TRS activists
-
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి దాడి ఘటనపై ఆయన తల్లి విజయలక్షి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 11:30 ప్రాంతంలో 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి గేటు పగలగొట్టి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టీఆర్ఎస్ జండాలతో, కర్రలతో రాళ్లతో దాడి చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పింది. బెంజ్ కారు అద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. దాడికి పాల్పడ్డ 50 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విన్నపించారు. కాగా నిజామాబాద్ జిల్లా దిశా మీటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాసంపై టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఆందోళనకు దిగారు. చదవండి: బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి.. ధర్మపురి అర్వింద్ తల్లి ఫిర్యాదు -
వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 80మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఏడాదికాలంలో సుమారు 950 మంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, వారికి బీమా మొత్తం అందజేస్తామని తెలిపారు. కుటుంబంలో ఆదరువును కోల్పోయినవారికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు కేవలం బీమా పరిహారంతో సరిపెట్టకుండా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలు అందేలా పార్టీ తోడుగా నిలుస్తుందని చెప్పారు. కేటీఆర్ బీమా చెక్కులు అందుకునేందుకు వచ్చిన కార్యకర్తల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
ఖైరతాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్‌ను నెక్లెస్ రోడ్డులో ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయారెడ్డి, స్థానికులు సోమవారం రాత్రి అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ విషయంపై సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ నాయకులతో కలసి బండి సంజయ్ రాత్రి 8:50 గంటలకు నెక్లెస్ రోడ్డులో ఉన్నారనే సమాచారం రావడంతో రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ను అక్కడికి పంపించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి నాయకులు పబ్లిక్ ప్లేస్‌లో తిరగడం మంచిది కాదని పోలీసులు నచ్చజెప్పారు. దీంతో బండి సంజయ్, ఆయన అనుచరులు కారులో వెళ్తుండగా కొందరు యువకులు, టీఆర్ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థి విజయారెడ్డి బండి సంజయ్ కారును అడ్డుకున్నారని డీసీపీ చెప్పారు. వాహనాన్ని ముందుకు పంపించడంతో వెనుక ఉన్న వాహనాన్ని అడ్డుకొని అద్దాన్ని పగలగొట్టారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇరు పార్టీల వారిని వెంటనే అక్కడి నుంచి పంపించామని డీసీపీ విశ్వప్రసాద్ వివరించారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా బండి సంజయ్ మక్తాలో అనుచరులతో డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నట్లు విజయారెడ్డి తెలిపారు. మహిళ అని కూడా చూడకుండా తనను తోశారని, కానీ ఆయనపైనే దాడి జరిగినట్లు ఆరోపిస్తున్నారని విమర్శించారు. సంజయ్ కారును తనిఖీ చేయాలన్నా చేయకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని విజయారెడ్డి తెలిపారు. కాగా, చంపాపేట డివిజన్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నట్లు తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు వెళ్లి వారిని నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హుటాహుటిన కాలనీకి చేరుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ మహేష్ భగత్ నేతలకు నచ్చజెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ‘లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సిన పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ డబ్బులు, మద్యంతో ఓటర్లను ప్రభావితం చేస్తుంటే అడ్డుకొని పట్టిస్తున్న బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతామనే భయంతో ఎంతకైనా దిగజారడం మంచి పద్ధతి కాదు ’అని కిషన్‌రెడ్డి అన్నారు. కాగా, ‘టీఆర్ఎస్ ఏవిధంగానైనా గెలవాలననే దురుద్దేశంతో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తోంది. అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని, ఇంకా అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, టీఆర్ఎస్ దాడుల కు నిరసనగా నేడు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆ డీకే అరుణ దీక్ష చేపట్టున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. -
కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం
సాక్షి, పాలమూరు: మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీలు కీలక సంగ్రామంగా భావిస్తున్న పుర పోరుపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న నాయకులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్టు చేజారకుండా ముఖ్యనాయకులపై ఒత్తిడి పెంచుతున్నారు. బరిలో ఉంటామనేలా.. మున్సిపాలిటీ ఎన్నికల వార్డుల రిజర్వేషన్లు ఇంకా ప్రకటించలేదు. అయినా కొందరు ఔత్సాహికులు పార్టీ నుంచి తనకే టికెట్ ఖాయమనే తీరును ప్రదర్శిస్తున్నారు. ఈనెల 14లోగా రిజర్వేషన్లు తేలిపోనుండటంతో ఆశావహుల జోరు అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్కు ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో వార్డు నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్కెట్‌ను దక్కించుకోవడానికి ఇప్పటికే లాబింగ్‌లు మొదలెట్టారు. మొన్నటి వరకు వరకు పాలకవర్గంలో బాధ్యతలు నిర్వర్తించిన నాయకులతోపాటు కొత్తగా టికెట్‌ను ఆశిస్తున్న వారి తాకిడి ఈ పార్టీలో అధికంగానే కనిపిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్, పార్టీలు కూడా మహబూబ్‌నగర్ పుర పీఠాన్ని కైవసం చేసుకునేలా ముందుకు అడుగులేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల తరఫున రంగంలో నిలిచేందుకు నాయకగణం ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో గెలిచి పాలనతీరులో భాగమైన సిట్టింగుల్లో ఎక్కువ మంది మరోసారి తమకు రిజర్వేషన్ అనుకూలిస్తుందని.. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలనే భావనను కనబరుస్తున్నారు. ఆశించిన వార్డుతోపాటు అనుకూలంగా ఉండే ఇతర స్థానాల్లోనూ పోటీకి సై అనేలా చతురతను చూపిస్తున్నారు. కొత్తగా పోటీపట్ల ఆసక్తిని చూపించే వారి సంఖ్య కూడా పట్టణంలో క్రమంగా పెరుగుతోంది. ప్రజలతో ఉన్న సత్సంబంధాలు తమకు కలిసి వస్తాయనే తీరుతో పోటీ దిశగానే దృష్టిని చూపిస్తున్నారు. అనుచరుల వద్ద టికెట్ పొందుతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కాలనీల్లో, బస్తీల్లోని పెద్దలు సహా కుల సంఘాల వారికి పోటీ ఖాయమనే తీరుని మాటల్లో చెప్పకనే చెబుతున్నారు. అయితే తాను లేదంటే తన భార్య పోటీలో ఉంటుందనే విషయాన్ని కూడా ముందుస్తుగానే తెలియపరుస్తున్నారు. వలసలపై దృష్టి పట్టణ ప్రాంతంలో కీలకమైన కౌన్సిలర్ పోటీ చేయడాన్ని ఆయా పార్టీల నాయకులు సవాలుగా తీసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనే ఆశాభావంతో ముందస్తుగానే జోరును పెంచుతున్నారు. ప్రధానంగా ఇప్పుడున్న సొంత పార్టీలోనే టికెట్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పక్క పార్టీలోకి మారైనా పోటీకి సమాయత్తమవుతున్నారు. ఉన్నఫలంగా నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎక్కువగా సమయం ఉండకపోవడం అప్పటికప్పుడు అభ్యర్థుల వెతుకులాట సహా ఇతరత్రాలుగా ఎదురయ్యే ఇక్కట్లను తట్టుకునేందుకు ముందస్తుగానే అభ్యర్థుల విషయంలో ఓ అంచనాలున్నాయి. తమ పార్టీలోని బలమైన నాయకుడికి టికెట్ ఇవ్వడం లేదా అనివార్యమైన చోట పక్క పార్టీలోని మంచి నాయకుడికి గాలం వేసి పార్టీలోకి ఆహ్వానించడం లాంటి ప్రయత్నాల్ని అన్ని పార్టీలు చేపట్టబోతున్నాయి. మరోవైపు నాయకులు కూడా తమ కళ్లముందున్న రాజకీయ వాతావరణానికి అనుగుణంగా వలసలకు తెరతీయనున్నారు. తమ సొంత పార్టీలో టికెట్ వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పలు వార్డులపై దృష్టి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ఉన్న కొన్ని వార్డులపై అధికార పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్ల నుంచి కౌన్సిలర్లుగా ఉంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పిస్తున్న కొందరిని వచ్చే కౌన్సిల్‌కు రాకుండా చూడాలని ప్రణాళిక రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయా వార్డుల్లో ఆకర్ష్ మంత్ర ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడింది. గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోవడంలో విఫలం అయిన ఈ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది. అధిష్ఠానం సూచనల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ తన కార్యాచరణను ప్రకటించనుంది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ తరుఫున టికెట్ తీసుకుని గెలిచాక నాయకులు అధికార పార్టీలోకి వెళ్లకుండా ఆచూతూచి వ్యవహరిస్తూ నమ్మకస్తులను ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జోరుమీదున్న కారు.. అధికార పార్టీ టీఆర్ఎస్ భారీ అంచనాలతో ఉంది. వంద శాతం జెడ్పీ పీఠాలను సాధించినట్లే జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో సత్తా చాటి.. పదవులను కైవసం చేసుకోవాలని చూస్తోంది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా గెలుపు గుర్రాలను పోటీలో నిలుపుతామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో మహబూబ్‌నగర్ పట్టణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడు వార్డుల్లో అధికారులను వెంటబెట్టుకుని కలియదిరుగుతున్నారు. సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని కాలనీల్లో చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఆశ పడుతున్నా ద్వితీయ శ్రేణి నాయకులు కష్టపడి పని చేస్తున్నారు. కమల వ్యూహం గతంలో పట్టణంలో బీజేపీ ఆరుసీట్లు దక్కించుకుంది. ఒకప్పుడు ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచాక జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని వ్యూహం రచించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కంటే 4500ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంట్లో పట్టణంలో అధికంగా ఓట్లు వచ్చాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తున్నారు. గతసారి కాంగ్రెస్‌కు మద్దతు పలకడంతో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో బీజేపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. అయితే ఈసారి వార్డుల సంఖ్య పెంచుకొని చైర్మన్ పదవి దక్కించుకోని సంస్థాగతంగా బలోపేతం కావాలనే యోచనలో బీజేపీ నాయకులు ఉన్నారు. -
టీఆర్ఎస్కు ఉద్యమకారుల హెచ్చరిక..!
సాక్షి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల మనోభావాలు, ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద అమరవీరుల స్థూపం పునర్నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉద్యమకారులు డిమాండ్ చేశారు. చిమ్మపూడి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమకారులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో.. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా అభ్యర్థుల్ని ఎన్నికల బరిలోకి దింపుతామని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తొలిదశ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైందనీ, మలిదశ ఉద్యమంలోనూ జిల్లాకు చెందిన ఎంతో మంది పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. దాడులను తట్టుకొని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. -
సంబరాలు చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల కార్యకర్తలు
-
గ్రూపుల లొల్లి !
సాక్షి, కొత్తగూడెం : సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే పినపాక నియోజకవర్గంలో ఇవి మరింతగా ముదురుతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడా భారీ వలసలతో పార్టీ కిక్కిరిసిపోయింది. 2014లో ఈ నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న పార్టీ బలం ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. పార్టీలోకి వలసల పరంపర ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీని వీడి టీఆర్ఎస్లోకి వచ్చాక చేరికలు ఇబ్బడిముబ్బడిగా జరగడంతో ప్రస్తుతం కిటకిటలాడిపోతోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని పార్టీల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రూపుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని మించి టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహ జంగానే గ్రూపుల లొల్లి నడుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ గ్రూపు రాజకీయాలు మరింత క్రియాశీలకం అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత గ్రూపులు అసమ్మతి రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. ఇవి చివరకు దాడులకు దారితీస్తున్నాయి. మణుగూరు మండలంలో ప్రారంభమైన అసమ్మతి గళాలు ఇతర మండలాలకూ విస్తరించాయి. అసమ్మతి ప్రభా వంతో గుండాల మండలంలో దాడి సైతం చోటుచేసుకుంది. పాయం అండతో పదవులు పొంది చివరకు అసమ్మతి రాగాలు.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాయం తన అనుచరులతో పాటు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిలో పలువురికి పార్టీ, నామినేటెడ్ పదవులు అప్పగించారు. అయితే వివిధ అభివృద్ధి పనుల కేటాయింపుల్లో మాత్రం ఎమ్మెల్యే పక్షపాతం చూపిస్తూ కొంతమందినే ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు అసమ్మతి రాగం అందుకున్నారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల జెడ్పీటీసీలు, ఇతర నాయకులు కొందరు మొదట మణుగూరులో అసమ్మతి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మణుగూరుకు చెందిన కొందరు అసమ్మతివాదులు గత 26న గుండాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు సదరు అసమ్మతి నాయకులు చెప్పినట్లు సమాచారం. మండల కార్యదర్శిపై అధ్యక్షుడి దాడి.. కాగా, టీఆర్ఎస్ గుండాల మండల కార్యదర్శి కదిర్ 27న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు పార్టీలో ఉంటూ చీలికకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో 28న పార్టీ గుండాల మండలాధ్యక్షుడు భాస్కర్.. తనకు సమాచారం లేకుండా ప్రెస్‌మీట్ ఎలా పెట్టావంటూ కదిర్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అనంతరం కదిర్ భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
‘అధికార’ రైతులు!
► ఎంపికైన ఆదర్శ రైతుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలే ఎక్కువ ► ప్రభుత్వ పథకంలో రాజకీయ జోక్యంపై విమర్శలు ► ఎంపికైన వారితో త్వరలో సీఎం సమావేశం.. సాక్షి, హైదరాబాద్: ఆదర్శ రైతుల ఎంపికలో రాజకీయ జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అధికారం పార్టీ కార్యకర్తలనే ఎక్కు వగా ఆదర్శరైతులుగా ఎంపిక చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రారంభించనున్న ఎకరాకు రూ.4 వేలు అందించే పెట్టుబడి పథకం, పంట కాల నీల ఏర్పాటు వంటి వాటిపై గ్రామాల్లో చైత న్యపరిచేందుకు ఆదర్శ రైతులను ఎంపిక చేసింది. జిల్లాకు 100 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులను గుర్తిం చింది. సంబంధిత ఆదర్శ రైతుల జాబితా జిల్లా కలెక్టర్ల నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖకు చేరింది. ఆ జాబితాను పరిశీలించిన వ్యవసా యాధికారులు అవాక్కయ్యారు. ఎంపికైన ఆదర్శ రైతుల్లో దాదాపు సగం వరకు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉన్నారని అధికా రులు చెబుతున్నారు. ఒక మండలంలో 9 మంది ఆదర్శ రైతులను గుర్తిస్తే, అందులో ఆరుగురు అధికార పార్టీకి చెందిన వారేనని, మిగతా ముగ్గురే ఇతరులున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఆదర్శ రైతులను గుర్తించాలని ప్రభుత్వం చెప్పినా కిందిస్థాయిలో పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఇలా జరిగిందని తెలిసింది. 1,000 మంది రిసోర్స్పర్సన్ల జాబితా ఇదిలావుంటే రైతులకు శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం రిసోర్స్పర్సన్లను కూడా ఎంపిక చేసింది. వారిలో దాదాపు 750 మంది వరకు వ్యవసాయశాఖ అధికారులే ఉన్నారు. మిగిలినవారిలో చాలామంది రిటైర్డ్ వ్యవసా యాధికారులున్నారని చెబుతున్నారు. రిటైర్డ్ అధికారుల్లో మాజీ వీసీలు, మాజీ డిప్యూటీ డైరెక్టర్లు, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు, మాజీ మండల వ్యవసాయాధికారులున్నారు. చాలా మంది స్వచ్ఛందంగా వ్యవసాయశాఖ కార్యా లయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. 80 ఏళ్ల వ్యక్తి మొదలు ఇటీవల రిటైర్ అయిన అధికారుల వరకు కూడా రిసోర్స్ పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయి తే 80 ఏళ్లున్న వారు ఏ విధంగా గ్రామాలకు వెళ్లగలరోనని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. గౌరవ వేతనంతోపాటు వాహన సౌకర్యం.. ఇక రిసోర్స్పర్సన్లకు గౌరవ వేతనం ఇస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉన్నందున గౌరవ వేతనం, వాహన సౌకర్యం కల్పిస్తారని అంటున్నారు. రిసోర్స్ పర్సన్లుగా పనిచేసేందుకు ఇద్దరు వ్యవసాయ వర్సిటీల వీసీలు ముందుకు వచ్చారు. వారి స్థాయిని బట్టి సాధారణ పనికి బదులు ఇతరత్రా పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశముందని అంటున్నారు. రిసోర్స్పర్సన్ల ఎంపికకు ముందే వారి బాధ్యతలు ఏంటో చెబితే బాగుండేదని అంటున్నారు. కొందరైతే ‘మేం సీఎం నిర్వహించే సమావేశానికి వస్తాం. అక్కడ మా బాధ్యతలేంటో చెప్పాక నచ్చితే కొనసాగుతాం లేకుంటే తప్పుకుంటాం’ అని అన్నట్లు తెలిసింది. ఇదిలావుండగా త్వరలో సీఎం ఆదర్శ రైతులు, రిసోర్స్ పర్సన్లతో పలు దఫాలుగా సమావేశం నిర్వహించే అవకాశముంది. -
ఇక గులాబీ గుబాళింపు
కార్యకర్తల బాగోగులపై దృష్టి పెట్టనున్న కేసీఆర్ ► వరంగల్ సభ తర్వాత కార్యాచరణ ► రూ.5 లక్షలలోపు అభివృద్ధి పనుల అప్పగింత ► నామినేటెడ్ పోస్టుల భర్తీ.. పథకాల ప్రచారంలో భాగస్వామ్యం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరియనుందా... చోటా, మోటా నేతల్లో గూడుకట్టుకున్న నిరాసక్తత తొలగిపోనున్నదా.. అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్గాలు. పార్టీ 16వ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అతి ముఖ్యమైన వ్యవసాయ విధానాన్ని ప్రకటించినప్పుడు ప్రతినిధుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కార్యకర్తల్లోని నిస్తేజం ఆ పార్టీ అధినాయకత్వంలో గుబులు రేపింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటుకు అధినేత శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉన్న ఈ మూడేళ్ల సమయాన్ని పాలనను గాడిలో పెట్టేందుకు వెచ్చించి పార్టీపై దృష్టి సారించలేదని రెండో సెషన్ ముగింపు ప్రసంగంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరగనున్న టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ సభ తర్వాత పార్టీ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ‘అన్ని వర్గాలకు సంక్షేమ ఫలితాలు అందిస్తూనే మరో వైపు పార్టీ క్యాడర్ గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ప్లీనరీ సాక్షిగా శ్రేణులకు ఆయన మాట కూడా ఇచ్చారు. కార్యకర్తలను ఆదుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచించారు’ అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పార్టీ యంత్రాంగం బలోపేతానికి చర్యలు బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. కుల వృత్తుల వారీగా కార్యక్రమాలు తీసుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు రెండు పంటలకు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది తమకు మరోమారు అధికారాన్ని కట్టబెట్టే పథకమని భావిస్తోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలంటే పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం మినహా మరో మార్గం లేదన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు. దీనికి అనుగుణంగా ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు బాసటగా నిలిచేందుకు రూ.5 లక్షల లోపు అభివృద్ధి పనులను నామినేషన్ పద్ధతిన అప్పజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది. గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, తదితర పనులను పార్టీ కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు నామినేషన్ విధానంలో ఇవ్వనున్నారు. దీనికితోడు ఎమ్మెల్యేలకు ఉండే నియోజకవర్గ అభివృద్ధి ఫండ్, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫండ్‌తో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించారని చెబుతున్నారు. ఈ పనులను చేపట్టడంలో భాగంగా పార్టీ క్యాడర్‌ను పరిగణనలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీలు, ఎంపీల ఫండ్‌ను స్థానిక ఎమ్మెల్యే సమన్వయంతో వినియోగిస్తారు. పార్టీ యంత్రాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉద్యమంలో ఉన్న కార్యకర్తలకు గుర్తింపు ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేసి, ఈ మూడేళ్లలోనూ ఎలాంటి పదవులు దక్కనివారిని గుర్తించి త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని సమాచారం. గ్రామ, మండల స్థాయిలో చురుగ్గా ఉండే కార్యకర్తలకు పదవులు ఇవ్వటం వల్ల ప్రభుత్వ పథకాల గురించి విస్తృత ప్రచారం కల్పించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలసి ఉద్యమ కాలంలో పనిచేసినవారిని గుర్తించే పనిలో ఉన్నారని తెలిసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న జరిగే వరంగల్ బహిరంగసభ తర్వాత క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపే పనులు మొదలవుతాయని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. -
సచివాలయం దాటని హామీలు
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి మండిపాటు సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా.. పనులు సచివాలయం గేట్లు దాటడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ వివరాలను, తీర్మానాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన వివరించారు. రాజకీయ, కరువు తీర్మానాలతో పాటు వివిధ అంశాలపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పేరిట నిధుల దుర్వినియోగం చేస్తూ.. ఏకపక్షం, దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు లబ్ధి పొందేందుకే మిషన్ కాకతీయ చేపట్టారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడమే కాక వారికి మంత్రి పదవులను కట్టబెట్టారని కిషన్‌రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపుల తెలంగాణగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతీ చిన్న అంశానికి కేంద్రంపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలనే ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వర్సిటీలకు వీసీలను ఇప్పటివరకూ నియమించలేదన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా మండలాలను గుర్తించడానికి కేసీఆర్‌కు తీరికలేకుండా పోయిందని అన్నారు. కేంద్రం రూ.730 కోట్లను పంపిస్తే కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కరువుపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు నుంచి ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న నిధులు కాకుండా ఒక్కొక్క మండలానికి రూ.5 కోట్లను రాష్ట్రప్రభుత్వం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు పరిశీలనకు నేడు జిల్లాలకు బృందాలు.... రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి మంగళవారం జిల్లాలకు బీజేపీ నేతల సారథ్యంలో బృం దాలు వెళ్తున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడిం చారు. పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు. ఏప్రిల్ 18 నుంచి 20 వరకు గ్రామాలకు వెళ్లి కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తామన్నారు. -
మంత్రుల సమక్షంలోనే డిష్యుం డిష్యుం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఎల్లిగుట్ట సమీపంలో మంచినీటి పైపులైన్ ప్రారంభోత్సవానికి దత్తాత్రేయ, కేటీఆర్ ఇద్దరూ వెళ్లారు. వాళ్లిద్దరూ వేదిక మీద ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీడీపీ-బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. నిజానికి గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్గీయులకు, టీడీపీ-బీజేపీ వర్గీయులకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఉంది. గురువారం నాటి కార్యక్రమంలో అది బహిరంగంగా బయటపడింది. తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు మంత్రుల సమక్షంలోనే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడికి ప్రయత్నించగా, వీళ్లు కూడా గట్టిగా దాన్ని ప్రతిఘటించారు. ఈ సమయంలో ఎక్సైజ్ శాఖమంత్రి పద్మారావు కలగజేసుకుని ఇరుపక్షాలకు చెందిన కార్యకర్తలను వారించారు. ఉప్పల్ ఏసీపీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఘర్షణ వాతావరణాన్ని చెదరగొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను గతంలో ఎప్పుడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే పనులు చేస్తున్నారని ప్రతిపక్ష కార్యకర్తలు ఆరోపించారు. -
మంత్రుల సమక్షంలోనే డిష్యుం డిష్యుం
-
తన్నులు తిన్నోళ్లపైనే కేసులా?
♦ కన్నీటి పర్యంతమైన ఎర్రబెల్లి ♦ కడియం దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలిచిరా జనగామ : ‘పాలకుర్తి ఘటనలో తన్నులు తిన్నా.. టీడీపీ కార్యకర్తలను గొడ్డును బాదినట్లు బాదారు. పార్టీ కార్యాలయంలో చొరబడిన పోలీసులు తలలు పగులగొట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు వేస్తే ఎస్సైకి గాయాలయ్యాయి... కానీ కేసులు మాపై బనాయించారంటూ’ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లపర్యంతమయ్యారు. వరంగల్ జిల్లా జనగామ కోర్టులో బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన ఎర్రబెల్లి సోమవారం కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడారు. రాళ్లురువ్విన టీఆర్ఎస్ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ తెలంగాణలో ప్రతిపక్షాలను లేకుండా చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి తనపై బనాయించిన అక్రమ కేసులను న్యాయస్థానం తిప్పికొట్టడం వారికి చెంపపెట్టుగా మారిందన్నారు. ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, చిన్నారెడ్డిలపై దాడులు చేయడమే కాకుండా, రేవంత్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారన్నారు. ఆంద్రోళ్లు పాలించిన రోజుల్లో కూడా ఇంత అన్యాయం జరగలేద న్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అడ్డదారిలో మంత్రి పదవి సంపాదించిన కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలుపొందాలని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన పాలకుర్తి సీఐ తిరుపతి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా, కోర్టు వద్ద టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఎర్రబ్లెల్లిని పరామర్శించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగి స్తున్న కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలను ఎండగడతామని ఎల్. రమణ అన్నారు. ఎర్రబెల్లితో పాటు 28 మందిపై కేసు పాలకుర్తి టౌన్: పాలకుర్తి ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు టీడీపీకి చెందిన 28 మంది కార్యకర్తలపై పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు చేశారు. -
పదవులు వస్తాయో రావో..!
- మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లతో టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో ఆందోళన - జిల్లాలో 18 మార్కెట్ కమిటీలు జోగిపేట: మార్కెట్ కమిటీ పదవులపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం శరాఘాతమైంది. మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వారి ఆందోళనక కారణమైంది. ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆశించేవి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మార్కెట్ కమిటీ చెర్మైన్, డెరైక్టర్ పదవులే. ఆ పదవులకు రిజర్వేషన్ పద్ధతిలో నియామకాలు చేపడతామని సీఎం బుధవారం ప్రకటించడంతో ఆశావహుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం తామే నియోజకవర్గంలో సీనియర్‌గా ఉన్నామని, అయితే రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదోనంటూ పలువురు కార్యకర్తలు బెంబేలెత్తుతున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులుంటే మార్కెట్ పదవులు దక్కేవి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నా రిజర్వేషన్లు అనుకూలించకపోతే ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. జిల్లాలో 18 కమిటీలు ప్రస్తుతం జిల్లాలో 18 మార్కెట్ కమిటీలున్నాయి. అయితే వీటిని లాటరీ పద్ధతిన ఎంపిక చేసే అవకాశం ఉంది. మార్కెట్ చెర్మైన్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమకు రిజర్వేషన్లు అనుకూలించేలా ఏం చేయాలో అనే ఆలోచనలో పడ్డారు. పదవీ కాలపరిమితిపై కేబినెట్ చర్చించలేదు. చెర్మైన్‌లకు ఏడాది పదవీకాలం పరిమితి ఉంచే అవకాశం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయమై కేబినెట్లో చర్చించలేదని సమాచారం. ఈ ఒక్క పదవి లేకుంటే వచ్చే నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఆశలన్నీ నామినేట్ పదవులపైనే పెట్టుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో పదవులపై ఆశలు ఉన్న నాయకులంతా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జోగిపేట, వట్పల్లి, రాయికోడ్ మార్కెట్ కమిటీలున్నాయి. ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టున్నారు. రిజర్వేషన్ల వల్ల ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది. జోగిపేట మార్కెట్ కమిటీ పదవిని బీసీ, ఓసీ కులానికి చెందిన నాయకులు ఆశిస్తుండగా, వట్పల్లి మార్కెట్‌కు మైనార్టీ, ఓసీ కులానికి చెందిన నాయకులు ఆశిస్తున్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా: పల్లా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తలకు రూ.2 లక్షల సాయం అందేలా ఇన్సూరెన్సు చేయించామని ఆ పార్టీ అడహాక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4 కోట్ల 64 లక్షల 21 వేల 200 ప్రీమియం సొమ్మును చెల్లించామని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. థర్డ్‌పార్టీ బీమా కంపెనీ ‘ఈ-మెడ్ లైఫ్’ ప్రతినిధులకు ఈ మొత్తానికి చెక్కును సీఎం కేసీఆర్ అందించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల సభ్యత్వం నమోదు కాగా, ఇప్పటి వరకు తమ కార్యాలయానికి అన్ని వివరాలతో 41.30 లక్షల మంది సభ్యత్వాలు అందాయని, వీరందరికీ ఇన్సూరెన్సు చేయించామన్నారు. ఈ బీమా ద్వారా సభ్యులకు రూ.2 లక్షల మేర లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే సాక్షిగా ఎంపీటీసీపై దాడి!
దుబ్బాక : ప్రజాస్వామ్యం అపహస్యం చేసే విధంగా ఎమ్మెల్యే సాక్షిగా ఓ ప్రజాప్రతినిధిపై అధికారపార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. సోమవారం దుబ్బాక సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఆసరా పింఛన్లు రాని లబ్ధిదారులు బైఠాయించి, ఎమ్మెల్యేను అడ్డుకోబోయారు. దీనికంతటికీ ప్రధాన కారణం నీవేనంటూ, అనవసరంగా ప్రజల ను రెచ్చగొడుతున్నావంటూ టీఆర్ఎస్ నాయకులు పెద్ద గుండవెల్లి ఎంపీటీసీ (కాంగ్రెస్) సంజీవరెడ్డిపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వద్దని వారించినా పట్టించుకోకుండా సదరు ఎంపీటీసీ గల్లలు పట్టుకుని బయటకు తోసేశారు. తేరుకున్న పోలీసులు ఇరువురిని శాంతింప జేశారు. సభలో ఏకైక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడిని కాబట్టే తనపై దాడులు చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని సంజీవరెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ నిరసన ఆపబోనని, చావడానికైన సిద్ధమేనన్నారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
టీడీపీ నిరసన, రాస్తారోకో
నల్లగొండ రూరల్ : తమ పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం క్లాక్‌టవర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరసన తెలియజేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడలేదన్నారు. పార్టీలకతీతంగా కలిసి వచ్చి టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండించాలని విజ్ఞఫ్తి చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, బొల్లం మల్లయ్యయాదవ్, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రజనికుమారీ ఎల్వి. యాదవ్ పిల్లి రామరాజులు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకుల దాడులను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాస్తారోకో చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బంద్‌ను జయప్రదం చేయాలి టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడికి నిరసనగా బుధవారం నిర్వహిస్తున్న జిల్లాబంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్ కోరారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దీపావళి పండగ సందర్భంగా బంద్‌లో ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ కావాలనే టీఆర్ఎస్ నాయకులతో తమ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయిస్తున్నారని, జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి దాడులకు ఊసిగొల్పారని ఆరోపించారు. తాము తలుచుకుంటే టీఆర్ఎస్ జెండాలుండవని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో ఉన్న మాధవరెడ్డి విగ్రహాన్ని కూడా తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. -
హరీష్ ఇంటి ముట్టడికి ఏబీవీపీ యత్నం
- ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ - అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దిపేట టౌన్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నేతలు, కార్యకర్తలు మంగళవారం సిద్దిపేటలోని మంత్రి హరీష్‌రావు ఇంటిని ముట్టడించడానికి విఫలయత్నం చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు ఏబీవీపీ జెండాలు పట్టుకొని మెరుపు వేగంతో మంత్రి ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకుప్రయత్నించగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా, ఏబీవీపీ కార్యకర్తలు నవీన్, లక్ష్మణ్, దుర్గాప్రసాద్‌లకు గాయలయ్యాయి. సమాచారం అందుకున్న సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఏబీవీపీ కార్యకర్తలను స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్లో ధర్నా నిర్వహించారు. అనంతరం పలువురు ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 1956 నిబంధనలను రాష్ట్రపతి, గవర్నర్ ఆదేశాల మేరకు అమలు చేయాలన్నారు. వివిధ సెట్ల అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఏబీవీపీ నేతలు అంజి, దుర్గప్రసాద్, సాయి, భాను, రవితేజ, శివ, సాగర్, శ్రీకాంత్, సచిన్, భరత్, శశికర్, రమేష్, అనిల్, బాల్‌రాజ్, నరేందర్, రాంచంద్రం, శిరీష్, రహీం, కరుణాకర్, సందేశ్‌లు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడి శోచనీయం: బీజేవైఎం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపట్టిన ఏబీవీపీ నేతలపై దాడి చేయడం, నిర్బంధించడం సరైంది కాదని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వినతి పత్రం ఇవ్వడానికి మంత్రి ఇంటికి వెళ్లిన విద్యార్థులపై దాడి చేయడం శోచనీయమన్నారు. బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నేతలు రాజశేఖర్‌రెడ్డి, లిఖిత్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తల కుమ్ములాట
నల్లగొండ తెలంగాణా రాష్ట్ర సమితిలో వర్గపోరు బహిర్గతమైంది. బు దవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ములాడుకున్నారు. జయంతి ఉత్సవాలకు ముఖ్య అతి థిగా పాల్గొనడానికి నకిరేకల్ ఎమ్మె ల్యే వేముల వీరేశం రాక కోసం ఎదురు చూస్తుండగా కార్యకర్తల మ ధ్య వాగ్వాదం, తోపులాట జరి గింది. పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేం దర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి మరింకొంత మంది ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశా రు. కాగా ఆ పార్టీ నాయకులు దు బ్బాక నర్సింహారెడ్డి ఫొటో ఫ్లెక్సీలో పెట్టలేదని ఆయన అనుచరులు జహంగిర్‌తో పాటు మరి కొందరు ఫ్లెక్సీని చింపి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కాగా బండా నరేందర్‌రెడ్డికి సంబంధించిన వర్గీయులు ఫరీదుద్దీన్, జమాల్‌ఖాద్రి, దుబ్బాక నర్సింహారెడ్డి వర్గాయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకోవడంతో తోపులాట జరి గిం ది. కాగా ఇరువర్గాల వారిని దుబ్బా క నర్సింహారెడ్డి, బండా నరేందర్‌రెడ్డిలు సర్థిచెప్పారు. ఘనంగా జయశంకర్ జయంతి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా జరుపుకున్నా రు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డిలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మైనం శ్రీనివాస్, వెంకటాచారి, మాలె శరణ్యరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సిం గం రామ్మోహన్ పాల్గొన్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద శుక్రవారం బందోబస్తు నిర్వహించిన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని తేలిపోవడంతో కౌంటింగ్ ఎదురుగా జాతీయ రహదారిపై వేచి ఉన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు. టపాకాయలు కాలు స్తూ నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వైపు దూసుకురావడానికి యత్నించారు. పోలీసులు వీరిని అడ్డుకుని నిలువరించారు. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ ఆగ్రహించిన పోలీసులు ఒక్కసారిగా లాఠీలకు పని చె ప్పారు. కార్యకర్తలను ఇష్టమొచ్చిన రీతిలో చితకబాదుతూ పరుగులెత్తించారు. డిచ్పల్లి మండలం మల్లాపూర్ గ్రామ సర్పంచ్ భర్త భూమయ్యను చుట్టుముట్టి రోడ్డుపై పడవేసి చితకబాదారు. జై తెలంగాణ అంటూ సంబరాలు జరుపుకుంటే దాడులు చేస్తారా అని టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నడిపల్లి వైపు నుంచి విజయోత్సాహంతో నినాదాలు చేస్తూ కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై సైతం పోలీసులు లాఠీ చార్జి చేశారు. పోలీసుల దాడితో టీఆర్ఎస్ కార్యకర్తలు బారికేడ్ల కింద నుంచి దూరి దూరంగా పరుగులెత్తారు. జర్నలిస్టుపై దాడి.. టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలను చిత్రీకరిస్తున్న వీడి యో జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారు. తాను జర్నలిస్టునని చెప్పినా విన్పించుకోకుండా కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులందరూ కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎండలో బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎస్పీ డౌన్‌డౌన్.. పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. చివరకు జర్నలిస్టు సం ఘాల నాయకులు కొందరిని కౌంటింగ్ కేంద్రంలోకి పిలిపించుకున్న ఎస్పీ వారిని సముదాయించడంతో జర్నలిస్టులు తమ నిరసన విరమించారు. అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు అత్యుత్సాహంతో అడు గడుగునా జర్నలిస్టులను, రాజకీయ నాయకు లు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రశాంతంగా ఉన్న వాతావరణం పోలీసుల తీరుతో ఉద్రిక్తంగా మారిం దని జర్నలిస్టులు ఆరోపించారు. తాము ఇప్పటికి పలు ఎన్నికలను చూసామని, ఇలా ఎన్నడూ జరగలేదని జర్నలిస్టు నాయకులు అసహనం వ్యక్తం చేశారు. -
విలేకరిని కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలి
కమాన్‌పూర్, న్యూస్‌లైన్: పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణను కవరేజీ చేస్తున్న విలేకరినికొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు రాస్తారోకో చేశారు. బుధవారం మండలంలోని బేగంపేటలో ఓటింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటర్లకు పార్టీ గుర్తు చూపిస్తూ ఓట్లు అభ్యర్థించడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాలు తోపులాడుకున్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విలేకరులు ఫొటోలు తీస్తూ, వివరాలు తెలుసుకుంటున్నారు. గోదావరిఖని టూటౌన్ సీఐ భద్రయ్య టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటూనే అక్కడ ఉన్న విలేకరి మల్యాల సురేశ్‌పై చేయిచేసుకున్నారు. మిగితా లేకరులను కూడా దుర్భాషలాడారు. దీంతో విలేకరులు సీఐపై చర్యలు తీసుకోవాలని సెంటినరీకాలనీలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. గోదావరిఖని వన్‌టౌన్ సీఐ శ్రీధర్, కమాన్‌పూర్ ఎస్సై సతీశ్ వచ్చి విలేకరులను సముదాయించారు. విచారణ జరిపి సీఐపై చర్యలు తీసుకుంటామని గోదావరిఖని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పూదరి సత్యనారాయణ, పీవీ రావు, బబ్బార్ఖాన్, బుర్ర తిరుపతి, పోసు భిక్షపతి, బండ సాయిశంకర్, గాదె బాలయ్య, బొల్లవరం వాసు, విజయ్, మాటేటి కుమార్, చేతి రవి, ఆరెపెల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ కార్యకర్తలపై విరిగిన లాఠీ
కరీంనగర్, న్యూస్‌లైన్ : పోలింగ్ కేంద్రం సమీపంలో శిబిరం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఝళిపించారు. ఓటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే పోల్‌చిట్టీలు పంపిణీ చేయడం నిబంధనలకు విరుద్ధమని లాఠీచార్జి చేశా రు. బుధవారం నగరంలోని సైన్స్‌వింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద త్రీటౌన్ సీఐ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల ను లాఠీలతో చితకబాదారు. పోలింగ్‌కేంద్రానికి దూరంగానే శిబిరం ఉన్నా పో లీసులు కావాలనే తమ కార్యకర్తలను కొ ట్టారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గం గుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా కార్యకర్తలను కొట్టిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. చొక్కా విప్పి రోడ్డుపై బైఠాయించారు. నిబంధనల ప్రకారమే శిబిరాన్ని పోలింగ్ కేంద్రానికి దూరంగా ఏర్పాటు చేశామని, పోలీసు లు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా ఒక్కసారిగా శిబిరాన్ని తొలగిస్తూ, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో తమ కార్యకర్తలు ఉదారపు మారుతి, బొగ్గుల మల్లేశం, సిగిరి శ్యాం, మహ్మద్ అలీ, బాబు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. సీఐ స్వామిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ఏదైనా తప్పు చేస్తే తనను కొట్టాలని, కార్యకర్తలను కొట్టడమేమిటని గంగుల తీవ్ర వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రవీందర్ సంఘటన స్థలానికి వచ్చి సముదాయించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గంగుల ఆందోళన విరమించారు. -
ఆర్ఐపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
పాల్వంచ, న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారిపై పాల్వంచలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ప్రచార కార్యక్రమం ఆదివార ం మధ్యాహ్నం పాల్వంచలోని ఇందిరా కాలనీలో ఏర్పాటైంది. దీనికి ముందస్తుగా ఆ పార్టీ కార్యకర్తలను స్థానిక నాయకుడు, న్యాయవాది గంగాధర్ సమాయత్తపరుస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల నియామవళిని అతిక్రమించి, ఇందిరా కాలనీలో పార్టీ జెండాలు కడుతున్నారని తహశీల్దార్ సమ్మిరెడ్డికి సమాచారమందింది. ఆయన ఆదేశాలతో వీడియో సర్వేలైన్ టీం అధికారి, ఆర్ఐ ప్రసాద్ బాబ్జి, వీఆర్వో రాములు అక్కడి చేరుకుని, టీఆర్ఎస్ ప్రచార సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో అటుగా గంగాధ ర్ కారు వచ్చింది. అందులో పార్టీ జెండాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీ చేసేందుకు దానిని ఆర్ఐ ఆపబోయారు. కారు ఆగకుండా వెళ్లడంతో ఆయన వెంబడించి నిలిపేశారు. కారులోంచి గంగాధర్, కొందరు కార్యకర్తలు దిగి ఆర్ఐపై దాడి చేసి దుర్భాషలాడారు. ‘ఓ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. దీనిపై ఆర్డీవో సత్యనారాయణకు, తహశీల్దార్ సమ్మిరెడ్డికి, పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆనంద్ వెంటనే అక్కడికి చేరుకుని గంగాధర్‌ను జీప్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జీపుకు అడ్డుపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావ్‌కు కార్యకర్తలు విషయం తెలిపారు. అధికారులతో మాట్లాడతానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసి దుర్భాషలాడారని, విధులను అడ్డుకున్నారని పాల్వంచ పోలీసులకు ఆర్ఐ ప్రసాద్ బాబ్జి ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కొత్తగూడెం ఆర్డీవో అమయ్‌కుమార్‌కు, డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్ఐ బాబ్జి చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు.. ఆర్ఐ బాబ్జీ ఫిర్యాదు మేరకు గంగాధర్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షణ్ముఖాచారి తెలిపారు. మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.