధ సంఘటనల్లో 38 కేసులు నమోదు
115 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపు
వాతావరణం చల్లబడటంతో రోజంతా కొనసాగిన పోలింగ్
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం.. స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రం
సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్‌ల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం
జూన్ 4న ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లో నిక్షిప్తమైంది. రాత్రి 12 గంటల వరకు వేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.
ఉదయం నుంచే వడివడిగా..: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. 13 మావోయిస్టు ప్రభావిత అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా అన్నిచోట్లా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. గడువు ముగిసే సమయానికల్లా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీనితో సాయంత్రం 7 గంటల తర్వాత కూడా సుమారు 1,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు.
సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని వికాస్‌రాజ్ వివరించారు. 115 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సమస్యలు వస్తే.. వాటిని మార్చామని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతంపై మంగళవారం స్పష్టత వస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడలేదన్నారు.
వాతావరణం సహకరించడంతో..
రాష్ట్రంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలతో వాతావరణం చల్లబడింది. దీనితో రోజంతా పోలింగ్ కొనసాగింది. ఉదయమే వడివడిగా ప్రారంభమై రోజంతా స్థిరంగా కొనసాగింది. ఉదయం 9 గంటల కల్లా 9.4 శాతం, 11 గంటలకు 24.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 52.34 శాతం, సాయంత్రం 5 గంటలకల్లా 61.16 శాతానికి, రాత్రి 12 గంటలకల్లా 64.93 శాతానికి పోలింగ్ పెరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్ నమోదైంది, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71.97 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి గత లోక్‌సభ ఎన్నికలన్నా ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది.
వందల కొద్దీ ఫిర్యాదులు
పోలింగ్ రోజైన సోమవారం నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్‌కు 415, టోల్ ఫ్రీ నంబర్‌కు 21, సీ–విజిల్ యాప్ ద్వారా 225 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ రోజు జరిగిన వేర్వేరు ఘటనలకు సంబంధించి 38 కేసులు నమోదు చేశామన్నారు. ఇంకా కొన్ని ఫిర్యాదులపై పరిశీలన జరుగుతోందని, కేసుల సంఖ్య పెరగవచ్చని తెలిపారు.
పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉండదని.. ఈ క్రమంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల గుర్తింపును తనిఖీ చేసిన ఓ అభ్యర్థి (బీజేపీ అభ్యర్థి మాధవీలత)పై కేసు నమోదు చేశామని చెప్పారు. జహీరాబాద్, నిజామాబాద్‌లలో జరిగిన ఘటనపై సైతం కేసులు పెట్టామన్నారు. ఎన్నికలకు సంబంధించి మార్చి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.330 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత
ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలతో రెండో అంచె, స్థానిక పోలీసులతో మూడో అంచె బందోబస్తు నిర్వహిస్తారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలాగా పెట్టాలనుకుంటే.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వాటిని సవాల్ చేస్తూ 45రోజుల్లోగా కోర్టులో ఎలక్షన్ పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండటమే దీనికి కారణం.
మళ్లీ బద్ధకించిన హైదరాబాదీలు!
ఓటేసేందుకు హైదరాబాద్–సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు మళ్లీ బద్ధకించారు. రాత్రి 12 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల మేరకు.. రాష్ట్రంలోనే అత్యల్పంగా హైదరాబాద్ స్థానం పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాత సికింద్రాబాద్ పరిధిలో 48.11 శాతం, మల్కాజ్‌గిరి పరిధిలో 50.12 శాతం, చేవెళ్ల పరిధిలో 55.45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో 76.47 శాతం, జహీరాబాద్ పరిధిలో 74.54 శాతం పోలింగ్ నమోదయ్యాయి. అయితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. దీనికితోడు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో.. ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని సీఈవో వికాస్‌రాజ్ పేర్కొన్నారు.
నేడు ‘పరిశీలకుల’ఆధ్వర్యంలో ఈవీఎంల తనిఖీలు
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సంబంధిత రిసెప్షన్ కేంద్రంలో అందజేస్తారు. అక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రికి ప్రాథమిక పరిశీలన నిర్వహిస్తారు. ఫారం–17సీ, ఈవీఎం, వీవీ ప్యాట్స్‌ను పరిశీలించి చూస్తారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఎన్నికల పరిశీలకుడు ఈ అంశాలను ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారు. తర్వాత ప్రిసైడింగ్ అధికారులను పంపించివేస్తారు.
ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తారు. కొన్నిచోట్లలోని రిసెప్షన్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్‌లు ఉండగా.. మరికొన్ని చోట్ల వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. అలా ఉన్న చోట కేంద్ర బలగాల భద్రత నడుమ జీపీఎస్ సదుపాయమున్న వాహనాల్లో ఈవీఎంలను తరలించి భద్రపరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పోలింగ్ బృందాలు.. రిసెప్షన్ సెంటర్‌కు వచ్చి, అప్పగింత ప్రక్రియ పూర్తి చేసే సరికి.. మంగళవారం తెల్లవారుజాము 5 గంటల వరకు పట్టే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాధారణ పరిశీలకులు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి, ప్రిసైడింగ్ అధికారుల నుంచి వచ్చిన రిపోర్టులు, డైరీలను తనిఖీ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారిస్తారని వివరించారు. ఏదైనా ప్రాంతంలో రిపోలింగ్ అవసరం ఉంటే.. అప్పుడే నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment