ఎమ్మెల్యే సాక్షిగా ఎంపీటీసీపై దాడి!
దుబ్బాక : ప్రజాస్వామ్యం అపహస్యం చేసే విధంగా ఎమ్మెల్యే సాక్షిగా ఓ ప్రజాప్రతినిధిపై అధికారపార్టీకి చెందిన పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. సోమవారం దుబ్బాక సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఆసరా పింఛన్లు రాని లబ్ధిదారులు బైఠాయించి, ఎమ్మెల్యేను అడ్డుకోబోయారు. దీనికంతటికీ ప్రధాన కారణం నీవేనంటూ, అనవసరంగా ప్రజల ను రెచ్చగొడుతున్నావంటూ టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద గుండవెల్లి ఎంపీటీసీ (కాంగ్రెస్) సంజీవరెడ్డిపై దాడికి యత్నించారు.
ఎమ్మెల్యే వద్దని వారించినా పట్టించుకోకుండా సదరు ఎంపీటీసీ గల్లలు పట్టుకుని బయటకు తోసేశారు. తేరుకున్న పోలీసులు ఇరువురిని శాంతింప జేశారు. సభలో ఏకైక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడిని కాబట్టే తనపై దాడులు చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని సంజీవరెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ నిరసన ఆపబోనని, చావడానికైన సిద్ధమేనన్నారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.