పోలీసుల తీరుపై గంగుల నిరసన
కరీంనగర్, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రం సమీపంలో శిబిరం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝళిపించారు. ఓటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే పోల్‌చిట్టీలు పంపిణీ చేయడం నిబంధనలకు విరుద్ధమని లాఠీచార్జి చేశా రు. బుధవారం నగరంలోని సైన్స్‌వింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద త్రీటౌన్ సీఐ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల ను లాఠీలతో చితకబాదారు. పోలింగ్‌కేంద్రానికి దూరంగానే శిబిరం ఉన్నా పో లీసులు కావాలనే తమ కార్యకర్తలను కొ ట్టారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గం గుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అకారణంగా కార్యకర్తలను కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చొక్కా విప్పి రోడ్డుపై బైఠాయించారు. నిబంధనల ప్రకారమే శిబిరాన్ని పోలింగ్ కేంద్రానికి దూరంగా ఏర్పాటు చేశామని, పోలీసు లు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఒక్కసారిగా శిబిరాన్ని తొలగిస్తూ, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో తమ కార్యకర్తలు ఉదారపు మారుతి, బొగ్గుల మల్లేశం, సిగిరి శ్యాం, మహ్మద్ అలీ, బాబు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.
సీఐ స్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ఏదైనా తప్పు చేస్తే తనను కొట్టాలని, కార్యకర్తలను కొట్టడమేమిటని గంగుల తీవ్ర వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్ సంఘటన స్థలానికి వచ్చి సముదాయించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గంగుల ఆందోళన విరమించారు.