నీ గెలుపు నావల్లే... రుణం తీర్చుకో!!
నా వల్లే నీ గెలుపు సాధ్యమైంది అందుకు పెట్టిన ఖర్చు వెనక్కు ఇచ్చేయ్ అని తెగ సతాయిస్తున్నార ట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను అదే జిల్లాకు చెందిన ఎంపీ ఒకరు. కారణాలేమైనప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన ఓ పెద్దాయన ఈసారి గెలిచేశారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆయన దాదాపు ఆస్తులు అమ్మకానికి కూడా పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు చేతిలో పైసలు లేవు.
నా ఆస్తులు తీసుకుని మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని బతిమిలాడుకున్న సదరు ఎంపీ అభ్యర్ధి ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఓ ఎమ్మెల్యే గారిని ప్రతి రోజూ డబ్బుల కోసం సతాయిస్తున్నారట. నా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న మీరు ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లలో ఖర్చు చేశాను. ఆ డబ్బును నాకు వెంటనే ఇచ్చేయండి లేదంటే అవి ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు అని భయపెడుతూ ఇంకో అడుగు ముందుకేసిన ఆయన వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఎలా వస్తుందో చూస్తా అని హెచ్చరిస్తున్నారట. ఎన్నికల ముందు వరకూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులు ఫోన్లు చేస్తే కనీసం స్పందించని ఎంపీ గారు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇలా బెదిరింపులకు దిగుతున్నారేంటబ్బా అని టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారట.