
కాంగ్రెస్ సమూల ప్రక్షాళన!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సమూల ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు జూలై నెలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది.
జూలైలో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ!
పార్టీ పదవుల్లో యువతరానికి పెద్దపీట వేసే చాన్స్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సమూల ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు జూలై నెలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. దశాబ్దంపైగా పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారిలో కొందరికి ఉద్వాసన పలకాలని యోచిస్తున్నట్టు, వారి స్థానంలో యువతరం నేతలకు పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి దారితీసిన కారణాలను అన్వేషించేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అనధికారిక కమిటీ తన నివేదికను జూలై 6 తరువాత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించనున్నట్టు సమాచారం. దీంతో ఆ తరువాతే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశముంది.
అన్ని స్థాయిల్లోనూ మార్పులు!
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకోవడం, కేవలం 44 స్థానాలకే పరిమితమవడం విదితమే. దీంతో పార్టీ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని సోనియాగాంధీకి కట్టబెడుతూ కాంగ్రెస్‌లో అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకోవడమూ తెలిసిందే. సంస్థాగతంగా కొన్ని మార్పులు చేయనంతవరకు మనకు ఎదురయ్యే తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని సోనియాగాంధీ సైతం ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో అన్ని స్థాయిల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక రాగానే ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టేది ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై కసరత్తు చేస్తున్న ఆంటోనీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, కార్యదర్శులు ఆర్‌సీ కుంతియా, అవినాశ్ పాండేలతో కూడిన కమిటీ ఇప్పటివరకు ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ఈ కసరత్తును నెలాఖరులోగా ముగించాల్సి ఉంది. అయితే ఈ కసరత్తు జూలై 6 వరకు పట్టవచ్చని, ఆ తరువాతే నివేదికను సోనియాకు అందజేయవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ‘చింతన్ శిబిర్’ను కూడా నిర్వహించేందుకు ఆస్కారముందని చెప్పాయి.