సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో అభ్యర్థులనే ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితిలో ఉన్న చంద్రబాబు.. ‘అసలు సినిమా ముందుంది’ అంటూ డాంబికాలు పలకడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును చూసి.. ఇది ట్రైలర్ మాత్రమేనని చెబుతున్న చంద్రబాబు, సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందా.. అన్న వైఎస్సార్‌సీపీ సవాల్‌పై మాత్రం ఇప్పటిదాకా స్పందించనే లేదు.
చెప్పుకోవడానికి ఏమీ లేక.. ఏం చేస్తారో కూడా చెప్పలేక సతమతమవుతున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వృద్ధ జంబూకం.. పార్టీ శ్రేణులు పూర్తిగా కకావికలం కాకూడదని సరికొత్త డ్రామాకు తెర తీసింది. అందరం కలిసి సీఎం జగన్‌ను ఓడిద్దాం.. రండంటూ పొత్తులపై ప్రాణాలు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. నిజంగా అసలు సినిమా ముందున్నది చంద్రబాబుకే. ఎందుకంటే.. ఒక్కో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 34 నుంచి 38 శాసనసభ స్థానాలు ఉంటాయి.
వాటి పరిధిలో సుమారు 80 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఇందులో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల ద్వారా 87 శాతం కుటుంబాలకు చెందిన ఓటర్లకు ప్రయోజనం చేకూరింది. సంవత్సర ఆదాయం పట్టణాల్లో రూ.12 వేలు.. గ్రామాల్లో రూ.10 వేలలోపు ఉంటే ఆ కుటుంబాలను దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఆ కుటుంబాలకే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్లు సుమారు 2.50 లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటారు.
ఇందులో 80 శాతం ఓటర్లు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. అలాంటి ఓటర్ల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో.. అదీ వామపక్షాలు, పీడీఎఫ్, యూనియన్లతో ఒప్పందం చేసుకుని గట్టెక్కడం అన్నది బలం కానే కాదని, వాపు అని అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కాని మహిళలు, మిగతా వారంతా రేపటి సార్విత్రిక ఎన్నికల్లో తమకు మేలు చేస్తున్న ప్రభుత్వం కోసం ఏకమైతే టీడీపీ స్థానం ఎక్కడుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
నిజంగా 50కి పైగా నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులే లేరు. మొత్తం 175 స్థానాల్లో టీడీపీకి రెండో స్థానం కూడా సందేహమేనని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయంపై ప్రజల్లో ఎక్కువ చర్చ జరిగితే టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పక్కదోవ పట్టిస్తూ సరికొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇందుకు ఎల్లో మీడియా వంత పాడుతోంది.
రూ.2 లక్షల కోట్లతో ఇంటింటికీ లబ్ధి
► రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంక్షేమ పథకాలు.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు.
► అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా పూర్తవ్వక ముందే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో ఏకంగా రూ.రెండు లక్షల కోట్లు జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
► గ్రామ, వార్డు సచివాలయాలు, 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లి సుపరిపాలన అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. ఇది ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి నానాటికీ ఆదరణ పెరగడానికి దోహదం చేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
► అందువల్లే 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, నగర పాలక ఎన్నికలు.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రికార్డు విజయాలతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తే.. వరుస ఓటములతో టీడీపీ శ్రేణులు జవసత్వాల కోల్పోయాయి.
వైఎస్సార్‌సీపీ ప్రయోగాత్మకంగా పోటీ
► పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా వామపక్షాలు, పీడీఎఫ్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోటీ చేసేవి. వాటికి ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేవి. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచే వామపక్షాలు, పీడీఎఫ్, బీజేపీ, యూనియన్‌లు క్రియాశీలకంగా పని చేస్తాయి. కొన్ని దశాబ్దాలుగా తమ ప్రభావం ఉన్న వర్గాలనే ఎంచుకుని ఓటర్లుగా చేర్పిస్తున్నాయి.
► అయితే ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వైఎస్సార్‌సీపీ పోటీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయపతాక ఎగురవేసింది. మూడు పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో ఎక్కడా గెలవలేదు. కేవలం పీడీఎఫ్, సీపీఐ తదితర పక్షాలతో ఓట్ల బదిలీ ఒప్పందం కుదిరిన మేరకు.. ఆ వర్గాలు వేసిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కింది.
► పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అన్ని వర్గాల ప్రజల అభిప్రాయంగా భావించడానికి ఏమాత్రం వీల్లేదని, ఒకవేళ అలా భావిస్తే తనను తాను మోసం చేసుకోవడమేనన్నది చంద్రబాబుకు కూడా తెలుసని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపడానికే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ట్రైలర్ మాత్రమేనంటూ చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని విశ్లేషిస్తున్నారు.
► బాబుకు ఎల్లో మీడియా వంత పాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోమవారం సీఎం జగన్.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారంటూ వక్రభాష్యం చెబుతోంది. కొద్ది నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందనే నిజాన్ని దాస్తోంది.
టీడీపీలో నైరాశ్యం 'బాబు మౌన రాగం'
Published Mon, Apr 3 2023 1:54 AM | Last Updated on Mon, Apr 3 2023 11:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment