‘గ్రేటర్’ గులాబీ దళపతి ఎవరో?
పెరుగుతున్న ఆశావహుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్:‘గ్రేటర్’లో ఖాళీగా ఉన్న టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవిపై సస్పెన్స్ వీడడంలేదు. ఈ పదవిలో కొనసాగిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రెండు నెలలు కావస్తున్నా ఈ పదవీ బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరికీ కట్టబెట్టకపోవడంతో నగరంలో ఈ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ఊపుతో ఉన్న గులాబీ దళం గ్రేటర్ పరిధిలోనూ ఈసారి కచ్చితంగా ఖాతా తెరుస్తామని గంపెడాశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం తమదేనన్న నమ్మకంతో ఉన్న ఆపార్టీ శ్రేణులు నగరంలో బలహీనంగా ఉన్న పార్టీని పటిష్టం చేసేందుకు యువకుడు,సమర్థులైన వారికే ఈ పదవిని కేటాయించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.
ఈ పదవిపై కన్నేసిన పలువురు నాయకులు ఇప్పటికే అధినేత కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో పార్టీ గ్రేటర్ అధికార ప్రతినిధి మురుగేష్, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మహేందర్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బొంతు రామ్మోహన్, సికింద్రాబాద్‌కు చెందిన ఆళ్లకుంట హరి ముందున్నారు.
మురుగేష్ వైపే అధిష్టానం మొగ్గు..
ఇప్పటికే గ్రేటర్ టీఆర్‌ఎస్ కార్యవర్గంలో చురుకుగా పనిచేస్తున్న అధికార ప్రతినిధి మురుగేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సైతం ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల అధినేత కేసీఆర్‌ను కలిసి తాను పార్టీ పటిష్టతకు చేసిన కృషి, తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్రపై వివరించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు సైతం ఆయనకే మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌తో అనుబంధం ఉన్న నాయకుడు, అందరికీ సుపరిచితుడైన వివాదరహితుడినే ఈ పదవికి ఎంపిక చేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.