
కేరళలో కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబు ఎం జాకబ్ ‘ట్వంటీ 20’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఫేజ్2 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎర్నాకుళం(కొచ్చిన్), చలకుడి ఎంపీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థను కలిగి ఉన్న ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడంపట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి.
లాభదాయక కంపెనీ కలిగి రాజకీయ పార్టీలు స్థాపించకూడదనే నియమాలు ఎక్కడా లేవు. కానీ ఒకవేళ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిస్తే నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ కంపెనీలకు లాభాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటేనే ఇబ్బంది అని విశ్లేషకులు చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో కార్పొరేట్లపై పక్కా నిబంధనలు అమలు చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ కంపెనీలు రాయితీలు, కొన్ని ఇతర వెసులుబాట్లు కోరుకుంటాయి. ప్రభుత్వం కొన్ని నియమాల్లో సడలింపు ఇవ్వాలనుకుంటాయి.
2022లో పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ట్వంటీ 20 పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇటీవల ఆ పొత్తుకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీ చీఫ్ జాకబ్ గతంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సుమారు రూ.25 కోట్ల విలువైన ఎలక్టోరల్‌బాండ్లను కొనుగోలు చేశారు. అయితే ఈ అంశంపై ఆయన వివరణ ఇస్తూ..తమను బలవంతంగా ఎన్నికల బాండ్లు కొనేలా కొందరు ప్రేరేపించినట్లు చెప్పారు. అయితే పార్టీలకు విరాళాలు ఇచ్చినా వారినుంచి ఎలాంటి ప్రయోజనం పొందలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్క ఓటు విలువ ఎంతంటే..
రాజకీయ ప్రచార సమయంలో జాకబ్ కేరళ సీఎం పినరయి విజయన్ పనితీరును తీవ్రంగా విమర్శించారు. కేరళలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం లేదని ఆరోపించారు. గతంలో కైటెక్స్ ఫ్యాక్టరీ కేరళలో నిర్మించాలని ప్రతిపాదించారు. తరువాత దాన్ని తెలంగాణలో ప్రారంభించబోతున్నట్లు అప్పటి భారాస ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కొచ్చిన్‌లోని కిజకంబాలంలో కైటెక్స్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది.