సాక్షి, అనంతపురం : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అయితే.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అప్పుడే పెత్తనం చలాయిస్తున్నారు. అధికారులను తమ కనుసన్నల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు రెండున్నర నెలలుగా సెలవులు కూడా లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తించి.. మునిసిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగించారు.
తీరిక లేకుండా గడిపిన కొందరు అధికారులు ప్రస్తుతం ఉపశమనం పొందేందుకు సెలవులో వెళ్లారు. అయినప్పటికీ వారు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. కారణమేమిటంటే... ఎమ్మెల్యేను కలవడానికి ఇంకా టైం లేదా అంటూ తమ అనుచరులతో మరీ ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు. కలవకపోతే మీరిక్కడ పని చేయడం కష్టమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు జిల్లా అధికారులైతే తమకు సన్నిహితంగా ఉండే సహచరులకు ఫోన్లు చేసి.. ఎమ్మెల్యేలను కలిసే ఆనవాయితీ ఇక్కడ ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితులను తమ సర్వీసులో ఇంతవరకు చూడలేదంటూ నిట్టూరుస్తున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాకు ఏడాది కిందట వచ్చిన అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. పోస్టింగ్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని వస్తే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతామో, లేదోనని ఆందోళన చెందుతున్నారు. అనంతపురం నగరంలో నివాసముంటున్న ఒక ఎమ్మెల్యే అనుచరులు మూడు, నాలుగు రోజులుగా అధికారులకు ఫోన్లు చేస్తూ మరీ బెదిరిస్తున్నారు. ‘ఇప్పటి వరకు ఎమ్మెల్యేను కలవలేదట. ఆయన సీరియస్‌గా ఉన్నారు. వెంటనే ఇంటికి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఆయన దృష్టిలో పడితే కష్టం’ అంటూ హెచ్చరిస్తున్నారు.
కొందరు భయపడి ఎవరికంటా పడకుండా రాత్రి వేళల్లో వచ్చి ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరికొందరైతే ఇలాంటి పద్ధతికి స్వస్తి చెప్పాలంటూ కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి రెండోసారి కూడా ఫోన్లు వెళుతున్నాయి. ఒకరిద్దరు అధికారులు మాత్రం.. ఇటీవల విజయం సాధించి.. అనంతపురం నగరంలో నివాసమున్న ఎమ్మెల్యేలందరినీ కలిస్తే పనైపోతుందన్న భావనలో ఉన్నారు. రెండు రోజులుగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. ప్రజలు అధికారమిచ్చింది సేవ చేయడానికే గానీ... అధికారులను బెదిరించడానికి కాదని ఓ అధికారి సాక్షి ప్రతినిధి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. అనంతపురం నగర శివారులోని సెంట్రల్ పార్కులో శిల్పారామం కోసం నిర్మాణాలు చేపడుతుండగా... వాటిని అడ్డుకొని ప్రయోజనం పొందేందుకు రెండు రోజుల కిందట అనంతపురం ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేశారు. అక్కడున్న ఫర్నీచర్‌ను కూడా ధ్వంసం చేసిన విషయం విదితమే. ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోకపోతే మొత్తం ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించడంతో నిర్వాహకులు.. ప్రభాకర్ చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొందరు సెలవులో వెళ్లేందుకు సైతం సిద్ధపడుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కదిరి, ఉరవకొండ మినహా మిగిలిన 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. వీరి బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక సమయంలో ఎవరూ చూడకుండా వెళ్లి హాజరు వేసుకుని వస్తేసరి అంటూ పలువురు అధికారులు రాజీబాటపట్టారు.
..మొదలైంది!
Published Sat, May 24 2014 2:03 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement