ఎన్నికలపైనే మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: సెంటిమెంట్‌ను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం మార్కెట్లలో పరిమితస్థాయి కదలికలే నమోదుకావచ్చునని స్టాక్ నిపుణులు అంచనా వేశారు. సోమవారం(7) నుంచి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలుకానున్న నేపథ్యంలో భారీ పొజిషన్లు తీసుకునేందుకు వెనకాడే అవకాశమున్నదని తెలిపారు.
గత కొద్ది రోజులుగా రికార్డులు సృష్టిస్తూ సాగిన ర్యాలీ చివర్లో కొంతమేర చల్లబడిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. వీటికితోడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్న బీజేపీ పార్టీ 7న మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
పోలింగ్ సరళితోపాటు, బీజేపీ మేనిఫెస్టోపై ట్రేడర్ల దృష్టి ఉంటుందని నిపుణులు తెలిపారు. అస్సాం, త్రిపురల్లో గల ఆరు లోక్‌సభ స్థానాల కోసం పోలింగ్ మొదలుకానున్న రోజునే వెలువడనున్న బీజేపీ మేనిఫెస్టో ఓటర్లను ఆకట్టుకునే బాట లో సాగవచ్చునని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
క్యాడ్ ప్రభావం: ఈ గురువారం(10న) వాణిజ్య(ఎగుమతి, దిగుమతుల) గణాంకాలు వెలువడనుండగా, 11న పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) కట్టడితోపాటు, ఐఐపీ పుంజుకుంటే సెంటిమెంట్‌కు బలమొస్తుందని నిపుణులు తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగా గత 2 వారాల్లో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటం తెలిసిందే.
దేశీ కరెన్సీ సైతం 8 నెలల్లో తొలిసారి 60 దిగువకు చేరింది. కాగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఏదొక రాజకీయ పార్టీకి తగిన మెజారిటీ లభిస్తుందని, ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలను పెంచుతుందని గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ పేర్కొన్నారు.
వచ్చే వారం కీలకం: ఈ వారం వాణిజ్య, పారిశ్రామికోత్పత్తి గణాంకాలే వెలువడనుండగా, వచ్చే వారం రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. వీటితోపాటు ట్రెండ్‌పై ప్రభావం చూపగల ఆర్థిక ఫలితాల సీజన్ మొదలుకానుంది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాలను విడుదల చేయనున్నాయి.