
‘అధికార’ రైతులు!
► ఎంపికైన ఆదర్శ రైతుల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలే ఎక్కువ
► ప్రభుత్వ పథకంలో రాజకీయ జోక్యంపై విమర్శలు
► ఎంపికైన వారితో త్వరలో సీఎం సమావేశం..
సాక్షి, హైదరాబాద్: ఆదర్శ రైతుల ఎంపికలో రాజకీయ జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. అధికారం పార్టీ కార్యకర్తలనే ఎక్కు వగా ఆదర్శరైతులుగా ఎంపిక చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రభుత్వం ప్రారంభించనున్న ఎకరాకు రూ.4 వేలు అందించే పెట్టుబడి పథకం, పంట కాల నీల ఏర్పాటు వంటి వాటిపై గ్రామాల్లో చైత న్యపరిచేందుకు ఆదర్శ రైతులను ఎంపిక చేసింది. జిల్లాకు 100 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది రైతులను గుర్తిం చింది.
సంబంధిత ఆదర్శ రైతుల జాబితా జిల్లా కలెక్టర్ల నుంచి రాష్ట్ర వ్యవసాయశాఖకు చేరింది. ఆ జాబితాను పరిశీలించిన వ్యవసా యాధికారులు అవాక్కయ్యారు. ఎంపికైన ఆదర్శ రైతుల్లో దాదాపు సగం వరకు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలే ఉన్నారని అధికా రులు చెబుతున్నారు. ఒక మండలంలో 9 మంది ఆదర్శ రైతులను గుర్తిస్తే, అందులో ఆరుగురు అధికార పార్టీకి చెందిన వారేనని, మిగతా ముగ్గురే ఇతరులున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఆదర్శ రైతులను గుర్తించాలని ప్రభుత్వం చెప్పినా కిందిస్థాయిలో పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఇలా జరిగిందని తెలిసింది.
1,000 మంది రిసోర్స్‌పర్సన్ల జాబితా
ఇదిలావుంటే రైతులకు శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం రిసోర్స్‌పర్సన్లను కూడా ఎంపిక చేసింది. వారిలో దాదాపు 750 మంది వరకు వ్యవసాయశాఖ అధికారులే ఉన్నారు. మిగిలినవారిలో చాలామంది రిటైర్డ్ వ్యవసా యాధికారులున్నారని చెబుతున్నారు. రిటైర్డ్ అధికారుల్లో మాజీ వీసీలు, మాజీ డిప్యూటీ డైరెక్టర్లు, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు, మాజీ మండల వ్యవసాయాధికారులున్నారు.
చాలా మంది స్వచ్ఛందంగా వ్యవసాయశాఖ కార్యా లయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు. 80 ఏళ్ల వ్యక్తి మొదలు ఇటీవల రిటైర్ అయిన అధికారుల వరకు కూడా రిసోర్స్ పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయి తే 80 ఏళ్లున్న వారు ఏ విధంగా గ్రామాలకు వెళ్లగలరోనని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు.
గౌరవ వేతనంతోపాటు వాహన సౌకర్యం..
ఇక రిసోర్స్‌పర్సన్లకు గౌరవ వేతనం ఇస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉన్నందున గౌరవ వేతనం, వాహన సౌకర్యం కల్పిస్తారని అంటున్నారు. రిసోర్స్ పర్సన్లుగా పనిచేసేందుకు ఇద్దరు వ్యవసాయ వర్సిటీల వీసీలు ముందుకు వచ్చారు. వారి స్థాయిని బట్టి సాధారణ పనికి బదులు ఇతరత్రా పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశముందని అంటున్నారు. రిసోర్స్‌పర్సన్ల ఎంపికకు ముందే వారి బాధ్యతలు ఏంటో చెబితే బాగుండేదని అంటున్నారు. కొందరైతే ‘మేం సీఎం నిర్వహించే సమావేశానికి వస్తాం. అక్కడ మా బాధ్యతలేంటో చెప్పాక నచ్చితే కొనసాగుతాం లేకుంటే తప్పుకుంటాం’ అని అన్నట్లు తెలిసింది. ఇదిలావుండగా త్వరలో సీఎం ఆదర్శ రైతులు, రిసోర్స్ పర్సన్లతో పలు దఫాలుగా సమావేశం నిర్వహించే అవకాశముంది.