పోలింగ్‌కు సర్వం సిద్ధం
శ్రీకాకుళంకలెక్టరేట్,న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు జిల్లాలో సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎంపీ బరిలో 10 మంది, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 84 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. 2009 ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ జరగగా ఈ దఫా 88 శాతానికి పెరిగేలా చూసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో 19,85,239 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 9,93,032 మంది, పురుషులు 9,92,031, ఇతరులు 176 మంది ఉన్నారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో 14,07,659 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 7,05,872 కాగా పురుషులు 7,01,787 మంది. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1,68,126 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 85,394 మంది కాగా పురుషులు 82,722 మంది. విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,09,454 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళలు 2,01,766, పురుషులు 2,07,688 మంది ఉన్నారు.
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి 10 మంది, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 12 మంది, నరసన్నపేటలో ఏడుగురు, ఆమదాలవలసలో 9 మంది, టెక్కలిలో ఆరుగురు, పలాసలో 11 మంది, పాతపట్నంలో ఆరుగురు, ఇచ్ఛాపురంలో 9 మంది, రాజాంలో 9 మంది, ఎచ్చెర్లలో 8 మంది, పాలకొండలో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 2559 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని 1961 పాఠశాల భవనాల సమదాయాల్లో ఏర్పాటు చేశారు. వీటిలో 1336 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇందులో సున్నితమైనవి 807, అతి సున్నితమైనవి 493, తీవ్రవాద ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 26 ఉన్నాయి, 10 పోలింగ్ కేంద్రాలకు రవాణా సౌకర్యం లేదు.
2559 పోలింగ్ కేంద్రాల్లో 6330 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలను వినియోగిస్తున్నారు. వీటిలో నోటా ఆప్షన్ ఉంది. పోలింగ్ స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా 792 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 430 మంది వీడియెగ్రాఫర్లు పోలింగ్‌ను చిత్రీకరించనున్నారు. 450 మంది సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం, పోలింగ్ అనంతరం నిర్దేశిత స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరుకోవడానికి 314 రూట్లు ఏర్పాటు చేశారు. దీనిని 351 మంది రూట్ ఆఫీసర్లు, 351 మంది జోనల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం 294 ఆర్టీసీ బస్సులు, 126 మినీ బస్సులు, 41 వ్యాన్, లారీ, టాటామాజిక్ వాహనాలు, 330 కార్లు, జీపులు వినియోగిస్తున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అత్యధికంగా టెక్కలి నియోజకవర్గంలో 199 ఉండగా, పాతపట్నంలో 139, నరసన్నపేటలో 141, ఇచ్చాపురంలో 147, పాతపట్నంలో 137 ఉన్నాయి. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఎచ్చెర్లలోని శివానీ ఇం జనీరింగ్ కళాశాల భవన సముదాయాల్లో భద్రపరచనున్నా రు. అరకు లోక్‌సభ స్థానం పరిధిలోని పాలకొండ నియోజకవర్గ ఓటింగ్ యంత్రాలను తొలుత పాలకొండ ఏఎంసీ భవనంలో భద్రపరుస్తారు. అనంతరం విశాఖకు తరలిస్తారు.