యువహో..
- సార్వత్రిక ఎన్నికల్లో యువత జోష్..
- పోలింగ్‌లో భారీగా పాల్గొన్న యూత్
- జిల్లాలో 11,30,127 మంది...
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువ జోష్ కనిపించింది. ఈ ఎన్నికల్లో యువత ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంది. మొదటిసారి ఓటు వేస్తున్నామనే సంతోషంతో ఉదయం 7 గంటలకే పలువురు యువతీ యువకులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసి వచ్చాక వారి ఆనందం ఆకాశాన్నంటింది. మొదటిసారి ఓటు వేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని పలువురు యువ ఓటర్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 20,17,030 మంది ఓటర్లకు గాను 11,30,127 మంది యువతీ యువకులే ఉన్నారు.
పోలింగ్‌కు ఆసక్తి చూపిన యువత..
18 -19 సంవత్సరాల వయసు కలిగిన యువతకు మొదటిసారి ఓటు హక్కు రావడంతో వారిలో అత్యధిక శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 20 - 39 మధ్య వయసున్న వారు కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎక్కువ శాతం యువత ఓటు హక్కు వినియోగించుకుంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు.
సత్ఫలితాలిచ్చిన సదస్సులు..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కళాశాలల్లో యువతను ఓటర్లుగా చేర్పించడంతో పాటు ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిజాయితీతో పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎన్నికల సంఘం పలు చోట్ల అవగాహన సదస్సులు, కళాజాతాలు నిర్వహించింది. ఈ సదస్సులు సత్ఫలితాలు ఇవ్వడంతో యువత ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే కొన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. తమ మేనిఫెస్టోల్లో సైతం యువతకు పెద్దపీట వేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పించాయి.
యువ ఓటర్లే కీలకం...
సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను నిర్ణయించేది యువతే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఉన్న ఓటర్లలో సగం మంది వారే కావడం గమనార్హం. తమ భవితవ్యం యువత చేతిలో ఉందని గుర్తించిన ఆయా పార్టీల అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించారు. కొన్నిచోట్ల క్రికెట్ కిట్‌లను కూడా పంపిణీ చేశారు. అయితే యువ ఓటర్లు మాత్రం నిజాయితీ కలిగిన, పనిచేసే అభ్యర్థులకే ఓటు వేశామని చెబుతున్నారు.