హరియాణాలో ఆసక్తికర పోరు
10 లోక్‌సభ స్థానాలకూ నేడే పోలింగ్
ఫైనాన్షియల్, కార్పొరేట్ హబ్‌గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్‌సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్‌లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి.
ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్...
కురుక్షేత్ర.. నువ్వా నేనా!
మోదీ వేవ్‌లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్ నాయబ్ సింగ్ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్‌ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా తొలిసారి లోక్‌సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
హిసార్... ప్రాంతీయ పారీ్టల అడ్డా
రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం భజన్‌లాల్ పెట్టిన హరియాణా జనహిత్ కాంగ్రెస్‌ను ఆయన కుమారుడు కుల్‌దీప్ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. దేవీలాల్ ముని మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్‌ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్ తల్లి నైనా సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్ కుంటుంబానికే చెందిన దేవీలాల్ తనయుడు రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్, ఐఎన్‌ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు.
ఫరీదాబాద్.. బీజేపీ హ్యాట్రిక్ గురి
ఈ పారిశ్రామిక హబ్‌లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ కృష్ణ పాల్ గుజ్జర్ హ్యాట్రిక్‌పై గురిపెట్టారు. కాంగ్రెస్ నుంచి మహేంద్ర ప్రతాప్ సింగ్, జేజేపీ నుంచి నళిన్ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.
రోహ్‌తక్... కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్
మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి దీపీందర్ సింగ్ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.
అంబాలా... దళితులే కీలకం
ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్ లాల్ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములానా సిట్టింగ్ ఎమ్మెల్యే వరుణ్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్‌పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.
సిర్సా... కాంగ్రెస్ వర్సెస్ మాజీ
బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునితా దుగ్గల్‌ను కాదని అశోక్ తన్వర్‌కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్ చేయడం విశేషం! కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్‌ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment