తొలి సార్వత్రిక ఎన్నికల్లో వింత
ఓటర్ల జాబితాలో పేర్లు లేని వైనం
వైఫాఫ్, డాటరాఫ్ అంటూ నమోదు
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది...
మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు.
ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్‌కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు.
రాజస్తాన్‌లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్‌లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ!
Comments
Please login to add a commentAdd a comment