సేమ్ డే..
- పదహారుపైనే అభ్యర్థుల ఆశలు
- 2009లో ఇదే తేదీన కౌంటింగ్ ఇప్పుడు కూడా..
- జాతకం కోసం పంతుళ్ల వద్దకు పరుగులు
హన్మకొండ, న్యూస్‌లైన్ : టికెట్ ఖరారు అయింది. బీఫాం చేతికొచ్చింది. నామినేషన్ దాఖలు చేయాలి... అప్పుడు పుజారుల వద్దకు అభ్యర్థుల ఉరుకులు, పరుగులు. ఇదంతా సాధారణమే. కానీ, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అభ్యర్థులు ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు పూజారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. 2009 ఎన్నికల్లో గెలిచి ఇప్పటిదాకా ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు మరింత ముందుగా అయ్యగార్ల వద్దకు వెళ్తున్నారు. ఎందుకంటే.. దానికో సెంటిమెంట్ ఉంది. అప్పుడు.. ఇప్పుడు సాధారణ ఎన్నికల కౌంటింగ్ ఒకేరోజు వచ్చింది. అదే ఈసారి స్పెషల్. మే 16వ తేదీపై అభ్యర్థులు అడ్డగోలుగా ఆశలు పెట్టుకున్నారు.
గంపెడాశలు
2009లో ఏప్రిల్ 16న సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో అంటే.. మే 16న ఓట్లను లెక్కించారు. ఈ ఫలితాల్లో జిల్లా నుంచి పలువురు కొత్తగా ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు రాజకీయ అనుభవం లేని చాలా మంది నేతలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
ఈసారి ఏప్రిల్ 30న ఎన్నికలు జరగగా.. మే 16న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. యాదృచ్ఛికంగానే అయినా.. లెక్కింపు సమయం, రోజు మాత్రం ఒకేసారి వచ్చాయి. గతంలో పలుమార్లు ఎన్నికలు జరిగినా.. లెక్కింపు తేదీలు కలిసి రాలేదు. కానీ.. ఈసారి అనుకోకుండానే ఓట్ల లెక్కింపు ఒకేరోజున వచ్చింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2009, 2014 సాధారణ ఎన్నికల్లో ఒకేసారి రావడంతో 2009లో గెలిచిన అభ్యర్థులు ఈసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. మరి కొందరు ఈసారి తమకు జాతకపరంగా కలిసొస్తుందనే ఆశతో ఉన్నారు. 2009లో మే 16న సమయం తమకు కలిసొచ్చిందని, ఆ ఎన్నికల్లో విజయం సాధించామని, ఈసారి కూడా అదే తేదీ రావడంతో తామే గెలుస్తామం టూ జాతకాలు చూపించుకుంటున్నారు. తెలుగు పం చాంగాలు ముందేసుకుని తమ అదృష్టాన్ని క్యాలెండర్ కాగితాల్లో మరీ వెతుకులాడుకుంటున్నారు. విరోధి నా మ సంవత్సరంలో కలిసొచ్చిన అదృష్టం.. జయనామ సంవత్సరంలో కూడా తమకే ఉంటుందనే ధీమాతో పంతుళ్ల వద్దకు వెళ్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ దాటి, పోలింగ్ ముగిసినా.. జాతకాలు చూస్తున్న పూజారులకు మాత్రం ఇంకా డిమాండ్ ఉంది.
అంతేకాక అప్పుడు కొద్దోగొప్పో ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు, కొత్తగా పోటీకి దిగిన అభ్యర్థులు సైతం మే 16పై ఉత్కంఠతో ఉన్నారు. 2009లో అదృష్టం కలిసి రాలేదని, 2014 మే 16న మాత్ర అదృష్టం తమనే వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇక కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009లో సాధారణ ఎన్నికల్లో చాలా మంది గెలిచారని, ఈసారి కూడా కొత్తగా వచ్చిన తమకూ మే 16 పదవిని తెస్తుందని సంబురపడుతున్నారు. మే 16 మాత్రం ఎవరిని కుర్చీలో కూర్చోబెడుతుందో మరో 9 రోజులు ఆగాల్సిందే.