
సాక్షి, హైదరాబాద్: పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 80మంది టీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బుధవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఏడాదికాలంలో సుమారు 950 మంది పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, వారికి బీమా మొత్తం అందజేస్తామని తెలిపారు.
కుటుంబంలో ఆదరువును కోల్పోయినవారికి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు కేవలం బీమా పరిహారంతో సరిపెట్టకుండా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలు అందేలా పార్టీ తోడుగా నిలుస్తుందని చెప్పారు. కేటీఆర్ బీమా చెక్కులు అందుకునేందుకు వచ్చిన కార్యకర్తల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment