సాక్షి, అనంతపురం డెస్క్ : ఒకే ఒక్క జ్ఞాన కిరణం అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేస్తుంది. మనం వేసే ఓటు అసమర్థులు అందలమెక్కకుండా అడ్డుకుంటుంది. అభివృద్ధికి తారక మంత్రమై కోటి కాంతులు విరజిమ్ముతుంది. ఐదేళ్ల ప్రగతికి పసిడి బాటలు పరుస్తుంది. మనసున్న మారాజులను గెలిపిస్తే మన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. అలాంటి తరుణంలో చాలా మంది నిర్లక్ష్యం వహించారు. వజ్రాయుధం వంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు.
పోలింగ్ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చొని ఏం ఓటేద్దాంలే అనుకున్నారో లేక మనం ఓటేస్తేనే వాళ్లు గెలుస్తారా? అని అనుకున్నారో.. ఎన్నికల రోజు వచ్చిన సెలవును కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతూ సద్వినియోగం చేసుకుందామనుకున్నారో.. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 5,66,412 మంది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోలేదు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో నిర్లిప్తత ప్రదర్శించారు. ముందు నుంచి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 80.04 శాతం పోలింగ్ నమోదైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా 1,00,324 మంది ఓటర్లు ఓటు వేయలేదు. అత్యల్పంగా ఉరవకొండ నియోజకవర్గంలో 28,348 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేదు. గ్రామీణుల్లో చైతన్యం ఉట్టిపడగా.. పట్టణ, నగరవాసుల్లో మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించింది.
పల్లె బాటపట్టిన ఓటర్లు!
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్న చాలా మంది బతుకుదెరువు కోసం పట్టణ, నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి వారు ఓటర్లుగా స్వగ్రామాలతో పాటు నివాసముంటున్న ప్రాంతాల్లో కూడా నమోదు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. ఈ కారణంగానే పట్టణ, నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఇక వేసవి సెలవులు ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, ఇతర జిల్లాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, పూర్తి స్థాయిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయకపోవడం పోలింగ్ శాతంపై ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది.
బద్ధకస్తులు.. 5,66,412
Published Sun, May 11 2014 2:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement