సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్‌కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్‌గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.
కౌంటింగ్‌లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్‌లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.
అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్‌లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment