మీరేం పోలీసులు?
♦ చిన్నపాటి గొడవనూ అదుపు చేయలేరా?
♦ ప్రచార సమయంలో ఖేడ్‌లో తరచూ తోపులాటలు
♦ మేం పోటీ చేయడం మీకిష్టం లేదా అంటూ నిలదీత
♦ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఫైర్
♦ మెదక్ డీఎస్పీకి ఫోన్..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘మీరేం పోలీసులు..?, చిన్నచిన్న రాజకీయ గొడవలనూ నివారించలేరా...?, కార్యకర్తలనే స్వీయరక్షణ పద్ధతులు అవలంబించాలని పిలుపు ఇవ్వాలా...?, ఉప ఎన్నికల్లో మేం పోటీ చేయడం మీకిష్టం లేకపోతే చెప్పండి?’ అంటూ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో తరచూ జరుగుతోన్న రాజకీయ గొడవలను ముందే పసిగట్టి నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని అసంతృప్తితో ఉన్న ఆయన మంగళవారం మెదక్ డీఎస్పీకి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముందుగా ఎస్పీ సుమతికి ఫోన్ చేయగా ఆమె అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఎమ్మెల్యే సోలిపేటకు ఆగ్రహం రావడానికి దారితీసిన కారణాలు ఇలా..
ఖేడ్ పట్టణంలో మంగళవారం ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం బసవేశ్వర చౌక్ వద్ద టీఆర్‌ఎస్, టీడీపీ కార్యకర్తలు ప్రచారంలో ఎదురుపడి మాటామాటా అనుకున్నారు. వాగ్వాదం పెరిగి ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. సాయంత్రం వేళలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు గొడవపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతున్న సమయంలో ఓ టీఆర్‌ఎస్ కార్యకర్త వాహనంతో వెళ్తుం డగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డు మీద నే వాహనాలు పెట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
తన వాహనానికి దారి ఇవ్వాలని టీఆర్‌ఎస్ కార్యకర్త పట్టుబట్టడంతో ఇద్దరి మధ్యతోపులాట జరిగింది. అదే సమయంలో అటుగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువురిని చెదరగొట్టారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హనుమాన్ నగర్‌లో ఓ ఇంట్లో కార్యకర్తలతో సమావేశం కాగా కాంగ్రెస్ కార్యకర్తలు నేరుగా ఆ ఇంటి మీదకు గొడవకు దిగినట్టు తెలి సింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రతి దాడికి సిద్ధం కాగా సోలిపేట వారిం చినట్టు తెలిసింది. వారం రోజుల కిందట కల్హేర్ మండలంలో టీడీపీ నాయకులు వికలాంగుల సంఘం నాయకుడిపై దాడి చేశారు. ఇలా తరచూ చెదురుమదురు సంఘటనలు జరుగుతుండటం, పోలీసులు పెద్దగా స్పందించకపోవడంతో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మెదక్ డీఎస్పీ రాజారత్నంకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.