MLA ramalinga Reddy
-
అస్తమించిన పోరుబిడ్డ
సాక్షి, సిద్దిపేట/దుబ్బాక/దుబ్బాక టౌన్: మా లింగన్న అని ఆప్యాయంగా పిలుచుకునే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ వార్త ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాష్ట్ర నలుమూలల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు, లింగన్న అభిమానులు చిట్టాపూర్ చేరుకున్నారు. ఉద యాన్నే హైదరాబాద్ నుంచి చిట్టాపూర్‌కు పార్థివదే హాన్ని తీసుకవచ్చి అభిమానుల కడ సారి చూపు కోసం ఉంచారు. అప్పటికే కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్లు కోవిడ్ నేపథ్యంలో ఎవ్వరూ ఇబ్బందులకు పడకుండా ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు తమ ప్రియతమ నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించాడనే వార్త వినగానే ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఒక వైపు కోవిడ్ భయం ఉన్నప్పటికీ వేలాది మంది చిట్టాపూర్ చేరుకొని తమ నాయకుడిని కడసారిగా చూసి నివాళి అర్పించారు. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటి వద్దనే ఉంచిన పోలిపేట మృతదేహానికి తర్వాత కూడవెల్లి వాగు సమీపంలోని ఆయన సొంత భూమిలో దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో ప్రముఖులు అంతిమయాత్రలో కొద్ది దూరం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలు ముందు పాడె మోయగా.. వెనక బంధువులు పాడెను పట్టారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై పార్థివదేహాన్ని ఉంచి ఊరేగింపుగా తరలించారు. ఇలా చిట్టాపూర్ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన సోలిపేట అంతిమ యాత్ర సిద్దిపేట – మెదక్ ప్రధాన రహదారి మీదుగా.. కూడవెల్లి వాగు సమీపంలోని స్మృతీ వనానికి తరలించారు. అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు సోలిపేట అంతిమ సంస్కారాలు చిట్టాపూర్ గ్రామం కూడవల్లి వాగు సమీపంలో హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం నిర్వహించారు. ఆయన కుమారుడు సతీష్‌రెడ్డి తలకొరివి పెట్టి చితికి నిప్పంటించారు. సోలిపేటకు ప్రముఖుల నివాళి సోలిపేట పార్థివదేహంపై సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. హాజరైన వారిలో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకంట్ల తారక రామారావు, ఈటెల రాజేందర్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. అదేవిధంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి శుభాష్‌రెడ్డి, బోడెపూడి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పద్మాదేవేంద్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, జోగురామన్న, పెద్ది సుదర్శన్‌రెడ్డి, హన్మంత్ షిండే, రాష్ట్ర సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిద్దిరెడ్డి, సీఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవీస్ హాజరై నివాళి అర్పించారు. అన్నీ తానై.. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై దగ్గరుండి నడిపించారు. మంత్రి హరీశ్‌రావుకు మొదటి నుంచి ఎమ్మెల్యే రామలింగారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు మంత్రి హరీశ్‌రావు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. గురువారం రామలింగారెడ్డి మరణించడంతో ఆయన మృతదేహం స్వగ్రామం చిట్టాపూర్ చేరుకోగానే ఉదయం 7 గంటలకే మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో వచ్చి రామలింగారెడ్డి పార్థివదేహాన్ని చూసి కంటతడిపెట్టారు. ఎమ్మెల్యే సతీమణి సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డిని ఓదార్చారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌లకు అన్ని వివరించారు. అంత్యక్రియలకు స్వయంగా మంత్రి దగ్గరుండి కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో చర్చిస్తూ ఏర్పాట్లు చేయించారు. అంత్యక్రియల సందర్భంగా హరీశ్‌రావు పాడె మోసి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకంటూ కంట తడిపెట్టుకున్నారు. -
దండగ నుంచి పండగ దిశగా వ్యవసాయం...
తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టులు దశలవారీగా పూర్తిచేస్తూ చెరువులను నింపడానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో పాలమూరు నుంచి వలస వెళ్లిన కుటుంబాలు పల్లెలకు తిరుగుముఖం పడుతున్నాయి. పంట పెట్టుబడి పథకం వల్ల ఈసారి వానాకాలంలో 10 నుంచి 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. పంటల ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నది. రైతు బీమా పథకం రైతాంగంలొ కొత్త ధీమా నింపింది. ఉమ్మడి పాలనలో వ్యవసాయం అంటే అంటే దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం అంటే ‘పండగ’ అనే సరికొత్త ఆశల వైపు తెలంగాణ రైతాంగం అడుగులు వేస్తోంది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఓరుగల్లు కోటను విడిచి కర్నూలు సీమలో పర్యటించి, ఇప్పటికి కర్నూలు పట్టణానికి 10 నుంచి 15 మైళ్ళ దూరం ఆవలికి వెళ్లి నందికొట్కూరు పల్లెను నిర్మాణం చేసినట్లు నందికొట్కూరు శాససం, రాయలసీమలో లభించిన తామ్ర శాసనాల వల్ల తెలుస్తోంది. అక్కడ అడవులు నరికించి, చెరువులు, గ్రామ నిర్మాణం చేసినట్లు, నూతన గ్రామంలోకి జన ప్రవేశం చేయించి, వారిని వ్యవసాయం వైపు మళ్లించటానికి ప్రత్యేక సంస్కరణలు అమల్లోకి తెచ్చినట్లు శాస నాల్లో లిఖించారు. ప్రతాపరుద్రుడు పల్లె వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి అర్ధ సిరుల కౌలు విధానం నుంచి ‘దశబంధ ఇనాం’ అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అంటే పండించిన పంటలో కేవలం పదోవంతు రాజ్యానికి అప్పగించాలి. ఆరోజుల్లో ఇదో విప్లవాత్మకమైన మార్పు. కాకతీయుల అనంతరం దక్కన్ ప్రాంతాన్ని పాలిం చిన రాజవంశాల్లో కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, స్థానిక ప్రభువులు, సంస్థానాధీశులు అందరూ చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించి కొనసాగించారు కానీ రైతన్న వెన్నుతట్టేంత స్థాయిలో రాయితీలు మాత్రం ఇవ్వలేకపోయారు. దక్కన్ ప్రాంతం ఇండియన్ యూనియల్‌లో కలిసిన తరువాత జరిగిన చెరువుల విధ్వంసం, గ్లోబలైజేషన్ పర్యవసానంతో వ్యవసాయ ఉత్పతనం మొదలై రైతన్నల ఆత్మహత్యలు రోజురోజుకు పెరు గుతూ వచ్చాయి. ఒక్కసారి విత్తనం వేయాలంటే దుక్కిని సాలు, ఇరువాలు చేయాలే, అంటే మూడుసార్లు దున్ని నాలుగోసారి గొర్రు కొట్టాలే. విత్తనం వేసిన దినం నుంచి మొలక బయటికి వచ్చేంత వరకు భూమిని పచ్చి బాలింతను చూసినట్లు చూడాలే. ఆడికి ఆయిపోందా? కండ్లళ్ల కంటిపాపను చంపుకొని పొలానికి నీళ్లు పెట్టాలి. గడ్డీ గాదం కలుపు పడితే తీసేయాలి. ఎర్రబొమ్మిడి రోగం, పేను ముడత, కమ్మాకు రోగం పుట్టరోగం.. ఎప్పటి కప్పుడు కంటిలో ఒత్తులేసుకొని జూసుకుంటూ తగిన మందు కొట్టాలి. ఇవ్వన్ని చేశాక పొలం పండి కోతకొచ్చే ముందు తుఫాను వస్తే... కల్లంలో ధాన్యం తడిసిపోతే రైతు కష్టం.. ప్రాణం గంగ పాలైనట్లే. కాకతీయుల కాలం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో చంద్ర బాబు నాయుడు పాలన వరకు రైతులు పన్నులు కట్టకపోతే ఏ పాలకుడు ఊరుకోలేదు. ‘మేడారం రాజ్యంలో కరువు వచ్చి పంటలు లేక జనం అల్లాడుతున్నారు, ఈ ఒక్కసారి పన్నులు రద్దు చేయమన్నందుకు’ కాకతీయులు మేడారపు దండయాత్ర చేసి నట్లు ‘సమ్మక్క–సారలమ్మ’ చరిత్ర చెబుతోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏడేళ్ల వరుస కరువులో రైతాంగం అల్లాడిపోతున్న వేళ కరెంటు బకాయిలు కట్టలేదని నాటి సీఎం చంద్రబాబు రైతులను జైళ్లో పెట్టించారు. ఇదీ చరిత్ర.నాలుగేళ్ల తెలంగాణ అవతరణ తరువాత రైతు ఆకాంక్షలకు పునాదులు పడుతున్నాయి. రైతే రాజు అయినప్పుడు ఆటువంటి పాలకుని ఆలోచనలు ఎప్పుడూ అన్న దాత పక్షంగానే ఉంటాయి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతన్న ఆత్మవిశ్వాసానికి అద్దంపడుతాయి. బక్కచిక్కిన రైతన్నను బలోపేతం చేసి అంపశయ్య మీద ఉన్న వ్యవసాయానికి ఊపిర్లు ఊదిన ప్రయత్నంలోనే ‘రైతుబంధు, రైతు బీమా’ ‘మిషన్ కాక తీయ’ పథకాలు జనించాయి. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు సహా మొత్తం వ్యవసాయరంగాన్ని సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేయడంతో లక్షలాది రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరు కుపోయాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 70 శాతం మంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని బాగు చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు, 45 వేల చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్తు, మార్కెటింగ్ గిడ్డంగుల నిర్మాణం, పాలీహౌజ్ సాగు, సబ్సిడీపై ట్రాక్టర్ల పంపిణీ, డ్రిప్ ఇరిగేషన్, సమయానికి ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం సహా ఎన్నో రైతు అనుకూల నిర్ణయాలను ప్రభుత్వం తీసుకొని ఆచరణలో పెడుతున్నది. ఈ క్రమంలోనే 17 వేల కోట్ల రుణాలను మాఫీచేసి రైతులకు అండగా నిలిచింది. ఇప్పుడు రైతుల నుంచి పన్నుల వసూళ్లు చేయటం మానేసి ఎదురు పెట్టుబడి పెట్టి అన్నదాతల జీవితాలను ఎలాగైనా గట్టెక్కించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచన చేశారు. అదును మీద రైతును ఆదుకొని విత్తనం, ఎరువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తే... రైతులకు ఆర్థిక భారం తప్పించటంతో పాటు అంతకు మించి వేలాది రెట్ల మానసిక ధైర్యాన్ని రైతు లోకానికి కల్పించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధిం చారు.ఎకరానికి రూ.8 వేలు పంట పెట్టుబడి ఇవ్వడం కోసం బడ్జె ట్లో రూ.12 వేల కోట్లు కేటాయించి తెలంగాణలోని సన్న చిన్న కారు కలిసి 58 లక్షల మంది రైతుబంధులకు ఆత్మ బంధువుగా నిలబడ్డారు. రాష్ట్రంలో రెండున్నర ఎకరాల్లోపు ఉన్న రైతులు 40,92,124 మంది, రెండున్నర నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11,02,813 మంది, 5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4,44,068 మంది, 10 నుంచి 25 ఎకరాల్లోపు ఉన్న రైతులు 94,551 మంది ఉన్నారు. ఒక 25 ఎకరాల పైబడి ఉన్న భూస్వామ్య రైతులు 6,448 మంది (0.11 శాతం) మాత్రమే ఉన్న రు. మొదటి దశ కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున రూ 6 వేల కోట్లు రైతులకు పంచారు. మా ప్రాంతం రైతులను పలకరిస్తే కొండంత ధైర్యంతో ఉన్నారు. రైతులందరి మోముల్లో సంతోషం కనిపిస్తున్నది. గతంలో మాదిరిగా అప్పులు చేసి విత్తనాలు, ఎరువులు తెచ్చుకునే బాధ తప్పింది. రైతులే నేరుగా వెళ్లి నాణ్యమైన విత్తనాల గురించి విచారించుకొని కొనుక్కుంటున్నరు.మిషన్ కాకతీయ కింద చెరు వులు నిండి ఇన్నాళ్లూ బీడు పడి ఉన్న భూములు సైతం సాగు కళ సంతరించుకుంటున్నయి. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు దశల వారీగా పూర్తిచేస్తూ చెరువులను నింపడానికి ప్రాధాన్యం ఇస్తుండ టంతో పాలమూరు నుంచి వలస వెళ్లిన కుటుంబాలు పల్లెలకు తిరుగుముఖం పడుతున్నయి. పంట పెట్టుబడి పథకం వల్ల ఈసారి వానాకాలంలో 10 నుంచి 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. పంటల ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నది. రైతు బీమా పథకం రైతాంగంలో కొత్త ధీమా నింపింది. ఉమ్మడి పాలనలో వ్యవసాయం అంటే దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం అంటే ‘పండగ’ సరికొత్త ఆశల వైపు తెలంగాణ రైతాంగం అడుగులు వేస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
అజ్ఞాతంలోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, బెంగళూరు : ఓవైపు బలపరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ ఇంకా హాజరు కాలేదు. గత రెండు రోజులుగా వీరిద్దరు అందుబాటులో లేని విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి శనివారం ఉదయం ఇక్కడ మాట్లాడుతూ... ఆనంద్ సింగ్ విధాన సభకు వస్తారని, ఆయన కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అంతకు ముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బలపరీక్షపై ఆయన మాట్లాడుతూ... సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో కాంగ్రెస్ నెగ్గడం అంతే నిజమన్నారు. యడ్యూరప్ప ముందుగానే రాజీనామా చేస్తే మంచిదని సూచించారు. 117 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకు ఉందన్నారు. యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ వాజుభాయ్ వాలా మొదటి తప్పు చేశారని, ఇక ప్రోటెం స్పీకర్ ఎంపిక విషయంలో రెండో తప్పు చేశారని రామలింగారెడ్డి విమర్శించారు. మస్కి ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు రెండు రోజులుగా తమకు అందుబాటులో లేకుండాపోయిన మస్కి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం సాయంత్రంలోపు విధానసభలో బలనిరూపణ చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎమ్మెల్యే ప్రతాప్ గౌడను తిరిగి సొంత గూటికి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి వసంతకుమార్...ఎమ్మెల్యే ప్రతాప్ గౌడతో ఫోన్‌తో సంభాషించినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతల సూచనల మేరకు ఆయన తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.25 లక్షలు
దుబ్బాక రూరల్: దుబ్బాకలో నూతనంగా చేపట్టనున్న ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి రూ.25లక్షలను మంజూరు చేయించినట్లు ప్రకటించారు. దుబ్బాక ప్రెస్‌క్లబ్ నిర్మాణానికి నిధులు ప్రకటించిన ఎమెల్యే రామలింగారెడ్డికి దుబ్బాక ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు, సీనియర్ జర్నలిస్టులు ఇంగు శివకుమార్, అంబటి వెంకట్‌గౌడ్, వీరబత్తిని శ్రీనివాస్, కాల్వ లింగం, గన్నె తిరుపతిరెడ్డి, బండ నర్సింలు, పల్లె వెంకటస్వామిగౌడ్, ఇస్తారిగల్ల ఎల్లం, వేములవాడ నవీన్ కుమార్, ఎండి చౌకత్, సుభాష్‌రెడ్డి, జైపాల్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా జర్నలిస్టుల డే సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. -
బతికున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు: రేవంత్
భీమవరం టౌన్: ఏపీ సీఎం చంద్రబాబు పెంచిన నల్లతాచు గ్యాంగ్‌స్టర్ నయీమ్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్‌రెడ్డి స్పందించారు. నయీమ్ బతికున్నప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇప్పుడెందుకు నాట కాలు అంటూ మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా కేబినెట్ మొత్తం గతంలో టీడీపీలోనే ఉండేవారని, పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించే రామలింగారెడ్డి ఆ వ్యాఖ్యలు చేసుంటారని చెప్పారు. -
మీరేం పోలీసులు?
♦ చిన్నపాటి గొడవనూ అదుపు చేయలేరా? ♦ ప్రచార సమయంలో ఖేడ్‌లో తరచూ తోపులాటలు ♦ మేం పోటీ చేయడం మీకిష్టం లేదా అంటూ నిలదీత ♦ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఫైర్ ♦ మెదక్ డీఎస్పీకి ఫోన్.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘మీరేం పోలీసులు..?, చిన్నచిన్న రాజకీయ గొడవలనూ నివారించలేరా...?, కార్యకర్తలనే స్వీయరక్షణ పద్ధతులు అవలంబించాలని పిలుపు ఇవ్వాలా...?, ఉప ఎన్నికల్లో మేం పోటీ చేయడం మీకిష్టం లేకపోతే చెప్పండి?’ అంటూ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో తరచూ జరుగుతోన్న రాజకీయ గొడవలను ముందే పసిగట్టి నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని అసంతృప్తితో ఉన్న ఆయన మంగళవారం మెదక్ డీఎస్పీకి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముందుగా ఎస్పీ సుమతికి ఫోన్ చేయగా ఆమె అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఎమ్మెల్యే సోలిపేటకు ఆగ్రహం రావడానికి దారితీసిన కారణాలు ఇలా.. ఖేడ్ పట్టణంలో మంగళవారం ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం బసవేశ్వర చౌక్ వద్ద టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో ఎదురుపడి మాటామాటా అనుకున్నారు. వాగ్వాదం పెరిగి ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. సాయంత్రం వేళలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతున్న సమయంలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త వాహనంతో వెళ్తుం డగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డు మీద నే వాహనాలు పెట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తన వాహనానికి దారి ఇవ్వాలని టీఆర్ఎస్ కార్యకర్త పట్టుబట్టడంతో ఇద్దరి మధ్యతోపులాట జరిగింది. అదే సమయంలో అటుగా టీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువురిని చెదరగొట్టారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హనుమాన్ నగర్లో ఓ ఇంట్లో కార్యకర్తలతో సమావేశం కాగా కాంగ్రెస్ కార్యకర్తలు నేరుగా ఆ ఇంటి మీదకు గొడవకు దిగినట్టు తెలి సింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి దాడికి సిద్ధం కాగా సోలిపేట వారిం చినట్టు తెలిసింది. వారం రోజుల కిందట కల్హేర్ మండలంలో టీడీపీ నాయకులు వికలాంగుల సంఘం నాయకుడిపై దాడి చేశారు. ఇలా తరచూ చెదురుమదురు సంఘటనలు జరుగుతుండటం, పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మెదక్ డీఎస్పీ రాజారత్నంకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
‘ఇరిగేషన్’పై ఆగ్రహం
{పజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలి ఈఈలపై విచారణకు ఆదేశం ఆక్రమణలు తొలగించాలి హద్దుల నిర్ణయం అధికారులదే.. జిల్లాలో అంచనాల కమిటీ సమీక్ష వరంగల్ : మిషన్ కాకతీయ పనుల్లో అధికారులు అనుసరిస్తున్న తీరు సరిగా లేదని రాష్ట్ర అంచనాల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిర్లక్ష్య ధోరణి తో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయని కమిటీ అభిప్రాయపడింది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి నేతృత్వం లోని అంచనాల కమిటీ బృందం రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం జిల్లాకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం మార్గమధ్యలో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలోని సర్వారాయ చెరువు పనులను సందర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలో కమిటీ జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో చిన్ననీటి పారుదల, దేవాదాయ శాఖ అధికారుల తో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మాట్లాడుతూ.. పర్వతగిరి మండలం కల్లెడలో చేపట్టి న చెరువు పనులపై ఫిర్యాదు అందినట్లు ఆయన అధికారులను ప్రశ్నించారు. ఈ చెరువు అభివృద్ధికి కేంద్రం పుర ప్రాజెక్టు కింద రూ.22.60 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఎస్టిమేట్లు ఎస్సారెస్పీ ఇంజనీర్లు చేశారని సదరు డీఈఈ సమాధానం ఇచ్చారు. మొదటిసారి ఎస్టిమేట్ చేస్తే రూ.50 కోట్లు వస్తే రెండోసారి రూ.25 కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక వ్యక్తి కోసం చెరువుల అభివృద్ధి చేపట్టరాదని, ఈ చెరువుపై పూర్తి వివరాలు కమిటీకి అందించాలని ఎస్ఈ పద్మారావును ఆదేశించారు. ఎస్ఈ పద్మారావు జిల్లా లో మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు, వివరాలను కమిటీకి నివేదించారు. ప్రజాప్రతినిధుల ధ్వజం మండలంలో చెరువుల పునరుద్ధరణ పనులు ఎన్ని జరుగుతున్నాయని ఐబీ ఏఈలను అడిగితే సమాచా రం ఇవ్వడం లేదని రఘునాథపల్లి, మద్దూరు జెడ్పీటీసీలు శారద, పద్మ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో 18 చెరువుల పనులు చేపట్టినా ఒక్క చెరువులో పూడికతీత పనులు ప్రారంభం కాలేదన్నా రు. దీనిపై వరంగల్ ఈఈ సుధాకర్ మాట్లాడుతూ వర్షం వల్ల పనులు చేపట్టలేదని అన్నారు. దీనిపై కమి టీ చైర్మన్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు వర్షం పడింది? ప్రజాప్రతినిధులు ఆరోపిస్తే సమాధానం కూడా చెప్పలేక పో వడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి కమిటీకి నివేదిక అందించాలని ఎస్ఈని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ మురళి మాట్లాడుతూ.. చెరువుల హద్దు నిర్ణయించడంలో రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల పునరుద్ధరణ పనులను అడ్డుకుంటున్నారని కమిటీకి తెలిపారు. చెరువుకు గండి పెడితే ఎందుకు పట్టించుకోలేదు ఏటూరునాగారం మండలం పప్కాపూర్ చెరువు పను ల నిమిత్తం గండి పెట్టడంతో పంట పొలాలు నీటి పాలయ్యాయని జెడ్పీటీసీ వలియాబీ కమిటీకి ఫిర్యా దు చేశారు. మండల కేంద్రంలోని గణేష్‌కుంట చెరువులో తీసిన మట్టిని ఈజీఎస్ రోడ్డుపై పోస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. దీనిపై ఈఈ గోపాలరావు సమాధానం ఇస్తూ ఈ విషయం తన దృష్టికి రాలేదని అనడంతో కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు గండి పెట్టే అర్హత కాంట్రాక్టర్‌కు లేదని, అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఈఈ పనితీ రుపై నివేదిక సమర్పించాలని ఎస్ఈని ఆదేశించారు. ఆక్రమణలను నివారించి.. హద్దులు పెట్టండి.. చెరువుల శిఖం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొల గించాలని, అవసరం అయితే అక్రమించుకున్న వారి పై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడవద్దని అంచనాల కమిటీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. చెరువు పునరుద్దరణ పనులు సజావుగా సాగేందుకు హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జేసీని కమిటీ ఆదేశించింది. మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించాలి.. గిరిజన దేవతలైన సమక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఏడాది పొడవునా మేడారం వస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించింది. మేడారం ఈఓ కార్యాలయం దేవతల గద్దెల వద్ద పనిచేసే విధంగా అధికారులను ఆదేశించాలని ఏసీ రఘునాథ్‌ను కమిటీ ఆదేశించింది. వారం రోజుల్లో ఈఓ కార్యాలయం మేడారంలో ఏర్పాటు చేస్తామని అధికారులు కమిటీకి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కె.ప్రభాకర్‌రెడ్డి, వై.అంజయ్య, వేముల వీరేశం, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, ప్రభాకర్‌రావు, అనుమల్హసన్, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్ఈ పద్మారావు, దేవాదాయ సయుంక్త సంచాలకులు రఘునాథ్, జెడ్పీటీసీలు శోభన్, మాణిక్యం, శివశంకర్ పాల్గొన్నారు. విధుల నిర్వహణపై వాగ్వాదం జిల్లా పరిషత్ కార్యాలయంలో విధుల నిర్వహణ విషయమై ఉద్యోగుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అంచనాల కమిటీ మాట్లాడుతుంటే వారి మాటలను రికార్డు చేసేందుకు మినిట్స్ రాయాలని జనరల్ ఫండ్ విభాగంలో పనిచేసే పాషాను ఎస్టాబ్లిష్మెంట్ సూరింటెండెంట్ కృష్ణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆదేశించారు. అయితే తనకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఉన్నందున జనరల్ ఫండ్, ఎస్ఎఫ్సీ నిధులు పురోగతి నివేదికల తయారీలో బిజీగా ఉన్నందున మినిట్స్ రాయలేనని చెప్పారు. దీంతో పై అధికారులు చెబుతుంటే తిరస్కరిస్తావా.. అంటూ కృష్ణమూర్తి, రాంబాబు పాషాపై అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన పాషా ఎస్టాబ్లిష్మెంట్ విభాగానికి వెళ్లి వారిద్దరితో వాగ్వాదానికి దిగారు. చివరకు సహ ఉద్యోగులు జోక్యం చేసుకోవడంతో వారి మధ్య వివాదం సద్దుమణిగింది. -
ఎమ్మెల్యే సాక్షిగా ఎంపీటీసీపై దాడి!
దుబ్బాక : ప్రజాస్వామ్యం అపహస్యం చేసే విధంగా ఎమ్మెల్యే సాక్షిగా ఓ ప్రజాప్రతినిధిపై అధికారపార్టీకి చెందిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. సోమవారం దుబ్బాక సర్వ సభ్య సమావేశానికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ఆసరా పింఛన్లు రాని లబ్ధిదారులు బైఠాయించి, ఎమ్మెల్యేను అడ్డుకోబోయారు. దీనికంతటికీ ప్రధాన కారణం నీవేనంటూ, అనవసరంగా ప్రజల ను రెచ్చగొడుతున్నావంటూ టీఆర్ఎస్ నాయకులు పెద్ద గుండవెల్లి ఎంపీటీసీ (కాంగ్రెస్) సంజీవరెడ్డిపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వద్దని వారించినా పట్టించుకోకుండా సదరు ఎంపీటీసీ గల్లలు పట్టుకుని బయటకు తోసేశారు. తేరుకున్న పోలీసులు ఇరువురిని శాంతింప జేశారు. సభలో ఏకైక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడిని కాబట్టే తనపై దాడులు చేస్తున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని సంజీవరెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ నిరసన ఆపబోనని, చావడానికైన సిద్ధమేనన్నారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.