{పజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలి
ఈఈలపై విచారణకు ఆదేశం
ఆక్రమణలు తొలగించాలి
హద్దుల నిర్ణయం అధికారులదే..
జిల్లాలో అంచనాల కమిటీ సమీక్ష
వరంగల్ : మిషన్ కాకతీయ పనుల్లో అధికారులు అనుసరిస్తున్న తీరు సరిగా లేదని రాష్ట్ర అంచనాల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిర్లక్ష్య ధోరణి తో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయని కమిటీ అభిప్రాయపడింది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి నేతృత్వం లోని అంచనాల కమిటీ బృందం రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం జిల్లాకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం మార్గమధ్యలో స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలోని సర్వారాయ చెరువు పనులను సందర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలో కమిటీ జిల్లా పరిషత్ సమావేశ మందిరం లో చిన్ననీటి పారుదల, దేవాదాయ శాఖ అధికారుల తో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మాట్లాడుతూ.. పర్వతగిరి మండలం కల్లెడలో చేపట్టి న చెరువు పనులపై ఫిర్యాదు అందినట్లు ఆయన అధికారులను ప్రశ్నించారు. ఈ చెరువు అభివృద్ధికి కేంద్రం పుర ప్రాజెక్టు కింద రూ.22.60 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఎస్టిమేట్లు ఎస్సారెస్పీ ఇంజనీర్లు చేశారని సదరు డీఈఈ సమాధానం ఇచ్చారు. మొదటిసారి ఎస్టిమేట్ చేస్తే రూ.50 కోట్లు వస్తే రెండోసారి రూ.25 కోట్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక వ్యక్తి కోసం చెరువుల అభివృద్ధి చేపట్టరాదని, ఈ చెరువుపై పూర్తి వివరాలు కమిటీకి అందించాలని ఎస్‌ఈ పద్మారావును ఆదేశించారు. ఎస్‌ఈ పద్మారావు జిల్లా లో మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు, వివరాలను కమిటీకి నివేదించారు.
ప్రజాప్రతినిధుల ధ్వజం
మండలంలో చెరువుల పునరుద్ధరణ పనులు ఎన్ని జరుగుతున్నాయని ఐబీ ఏఈలను అడిగితే సమాచా రం ఇవ్వడం లేదని రఘునాథపల్లి, మద్దూరు జెడ్పీటీసీలు శారద, పద్మ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో 18 చెరువుల పనులు చేపట్టినా ఒక్క చెరువులో పూడికతీత పనులు ప్రారంభం కాలేదన్నా రు. దీనిపై వరంగల్ ఈఈ సుధాకర్ మాట్లాడుతూ వర్షం వల్ల పనులు చేపట్టలేదని అన్నారు. దీనిపై కమి టీ చైర్మన్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు వర్షం పడింది? ప్రజాప్రతినిధులు ఆరోపిస్తే సమాధానం కూడా చెప్పలేక పో వడం సరికాదన్నారు. దీనిపై విచారణ జరిపి కమిటీకి నివేదిక అందించాలని ఎస్‌ఈని ఆదేశించారు. జెడ్పీ వైస్ చైర్మన్ మురళి మాట్లాడుతూ.. చెరువుల హద్దు నిర్ణయించడంలో రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల పునరుద్ధరణ పనులను అడ్డుకుంటున్నారని కమిటీకి తెలిపారు.
చెరువుకు గండి పెడితే ఎందుకు పట్టించుకోలేదు
ఏటూరునాగారం మండలం పప్కాపూర్ చెరువు పను ల నిమిత్తం గండి పెట్టడంతో పంట పొలాలు నీటి పాలయ్యాయని జెడ్పీటీసీ వలియాబీ కమిటీకి ఫిర్యా దు చేశారు. మండల కేంద్రంలోని గణేష్‌కుంట చెరువులో తీసిన మట్టిని ఈజీఎస్ రోడ్డుపై పోస్తున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. దీనిపై ఈఈ గోపాలరావు సమాధానం ఇస్తూ ఈ విషయం తన దృష్టికి రాలేదని అనడంతో కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు గండి పెట్టే అర్హత కాంట్రాక్టర్‌కు లేదని, అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఈఈ పనితీ రుపై నివేదిక సమర్పించాలని ఎస్‌ఈని ఆదేశించారు.
ఆక్రమణలను నివారించి.. హద్దులు పెట్టండి..
చెరువుల శిఖం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొల గించాలని, అవసరం అయితే అక్రమించుకున్న వారి పై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడవద్దని అంచనాల కమిటీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. చెరువు పునరుద్దరణ పనులు సజావుగా సాగేందుకు హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జేసీని కమిటీ ఆదేశించింది.
మేడారం భక్తులకు సౌకర్యాలు కల్పించాలి..
గిరిజన దేవతలైన సమక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఏడాది పొడవునా మేడారం వస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించింది. మేడారం ఈఓ కార్యాలయం దేవతల గద్దెల వద్ద పనిచేసే విధంగా అధికారులను ఆదేశించాలని ఏసీ రఘునాథ్‌ను కమిటీ ఆదేశించింది. వారం రోజుల్లో ఈఓ కార్యాలయం మేడారంలో ఏర్పాటు చేస్తామని అధికారులు కమిటీకి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీలు కె.ప్రభాకర్‌రెడ్డి, వై.అంజయ్య, వేముల వీరేశం, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, ప్రభాకర్‌రావు, అనుమల్‌హసన్, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్‌ఈ పద్మారావు, దేవాదాయ సయుంక్త సంచాలకులు రఘునాథ్, జెడ్పీటీసీలు శోభన్, మాణిక్యం, శివశంకర్ పాల్గొన్నారు.
విధుల నిర్వహణపై వాగ్వాదం
జిల్లా పరిషత్ కార్యాలయంలో విధుల నిర్వహణ విషయమై ఉద్యోగుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అంచనాల కమిటీ మాట్లాడుతుంటే వారి మాటలను రికార్డు చేసేందుకు మినిట్స్ రాయాలని జనరల్ ఫండ్ విభాగంలో పనిచేసే పాషాను ఎస్టాబ్లిష్‌మెంట్ సూరింటెండెంట్ కృష్ణమూర్తి, సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆదేశించారు. అయితే తనకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఉన్నందున జనరల్ ఫండ్, ఎస్‌ఎఫ్‌సీ నిధులు పురోగతి నివేదికల తయారీలో బిజీగా ఉన్నందున మినిట్స్ రాయలేనని చెప్పారు. దీంతో పై అధికారులు చెబుతుంటే తిరస్కరిస్తావా.. అంటూ కృష్ణమూర్తి, రాంబాబు పాషాపై అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన పాషా ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగానికి వెళ్లి వారిద్దరితో వాగ్వాదానికి దిగారు. చివరకు సహ ఉద్యోగులు జోక్యం చేసుకోవడంతో వారి మధ్య వివాదం సద్దుమణిగింది.
‘ఇరిగేషన్’పై ఆగ్రహం
Published Wed, May 13 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement
Advertisement