టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్ | TDP the paper flap | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్

Published Sat, Jun 7 2014 12:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్ - Sakshi

టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్

  •      జీహెచ్‌ఎంసీ ‘స్టాండింగ్’ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్-ఎంఐఎం కూటమి
  •      అన్ని పార్టీల్లో  భారీగా క్రాస్ ఓటింగ్
  •      ఈ పాలకమండలి ఉండేది డిసెంబరు 3 వరకే
  • సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రభావం జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది. ఆ ఎన్నికల మాదిరే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అదే తరహాలో పలు ప్రలోభాలు.. ముడుపుల పంపిణీ జరిగినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రాస్ ఓటింగ్‌పై భారీ నమ్మకంతో ఈసారి ఎలాగైనా స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, ఎంఐఎం కూటమికి పడి టీడీపీకి నిరాశ మిగిలింది.  

    గెలిచిన వారిలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి కంటే టీడీపీకి రెండు ఓట్లు తక్కువగా వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఎప్పటిలాగే విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎనిమిదిమంది, ఎంఐఎం నుంచి పోటీలో నిలిచిన ఏడుగురు గెలిచారు. టీడీపీ, బీజేపీల నుంచి చెరొకరు పోటీ చేయగా ఇద్దరూ ఓటమి పాలయ్యారు.
     
    భారీగా క్రాస్ ఓటింగ్

    ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించినట్లుగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అన్ని పార్టీల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆయా పార్టీలకు దక్కిన ఓట్లను బట్టి తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు.. తర్వాత పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు.. కార్పొరేటర్‌గా పోటీ చేసినప్పుడు అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారు.

    అనంతరం వారు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారినప్పటికీ రికార్డుల్లో అది నమోదు కావడం లేదు. ఆయా పార్టీలు.. నేతలు.. కార్పొరేటర్ల మధ్య అవగాహనతో మాత్రమే పార్టీ మారిన వారిని కొత్తపార్టీ సభ్యులుగా పరిగణిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, తదితర సమయాల్లోనూ ఇదే అమలవుతోంది. పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి.. అనంతరం ఆయా పార్టీల్లోకి మారిన వారిని సదరు పార్టీ సభ్యులుగానే పరిగణిస్తున్నారు. ఇటీవల పలు పార్టీల నుంచి పలువురు ఇతర పార్టీల్లో చేరారు. అలా టీడీపీ నుంచి ఏడుగురు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇతర పార్టీల్లోనూ ఈ ఫిరాయింపులున్నాయి.
     
    రావాల్సిన ఓట్ల కన్నా ఎక్కువగానే..
     
    ఆయా పార్టీల్లోని కార్పొరేటర్ల తాజా గణాంకాల మేరకు కాంగ్రెస్- ఎంఐఎంల కార్పొరేటర్లు తమ కూటమి అభ్యర్థులకు ఓటేసినట్లయితే ఒక్కో అభ్యర్థికి 90 ఓట్లు రావాల్సి ఉంది. కానీ.. ఇతర పార్టీల నుంచి సైతం భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు 103 ఓట్ల నుంచి 123 ఓట్ల వరకు లభించాయి. కూటమిలోని మరో అభ్యర్థికి కేవలం 75 ఓట్లు మాత్రమే లభించాయి.

    అలాగే టీడీపీ- బీజేపీ పొత్తును పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ అభ్యర్థికి 47 ఓట్లు మాత్రమే లభించాలి. కానీ, 73  ఓట్లు వచ్చాయి. అన్ని పార్టీల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ, జీహెచ్‌ఎంసీలోని ఒప్పందం మేరకు కూటమిలోని కాంగ్రెస్- ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే గెలవడం విశేషం. జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకే ఉంది. ఈ పాలకమండలిలో ఇదే చివరి స్టాండింగ్ కమిటీ కావడం.. స్టాండింగ్ కమిటీకి  50 లక్షల రూపాయల మేర పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండటంతో ఎలాగైనా స్థానం పొందాలనుకున్న టీడీపీ ఆశ అడియాసే అయింది.
     
    ఓటు వేయని మాజీ మేయర్
     
    జీహెచ్‌ఎంసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 150 మంది కార్పొరేటర్ల నుంచే 15మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై కార్పొరేటర్లుగా రాజీనామా చేశారు. మిగిలిన 148 మంది కార్పొరేటర్లకుగాను 140 మంది శుక్రవారం పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటు వేయని వారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి (కాంగ్రెస్)తో సహా ఎనిమిదిమంది కార్పొరేటర్లున్నారు.

    ఓటు వేయని మిగతా వారిలో నిర్మలా పురుషోత్తంరెడ్డి (కాంగ్రెస్), సీహెచ్ శ్రీనివాస్ (టీడీపీ), అమ్జదుల్లాఖాన్(ఎంబీటీ), ఎంఐఎంకు చెందిన మెరాజ్ అహ్మద్, అరుణలు ఉన్నారు. వీరితోపాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన మురళిగౌడ్, ముఠాపద్మలు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement