Ballot votes
-
KSR Live Show: EVMలను పక్కన పెట్టాలి.. EVMలు హ్యాక్ చేయొచ్చు.. బ్యాలెట్ పద్ధతి బెస్ట్..
-
బ్యాలెట్టే బెటర్. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అందరి కన్నూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే..
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యాయి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. -
బ్యాలెట్ ఓట్లలో గోప్యతేది?
కాసిపేట(బెల్లంపల్లి) : రాజ్యాంగం పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రజాస్వామ్యంలో వివాదాలకు తావివ్వకుండా రహస్యంగా ఓటు హక్కును వినియోగించే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం అదే తరహాలో సౌకర్యాలు కల్పించి శాంతియుతంగా ఓటు హక్కుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల విధుల నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కల్పించిన బ్యాలెట్ ఓటులో మాత్రం గోప్యత కరువైందని ఉద్యోగులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు జంకుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ముందస్తుగా వారికి కేటాయించిన ఓటును వినియోగించుకోవల్సి ఉంటుంది. గ్రామాలలో నలుగురైదుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా అందులో ఎన్నికల విధులు నిర్వహించే వారు ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఈ క్రమంలో బ్యాలెట్ ఓట్లపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓటుకు దూరంగా ఉంటున్నారు. ముందస్తుగా వేసిన ఓటుకు సంబంధించి కనీసం బ్యాలెట్‌పై స్వస్తిక్ ముద్ర వేయాల్సి ఉండగా అది అందుబాటులో ఉంచడం లేదు. దీంతో సంబంధిత బ్యాలెట్‌పై నచ్చిన అభ్యర్థికి పెన్నుతో టిక్ మార్కు చేసి వదిలేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఓట్లు కౌంటింగ్ చేసేటప్పుడు ఒకటి, రెండు ఓట్లు కావడంతో ఎవరికి వేశారని అభ్యర్థులు విచారించుకునే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఆర్వోలు వచ్చిన రెండు, మూడు ఓట్లను వ్యాలెట్ ఓట్లు అంటూ అభ్యర్థులకు, ఏజెంట్లకు చూపిస్తున్నారని ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మినహా సర్పంచ్, ఎంపీటీసీ , వార్డు ఎన్నికల్లో తక్కువ మంది బ్యాలెట్ ఓటు వినియోగించుకునే ఉద్యోగ ఓటర్లు ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఉద్యోగులకు బ్యాలెట్ ఓట్లలో గోప్యత లేకుండా పోయిందని గతంలో అభ్యర్థుల గెలుపు, ఓటములు నిర్దేశించే సమయంలో మాత్రమే బ్యాలెట్ ఓట్లు లెక్కించే వారని ప్రస్తుతం ప్రమాదకరంగా పరిస్థితులు మారాయని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. అన్ని కార్యాలయాల్లో స్వస్తిక్ మార్కు ముద్ర పెట్టడంతోపాటు ఓట్లను అభ్యర్థులకు మొదట చూపకుండా పూర్తి స్థాయి ఓట్లలో కలిపితేనే ఓటుకు విలువ ఉంటుంది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని స్వస్తిక్ మార్కు అందుబాటులో ఉంచాలని లేదంటే చాలా గ్రామాల్లో ఉద్యోగులు ఓటుకు దూరంగా ఉండే పరిస్థితులు నెలకొంటాయని పలువురు పేర్కొంటున్నారు. -
ముందుగా ‘పారదర్శకత’ కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలపై సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం ప్రధానంగా పోలింగ్‌లో ఈవీఎంల విధానానికి స్వస్తి చెప్పి మళ్లీ బ్యాలెట్ విధానానికి రావాలని ప్రతిపాదించాయి. పాలకపక్షంలోని శివసేన సహా 70 శాతం పార్టీలు బ్యాలెట్ విధానానికే స్వాగతం పలికాయి. మళ్లీ బ్యాలెట్ విధానం ఎందుకని వాదించిన పార్టీలు కూడా ఈవీఎంలను మరింత పటిష్టం చేయాలని, లోపరహితంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చాయి. గత వరుస ఎన్నికల్లో ఓటమి మింగుపడని బీజేపేతర ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ విధానాన్ని డిమాండ్ చేస్తున్నాయనే విషయం ప్రజలకు తెల్సిందే. ఏ సాంకేతిక పరిజ్ఞానానికి సరైన భద్రతలేని భారత్‌లాంటి వర్ధమాన దేశంలో ప్రతిపక్షాల విమర్శలను, సూచనలను ఎన్నికల కమిషన్ తీవ్రంగానే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన కొన్ని ఎన్నికల్లో పలు ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో ఇది మరింత అవసరం. అఖిలపక్ష సమావేశం అనగానే ముందుగా ప్రధాని మోదీ జమిలి ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతారని అందరు ఆశించారు. ఎందుకోగానీ ఆయన ఆ ప్రస్థావననే తీసుకరాలేదు. ఎన్నికల సందర్భంగా పార్టీలు పెడుతున్న ఖర్చులపై కూడా పరిమితి ఉండాలన్న విషయం కూడా చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపైనే పరిమితులు ఉన్నాయి. పార్టీకి కూడా పరిమితులు విధిస్తే అభ్యర్థులు తమ ఖర్చులను పార్టీ కోటాలో వేస్తారన్న ఉద్దేశంతో నాడు పార్టీల ఖర్చుపై పరిమితులు విధించలేదు. ఎక్కువ మంది అభ్యర్థులు, పాలకపక్ష అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చుచేస్తున్నారని, అయితే వాటి వివరాలను వెల్లడించడం లేదన్నది ప్రజలందరికి తెల్సిందే. ఇప్పుడు పార్టీకి పరిమితులు విధించినా రేపు అదే జరుగుతుందని, పార్టీలు పరిమితికి మించి ఖర్చు పెట్టి, లెక్కలను పరిమితి లోపల చూపిస్తాయని తెలిసిందే. అందుకని ఆ పరిమితి విధానం వల్ల పెద్దగా లాభం లేదు. పార్టీలకు విరాళాల విధానం మరింత పారదర్శకంగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందులో న్యాయం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానం సవ్యంగా లేదు. అది పాలకపక్షానికి అనుకూలంగా ఉంది. పారదర్శకతా లేదు. అందులో తక్షణం సంస్కరణలు అవసరం. అలాగే ఆరు జాతీయ పార్టీలు ప్రజా స్క్రూటినీకి వీలుగా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకరావాలని 2013లో కేంద్ర సమాచార కమిషనర్ సూచించారు. నాడు దాన్ని నిర్లక్ష్యం చేసిందీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అయినందున ఆ అంశాన్ని తీసుకరావాలంటే కాంగ్రెస్‌కు ఇబ్బందే ఉంటుందిగానీ పారదర్శకత కావాలంటే ఆ సూచనను అమలు చేయాల్సిందే. అందుకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందే. -
పోస్టల్ బ్యాలెట్లపై రగడ
అద్దంకి, న్యూస్‌లైన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో తలెత్తిన వివాదం శనివారం ఉపాధ్యాయుల ధర్నాకు దారితీసింది. అధికారులు రోజుకో మాట మార్చడంతో సుమారు 300 పోస్టల్ ఓట్లు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఏ మండలంవారు ఆ మండలంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాలని అధికారులు తొలుత సూచించారు. దీంతో సుమారు 1000 వరకూ ఆయా మండలాల్లో పోలయ్యాయి. ఇంకా 300 పోస్టల్ ఓట్లు పోలవ్వాల్సి ఉన్నాయి. వీటిని అద్దంకిలోనే వేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులు ఓట్లు వేసేందుకు శుక్రవారం అద్దంకి రాగా వారికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాలెట్ ఓట్లు చేతికి ఇవ్వమని, పోస్టులో పంపిస్తామని అధికారులు సెలవిచ్చారు. దీంతో ఖంగుతిన్న ఉపాధ్యాయులు తహసీల్దార్ జీ సుజాత దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఉదయం వస్తే బ్యాలెట్ పేపర్లు చేతికిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఉపాధ్యాయులు కార్యాలయానికి వెళ్లగా అక్కడ అధికారులు కనిపించలేదు. ఉన్నతాధికారులకు ఫోన్ చేయగా బ్యాలెట్ పేపర్లు పోస్టులోనే పంపుతామ ని సెలవిచ్చారు. దీంతో ఆగ్రహించిన ఉ పాధ్యాయులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వరరావు అక్కడకు చేరుకుని ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ సుజాతతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్వో ఆదేశాలు అలానే ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో శని, ఆదివారాలు సెలవులు కావడంతో పోస్టల్ బ్యాలెట్లు అందే అవకాశం లేదని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఓట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఓట్లు చెల్లకుండా పోతే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులు వెనుదిరిగారు. గంగాధర్, బాబూరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.