సచివాలయం దాటని హామీలు
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నా.. పనులు సచివాలయం గేట్లు దాటడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ వివరాలను, తీర్మానాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన వివరించారు. రాజకీయ, కరువు తీర్మానాలతో పాటు వివిధ అంశాలపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల పేరిట నిధుల దుర్వినియోగం చేస్తూ.. ఏకపక్షం, దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు లబ్ధి పొందేందుకే మిషన్ కాకతీయ చేపట్టారని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే కాక వారికి మంత్రి పదవులను కట్టబెట్టారని కిషన్‌రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ అంటే ఫిరాయింపుల తెలంగాణగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రతీ చిన్న అంశానికి కేంద్రంపై ఆరోపణలు చేసి తప్పించుకోవాలనే ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వర్సిటీలకు వీసీలను ఇప్పటివరకూ నియమించలేదన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా మండలాలను గుర్తించడానికి కేసీఆర్‌కు తీరికలేకుండా పోయిందని అన్నారు. కేంద్రం రూ.730 కోట్లను పంపిస్తే కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కరువుపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు నుంచి ఆదుకునేందుకు కేంద్రం ఇస్తున్న నిధులు కాకుండా ఒక్కొక్క మండలానికి రూ.5 కోట్లను రాష్ట్రప్రభుత్వం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరువు పరిశీలనకు నేడు జిల్లాలకు బృందాలు....
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి మంగళవారం జిల్లాలకు బీజేపీ నేతల సారథ్యంలో బృం దాలు వెళ్తున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడిం చారు. పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు. ఏప్రిల్ 18 నుంచి 20 వరకు గ్రామాలకు వెళ్లి కేంద్ర పథకాలపై ప్రచారం చేస్తామన్నారు.