అధికారిపై టీడీపీ మహిళా నేత దాడి!  | TDP Ex MPTC Attack On Endowment Officer In Vizianagaram | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎంపీటీసీ.. దౌర్జన్యకాండ! 

Published Wed, Oct 14 2020 1:07 PM | Last Updated on Wed, Oct 14 2020 1:10 PM

TDP Ex MPTC Attack On Endowment Officer In Vizianagaram - Sakshi

దేవదాయశాఖ ఈవో బీహెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.కిశోర్‌కుమార్‌తో ఆరతిసాహు వాగ్వాదం, చిరిగిన దుస్తులతో దేవదాయశాఖ ఉద్యోగి అప్పలరాజు

సాక్షి, విజయనగరం: దేవదాయ శాఖకు చెందిన స్థలంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్న విషయమై సాక్ష్యాధారాలు సేకరించేందుకు వెళ్లిన ఆ శాఖ ఉద్యోగులపై దౌర్జన్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దేవదాయశాఖ అధికారులు, సిబ్బంది ని మెయిన్‌రోడ్‌పై నిలబెట్టి ఆ మాజీ ఎంపీటీసీ, ఆమె కు టుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సాక్ష్యాలను వీడియో చిత్రీకరిస్తున్న దేవదాయశాఖ ఉద్యోగిని దగ్గర్లోని ఓ దుకాణంలోకి లాక్కెళ్లి పిడిగుద్దులు కురిపించి, ఆయన వేసుకున్న దుస్తులు చించేసి... ఆయన మొబైల్‌ఫోన్‌ను లా క్కుని బయటకు తోసేశారు. హతాశులైన దేవదాయశాఖ అధికారులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమపై జరిగిన దౌర్జన్యంపై  ఫిర్యాదు చేశారు.

అసలు కథ ఇదీ..
చీపురుపల్లి మెయిన్‌రోడ్‌లో శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వే నంబర్‌ 45/1లో 1.42 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంలో మెయిన్‌రోడ్‌ను ఆనుకుని 10/15 అడుగుల వెడల్పున తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఆరతి సాహు, ఆమె భర్త రామచంద్రసాహు ఆక్రమణకు పాల్పడినట్లు దేవదాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ స్థలం ఆక్రమించుకుని చాలా కాలంగా అందులో ఉన్న దుకా ణం అద్దెకు ఇచ్చుకుని ప్రతీ నెలా వేలాది రూపాయల ఆదాయం పొందుతున్నారని అంటున్నారు. ఆ స్థలంపై కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని మాజీ ఎంపీటీసీ వాదిస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ఆ స్థలంలో శాశ్వత కట్టడాలు ప్రారంభించడంతో గుర్తించిన దేవదాయశాఖ ఈఓ కిశోర్‌కుమార్‌ సాక్ష్యాలు సేకరించేందుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆరతి సాహుతో పాటు కుటుంబ సభ్యులు అధికారులను అడ్డుకున్నారని, అక్కడ జరుగుతున్న సంఘటన మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తున్న అప్పలరాజు అనే ఉద్యోగిని చితక్కొట్టి, మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారని పోలీసులకు ఈవో ఫిర్యాదు చేశారు. కానీ తాము ఎలాంటి దౌర్జన్యానికీ పాల్పడలేదని, మహిళనైన తనను ఉద్యోగి అసభ్యంగా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడంతోనే అడ్డుకున్నామని ఆరతి వాదిస్తున్నారు. 

ఫిర్యాదు చేశాం 
మెయిన్‌రోడ్‌లో గల శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి సర్వేనంబర్‌ 45/1లో గల స్థలంలో రామచంద్రసాహు కుటుంబ సభ్యులు చేసిన ఆక్రమణలపై ఆధారాలు సేకరించేందుకు వెళ్లాం. అక్కడ జరుగుతున్న పనులను సాక్ష్యంగా చూపేందుకు వీడియో చిత్రీకరిస్తున్న మా ఉద్యోగి అప్పలరాజుపై దౌర్జన్యం చేసి అతనిని నిర్బంధించారు. బట్టలు చిరిగేలా కొట్టి ఆయన వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. – బీహెచ్‌.వి.ఎస్‌.ఎన్‌.కిశోర్‌కుమార్,ఈఓ, దేవదాయశాఖ

ఫిర్యాదు అందింది
మెయిన్‌రోడ్‌లో జరిగిన ఘటనపై దేవదాయశాఖ అధికారులు ఫిర్యాదు చేశా రు. పరిశీలించిన అనంతరం, ప్రాధమిక విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం. 
– సీహెచ్‌.రాజులునాయుడు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, చీపురుపల్లి.

కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి
ఆ స్థలంపై మాకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అవన్నీ పోలీసులకు చూపించాం. దేవదాయశాఖ అధికారులు, సిబ్బందిపై మేము ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. ఆ ఉద్యోగి వర్షంలో ఉన్న నన్ను అసభ్యకరంగా వీడియోలు, ఫొటోలు చిత్రీకరిస్తుంటే అడ్డుకుని, వాటిని డిలీట్‌ చేయాలని కోరాం. ఫోన్‌ కూడా తిరిగి ఇచ్చేశాం.  – ఆరతి సాహు, మాజీ ఎంపీటీసీ, చీపురుపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement