ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ గాలం | Corporate democracy and angling, says Dilip reddy | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ గాలం

Published Fri, Nov 21 2014 12:11 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ గాలం - Sakshi

ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ గాలం

సమకాలీనం
 
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలే మారుతున్నట్టు కనిపిస్తోంది. చట్టసభల్లో విపక్షం గొంతు వినిపించకూడదు, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే శక్తులు బయట కనిపించకూడదు అనే ధోరణిని పాలకపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు తెలుగునాట  తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మూడిటిదీ అటు ఇటుగా ఇదే వైఖరి. ‘‘మనం దేశంలో అతి పెద్ద పార్టీ కావాలి!’’ అని అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంలో తప్పు లేదు. ‘‘మనం మాత్రమే మిగలాలి’’ అనే వైఖరిని ప్రదర్శించడం మింగుడుపడేది కాదు.
 
చిన్న చిన్న కంపెనీల్ని విలీనం చేసుకుంటూ బహుళజాతి సంస్థలు బలపడే తరహాలోనే నేడు భారత రాజకీయాల్లో నూతన విధ్వంస సంస్కృతి పెచ్చరిల్లు తోంది. శరవేగంగా రాజకీయాల కార్పొరేటీకరణ జరుగుతోంది. ఇదివరలో రాజకీయ పక్షాలు తాము ప్రజలకు దగ్గరై బలపడాలనీ, ఇతర రాజకీయ పార్టీలు ప్రజల మద్దతు కోల్పోయి బలహీనపడాలని కోరుకునేవి. ఇప్పుడు ఆ వైఖరి పూర్తిగా మారుతోంది. కొన్ని రాజకీయ పక్షాల్లో,  ఇతర రాజకీయ పార్టీల పొడ గిట్టని అసహనం పెరిగిపోతోంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఉనికే ఉండకూడ దన్న ఏకపక్ష ధోరణితో అవి పార్టీలకు పార్టీలనే సమూలంగా నిర్మూలించే అనై తిక, అభ్యంతరకర చర్యలకు దిగుతున్నాయి.

రాజకీయ స్పర్థలు ఎన్నికల వరకు ఉండటం, పిదప కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ ఎన్నికలవరకు ఎవరి పనుల్లో వారుండటం సహజంగా జరిగేది. కానీ, ఇటీవల ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలే మారుతున్నట్టు కనిపి స్తోంది. చట్టసభల్లో విపక్షం గొంతు వినిపించకూడదు, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే శక్తులు  బయట కనిపించనే కూడదు అనే ధోరణిని పాలకపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారుతోంది.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగునాట.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం మూడూ పాలక పక్షాలుగా కొంచెం అటుఇటుగా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. చట్టాలు, సంప్రదాయాలు, కనీస విలువలకు తిలోదకాలిచ్చి ప్రత్యర్థి పార్టీల వారిని తమ పార్టీల్లోకి లాక్కుంటూ అవి అనుసరిస్తున్న విధానాలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. ఒక రకంగా ఈ మూడు పాలకపక్షాలు తమ నూతన విధ్వంస సంస్కృతి విస్తరణకు తెలుగునేలను ప్రయోగశాలగా వాడుకుంటున్నట్టు స్పష్టమౌతోంది.

ఒకవంక ప్రత్యర్థి రాజకీయ పార్టీల నిర్మూలన, మరో వంక బాగా పలుకుబడి, అర్థ-అంగ బలమున్న కార్పొరేట్ శక్తుల్ని కీలక పదవుల్లోకి తెస్తూ అతివేగంగా రాజకీయాల్ని కార్పొరేటీకరణ చేస్తున్న తీరూ కలసి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తల ప్రాధాన్యత క్రమంగా తగ్గు తోంది. పెట్టుబడిదారులకు, వ్యవహారకర్తలకు, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నయా రాజకీయ సంస్కృతిలో కుల సమీకరణలు, సామాజిక అమరికలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.

విలువలు, విధానాల కన్నా ఎత్తులు-ఎత్తుగడలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి. ఒకసారి గెలిచామంటే ఎదురులేని విధంగా స్థిరపడాలి. మళ్లీ ఎన్నికల నాటికి ‘ఏ పరిస్థితుల్నయినా’ ఎదుర్కోగల బలాన్ని, బలగాన్ని, ఇతర  వన రుల్ని, సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. పనిలో పనిగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వీలయినంతగా బలహీనపర్చడం, అవకాశముంటే పూర్తిగా మట్టుపె ట్టడం అన్న పంథాను బహిరంగంగానే కొన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి.
 
ఇద్దరు మోదీలను చూశాం    

ఎన్నికల ముందు పవన్ కల్యాణ్‌ను పక్కన కూర్చోబెట్టుకుని, తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి...  తెలివైన సర్దుబాట్లు, వ్యూహాత్మక ఎత్తుగడలతో తలప డిన నరేంద్రమోదీని చూశాం. ఎన్నికల తర్వాత, బీజేపీని, ఆ పార్టీ నేతృత్వం లోని ఎన్డీఏ కూటమిని ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయ తీరాలు దాటించిన నవ్య నరేంద్ర మోదీని చూశాం. ఇద్దరు మోదీల మధ్య ఎంత వ్యత్యాసముందో, అంతగానూ దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలు నేడు మార్పులకు గురవు తున్నాయి. సరిగ్గా ఆరేడు మాసాల క్రితం.. ప్రాంతీయ రాజకీయశక్తులు ప్రధాన జాతీయ పార్టీలకే వెన్నులో చలిపుట్టించే స్థితి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారు మారైంది.

ఎన్డీఏ, ముఖ్యంగా దాని పెద్దన్న బీజేపీ దెబ్బకు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు కుదేలయ్యాయి. కాంగ్రెస్ ఖంగు తింది. 543 లోక్‌సభ స్థానా ల్లో కాంగ్రెస్ తనకు తానుగా 44 స్థానాలు తెచ్చుకోగా, దాని నేతృత్వంలోని యూపీఏ 58 స్థానాలకు పరిమితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంకీర్ణ ధర్మాల వ్యాకరణాన్నే మార్చేసిన రాజకీయ వాతావరణం పురుడు పోసుకుంది. ఇప్పుడు దాన్ని పెంచి పెద్దచేసే బాధ్యత బీజేపీ అధినాయకత్వం భుజాలకెత్తుకుంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన జేడీ(యు), ఎస్పీ, ఆర్జేడీ, ఐఎన్‌ఎల్‌డి వంటి రాజకీయ శక్తులన్నీ ‘జనతా పరివార్’గా కూటమి కట్టి పునరేకీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి.

రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలూ బలంగా ఉంటే తప్ప ప్రాంతీయ పార్టీల కథ ముగిసినట్టు కాదని సంకేతాలిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలపడ్డ క్రమంలోనే కాంగ్రెస్ బలహీన పడ్డ తీరు రాజకీయ శూన్యతకు ప్రతీకనీ, అది ప్రాంతీయ శక్తుల విస్తరణకు అనుకూలించే అంశమనీ వారి వాదన. కానీ, ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ నూతన అధ్యక్షుడు అమిత్ షాల జోడీ విజృంభిస్తున్న తీరు మాత్రం ప్రాంతీయ శక్తులది మేకపోతు గాంభీర్యమేనా? అన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది. నిన్నటి హర్యానా, మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు, రేపటి ఎన్నికలకు సమాయత్తమౌతున్న జమ్మూ- కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పన్నుతున్న వ్యూహాలు ఈ అనుమా నాల్ని బలోపేతం చేస్తున్నాయి. ప్రాంతీయశక్తుల్ని కొల్లగొట్టయినా బీజేపీని అప్ర తిహత శక్తిగా మలచాలన్న వారి యుక్తులు అడుగడుగునా స్పష్టమౌతున్నాయి.
 
మరిన్ని కుయుక్తుల బాటలో...    

ఎన్నికల ముందు మాయావతి, ములాయంసింగ్, లాలూప్రసాద్, మమతా బెనర్జీ, శరద్‌పవార్, కరుణానిధి, జయలలిత, నవీన్ పట్నాయక్, నితీష్‌కు మార్... ఇలా ఎవరికి వారే బలమైన శక్తులుగా కనిపించారు. వారి ప్రభావం బలంగా ఉండి రెండు ప్రధాన జాతీయ పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు   వణుకు పుట్టించాయి. బీజేపీ తనదైన శైలిలో ప్రచార వ్యూహాలు, పొత్తుల ఎత్తు లతో, ఆరెస్సెస్ వంటి శక్తుల ఎత్తుగడలతో కొంత ధీమాగానే సాగింది.

అయితే, సొంతంగా 282 స్థానాలు గెలిచిన బీజేపీ మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగాను ఎన్టీఏకు 336 స్థానాలు గెలిపించి పెట్టడం రాజకీయ పక్షాల్లో కొంత విస్మయాన్ని కలిగించింది. కానీ, అది మోదీలో కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. మెలమెల్లగా పార్టీని ‘అఖండ బీజేపీ’గా మలచి, రాబోయే  సార్వత్రిక ఎన్నికల నాటికి దాన్ని అప్రతిహత శక్తిని చేయాలన్న వ్యూహానికి అది ఊపిరి పోసింది. అమిత్‌షా అందుకు తోడయ్యాడు. ‘‘మనం దేశంలోనే అతిపెద్ద పార్టీ కావాలి’’ అని అమిత్ షా పార్టీశ్రేణులకు పిలుపునివ్వడంలో ఏ తప్పూ లేదు. కానీ, కాలక్రమేణా మనం మాత్రమే మిగలాలి అన్న ధోరణిని ప్రదర్శించడం ప్రత్యర్థి పక్షాలు జీర్ణించుకోలే కపోతున్నాయి.

సంకీర్ణ భాగస్వాముల అలకలు, ప్రాంతీయ శక్తుల ప్రాబల్యా లకు మొన్నటి ఎన్నికలకు ముందు ఎంతగానో జడిసిన బీజేపీ... తద్విరుద్ధంగా ఎన్నికల తదుపరి శివసేన పట్ల అనుసరించిన వైఖరే అందుకు నిదర్శనం. పాతికేళ్ల మిత్రపక్షాన్ని మహా  ఎన్నికల్లో దూరం పెట్టి, కడకు ఫలితాల్లో చుక్కలు చూపించింది. బెట్టు చేస్తే రేపు, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌కూ ఇదే గతి తప్పదేమో! అంతేగాక సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బహుమతి లభించిం దన్న ధీమాతో అది కశ్మీర్, బీహార్‌లలో కూడా కొత్త ఎత్తుగడలకుపోతోంది. ఇదొక పార్శ్వం మాత్రమే! అసలు ఎత్తుగడ అస్సాంలో కనిపిస్తోంది.

20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరవచ్చన్న బీజేపీ శాసనసభా పక్షనేత మాటలకు అక్కడి తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుపా నులో అరటాకులా అల్లల్లాడుతోంది. మూడింట రెండొంతుల మందిని చేర్చు కుంటే పార్టీ మార్పిళ్ల చట్టం వర్తించదని, ‘విలీనం’ కిందకు వస్తుందని అటు పావులు కదుపుతున్నారు. 126 సభ్యుల సభలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 78. ఇప్పటికే 31 మంది కాంగ్రెస్ సభ్యులు వేరు కుంపటి పెట్టుకున్నారు.  
 
ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఇలాంటి అనైతిక పార్టీ మార్పిళ్ల గురించి, కార్పొరేట్ శక్తులకు పరుస్తున్న ఎర్ర తివాచీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ అసెంబ్లీలో ఏకపక్షంగా తెలుగుదేశం సభ్యుల్ని వారం పాటు సస్పెండ్ చేస్తే గట్టిగా గొంతెత్తే విపక్షం లేదు. తమ నాయకుల్ని పాలకపక్షం చట్ట వ్యతిరేకంగా లాక్కుంటోందని అరిచి గీపెట్టి, కడకు కాంగ్రెస్ కూడా సస్పెన్షన్‌కు గురి కావాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరీ అన్యాయం. బ్యాలెట్ పెట్టెల్లో తడి ఆరకముందే పార్టీ ఫిరాయించి, అవతలి పక్షం కండువాలు ధరించిన ఎంపీపై ఫిర్యాదు చేసి నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ చర్య లేదు.

ఇక అక్కడి కార్పొరేటీకరణ బహిరంగ రహస్యమే! ప్రతి ఎన్నికలప్పుడు, ముందూ, వెనుకా అక్కడి పాలక పక్షానికి ధన వ్యవస్థతో ఊడిగం చేయిస్తున్న కార్పొరేట్ శక్తుల, వ్యక్తుల ప్రాబల్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంలో, పార్టీలో, ఎంపీల్లో, ఎమ్మెల్యేల్లో, ఎమ్మెల్సీల్లో.... అంతటా వారిదే ముఖ్యపాత్ర. పార్టీ సాధారణ కార్యకర్తలు ఎన్నికలప్పుడు పౌరుల్ని ఓటర్లుగా మార్చే సైనికులు మాత్రమే! ప్రజాస్వామ్యం, వేదికల మీద దంచే ఉపన్యాసాలకు పనికొచ్చే ముడిసరుకు మాత్రమే! ఇదీ పరిస్థితి!!  

ఆర్. దిలీప్ రెడ్డి  
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement