మంత్రుల సమక్షంలోనే డిష్యుం డిష్యుం
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకున్నారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఎల్లిగుట్ట సమీపంలో మంచినీటి పైపులైన్ ప్రారంభోత్సవానికి దత్తాత్రేయ, కేటీఆర్ ఇద్దరూ వెళ్లారు. వాళ్లిద్దరూ వేదిక మీద ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీడీపీ-బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. నిజానికి గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ వర్గీయులకు, టీడీపీ-బీజేపీ వర్గీయులకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఉంది. గురువారం నాటి కార్యక్రమంలో అది బహిరంగంగా బయటపడింది.
తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు మంత్రుల సమక్షంలోనే టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడికి ప్రయత్నించగా, వీళ్లు కూడా గట్టిగా దాన్ని ప్రతిఘటించారు. ఈ సమయంలో ఎక్సైజ్ శాఖమంత్రి పద్మారావు కలగజేసుకుని ఇరుపక్షాలకు చెందిన కార్యకర్తలను వారించారు. ఉప్పల్ ఏసీపీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఘర్షణ వాతావరణాన్ని చెదరగొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను గతంలో ఎప్పుడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే పనులు చేస్తున్నారని ప్రతిపక్ష కార్యకర్తలు ఆరోపించారు.