75.20% జిల్లాలో పోలింగ్ ప్రశాంతం | 75.20% in district polling at karimnagar | Sakshi
Sakshi News home page

75.20% జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

Published Thu, May 1 2014 2:36 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

75.20% జిల్లాలో పోలింగ్ ప్రశాంతం - Sakshi

75.20% జిల్లాలో పోలింగ్ ప్రశాంతం

పెరిగిన పోలింగ్
- 2009 ఎన్నికల్లో 67.05 శాతం
- మంథనిలో అత్యధికం
- కరీంనగర్‌లో అత్యల్పం
- ఉత్సాహం చూపిన యువ ఓటర్లు
- జిల్లా కేంద్రానికి ఈవీఎంలు
- ఈ నెల 16న ఫలితాలు
- అభ్యర్థుల్లో టెన్షన్

 
 సాక్షి, కరీంనగర్ : చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎనిమిది శాతం పోలింగ్ పెరిగింది. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సరాసరి పోలింగ్ శాతం 67.05 నమోదు కాగా.. ఈసారి 75.20 శాతం పోలింగ్ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంథని నియోజకవర్గంలో మిగతా సెగ్మెంట్ల కంటే గంట ముందే పోలింగ్ ముగిసినా.. జిల్లాలో అత్యధికంగా 86.13 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. విద్యావంతులు, అధికారులు కొలువుండే జిల్లా కేంద్రంలో మాత్రం జిల్లాలోనే అత్యల్పంగా 56.28 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగడం, జిల్లా యంత్రాంగం, స్వచ్చంద సంస్థలు ఓటుహక్కుపై విస్తృత ప్రచారం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగింది. దీనికి తోడు అభ్యర్థులు సైతం ప్రజలకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు.

మంథని నియోజకవర్గంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో  6గంటల వరకు పోలింగ్ కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపగా, పట్టణ ప్రాంత ఓటర్లు కాస్త బద్ధకించారు. దీంతో ఆయా పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం పోలిం గ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటరు చైతన్యం కొట్టిచ్చినట్టు కన్పించింది. ఉదయం 7గంటల ప్రాంతంలోనే గ్రామాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల వల్ల కొన్ని సెగ్మెంట్లలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మందకొడిగా పోలింగ్ జరిగింది. జగిత్యాల, మంథని, ధర్మపురి, సిరిసిల్ల, హుస్నాబాద్, వేములవాడ, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఉదయమే పోలింగ్ వేగంగా సాగింది. పలుచోట్ల పోలీసులు, కొంతమంది ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత, పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాలకు, అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కాలేజీకి తరలించారు.

ఈనెల 16న ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పలువురు అభ్యర్థులు విజయవకాశాలపై ఆరా తీస్తుండగా, ఇంకొందరు ఏకంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
 మొరాయించిన ఈవీఎంలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల పోలింగ్ మధ్యలో మొరాయించడంతో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్‌కు అరగంట నుంచి రెండు గంటల వరకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని పెద్దపల్లి, కనగర్తి, పొత్కపల్లి, కాసులపల్లి, పందిల్ల గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ధర్మపురి నియోజకవర్గంలో 17 చోట్ల, రామగుండం నియోజకవర్గంలో 11, మంథని నియోజకవర్గం పరిధిలో 12 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయక ఇబ్బంది కలిగింది.

సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏడు గ్రామాల్లో, చొప్పదండి నియోజకవర్గంలో 13 గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కోరుట్ల నియోజకవర్గంలో ఐదు, వేముల వాడ నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల్లో, జగిత్యాల పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని రాయికల్, సారంగాపూర్‌లలో, మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, శంకరపట్నం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి.

ఓట్లు గల్లంతు..
ఓటరు జాబితా తప్పుల తడక ఉండటంతో పాటు భారీగా ఓట్లు గల్లంతు కావడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఆందోళనకు దిగారు. పలుచోట్ల ఓటు వేయకుండానే వెనుదిరిగారు. కరీంనగరంలోని విద్యానగర్, జ్యోతినగర్, కార్ఖనాగడ్డ, సుభాష్‌నగర్‌తో పాటు పలు కేంద్రాలకు వచ్చిన ఓటర్లు ఓటేయలేదు. నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి గ్రామంలో పోల్‌చిట్టీలు లేకపోవడంతో సిబ్బందిని ఓటర్లను లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు.

సిరిసిల్ల పట్టణంలో తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ వంద మంది ఫిర్యాదు చేశారు. ఈవీఎంలో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తు కనిపించడం లేదని ఆ పార్టీ అభ్యర్థి వెలుముల శ్రీధర్‌రెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. జమ్మికుంట పట్టణంలో పలువురు ఓట్లు గల్లంతు కాగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన తెలిపారు.

ఓటేసిన ప్రముఖులు
జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు వారి గ్రామాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యతో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మి జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఓటు వేశారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ ఎం.సత్యానారాయణరావు దంపతులు, ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పారమిత పాఠశాలలో, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నగేశ్ క్రిష్టియన్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఓటు వేశారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు దంపతులు వావిలాలపల్లిలోని తేజ స్కూల్‌లో, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ జ్యోతినగర్‌లోని కెన్‌క్రెస్ట్ పాఠశాలలో ఓటు వేశారు. పెద్దపల్లి టీడీపీ అభ్యర్థి సిహెచ్.విజయరమణారావు శివపల్లెలో, టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి పెద్దపల్లిలోని ఐటీఐలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావు స్వగ్రామం గజసింగవరంలో ఓటు వేయగా, కోరుట్ల సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కొమొరెడ్డి రాములు మెట్‌పల్లి పట్టణంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎలాల సంతోష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు కోరుట్లలో ఓటువేశారు. కోరుట్ల సెగ్మెంట్ స్వతంత్ర అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి 4వ వార్డులో, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ  18వ , టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ 8వ, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిణి కట్ట సంధ్యారాణి 23వ వార్డులో ఓటు వేశారు. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కమలాపూర్ మండల కేంద్రంలో, కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి హుజూరాబాద్ మండలం జూపాకలో, టీడీపీ అభ్యర్థి ముద్దసాని కశ్యప్‌రెడ్డి వీణవంక మండలం మామిడాలపల్లిలో, వైఎస్సార్సీపీ అభ్యర్థి సందమల్ల నరేశ్ హుజూరాబాద్ మండలం కొత్తపల్లిలో ఓటు వేశారు.

 హుస్నాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీష్‌బాబు, ఆయన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో ఓటు వేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోహెడ మండలం కూరెళ్లలో, సీపీఐ తెలంగాణ ఎన్నికల కమిటీ రాష్ట్ర కన్వీనర్ చాడ వెంకటరెడ్డి చిగురుమామిడి మండలం రేకొండలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement