వారు వివరాలిచ్చిన 72 గంటల్లోగా అప్‌లోడ్ చేయండి
అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ) పోటీచేసిన అభ్యర్థుల వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను ఆయా అభ్యర్థులు సమర్పించిన 72 గంటల్లోగా ఈసీ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈఓ)లకు ఆదేశాలు జారీచేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 78వ సెక్షన్ ప్రకారం.. ప్రతి అభ్యర్థీ సంబంధిత నియోజకవర్గ ఫలితాన్ని ప్రకటించిన 30 రోజుల్లోగా తన ఎన్నికల వ్యయాన్ని జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని వారి నుంచి వివరాలు తీసుకున్న 72 గంటల్లోగా సీఈఓ/డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను ఎవరైనా కోరితే.. ఒక పేపరుకు రూపాయి చొప్పున తీసుకుని వాటిని ఇవ్వాలని సూచించింది. అదే సీడీ లేదా డీవీడీ ద్వారా అయితే రూ.300 చొప్పున తీసుకొని వివరాలను అందజేయాలని పేర్కొంది.
అభ్యర్థుల వ్యయ వివరాలను వెబ్‌లో పెట్టండి
Published Sat, Jun 7 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement
Advertisement