సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాదరణలేక ఓడిపోయిన పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని పీలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు.
- రసాభాసగా పీలేరు టీడీపీ కార్యవర్గ సమావేశం
- తెలుగు తమ్ముళ్ల మధ్య భగ్గుమన్న విభేదాలు
- సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పార్టీలో చేర్చుకోవడమేమిటి ?
- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జికి ఆహ్వానం లేకపోవడంపై మండిపాటు
పీలేరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాదరణలేక ఓడిపోయిన పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని పీలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో లేకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించకుండా కొత్తవారిని తెరపైకి తీసుకురావడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీలేరు నియోజకవర్గానికి పార్టీ తరపున ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మల్లారపు రవిప్రకాష్‌తో పాటు మరికొందరు ముఖ్యనేతలను పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. బుధవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గ సమావేశం జరిగింది. వేదికపైకి పార్టీనేతలను కారపాకల భాస్కర్‌నాయుడు ఆహ్వానిస్తున్నారు.
పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలను ఆహ్వానించకపోవడంపై పలువురు నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వా నం పలుకడాని నీవు ఎవరు? నీ అర్హత ఏమిటని వారు భాస్కర్‌నాయుడిని నిలదీశారు. దీంతో వివా దం చినికిచినికి పెద్దదైంది. ఇంతలో కోటపల్లె బాబురెడ్డి కలుగజేసుకుని నాయకుల్ని సముదాయించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు శాంతించారు. సమావేశంలో నేతలు రెండు సామాజికవర్గాలుగా విడిపోయి వాగ్వివాదానికి దిగడం చర్చనీయాంశమైంది.
తాత్కాలికంగా వివాదం సమసిపోయినా అంతర్గతంగా విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలిసింది. ఇదిలా ఉండగా నియోజకవర్గం పరిధిలోని పీలేరు, కలికిరి, కేవీపల్లె, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లోని కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించి, నియోజకవర్గ స్థాయిలో సమన్వయంతో పని చేయాలని పలువురు నేతలు సమావేశంలో సూచించారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా....
పీలేరునియోజకవర్గలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ అన్నారు. గెలుపోటములు సహజమని ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన ఉద్దేశమన్నారు. అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కోటపల్లె బాబురెడ్డి, చింతగింజల శ్రీరామ్, రఘురామిరెడ్డి, దద్దాల హరిప్రసాద్‌నాయుడు, జనార్ధన్‌నాయుడు, తిరుపతినాయుడు, వెంకట్రమణారెడ్డి, ఆతికా షఫీ, చిన్నరెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.


