సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.. రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 41 లక్షల మంది పార్టీ సభ్యులుగా చేరారు. 42 వేల మంది క్రియాశీల సభ్యులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు 80 లక్షల ఓట్లు వస్తాయి. 78 స్థానాల్లో విజయం సాధిస్తాం.టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..’అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బుడగలాంటిదని, ఆ పార్టీకి డబుల్ డిజిట్ రాదని, సింగిల్ డిజిట్‌కే పరిమితమని చెప్పారు, తెలంగాణ సమాజం బీజేపీని ఎప్పటికీ అంగీకరించదని అన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఖరారు కోసం ప్రియాంకాగాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు, ప్రియాంకా గాంధీ రంగ ప్రవేశం, రాష్ట్ర కాంగ్రెస్‌లో తన పాత్ర గురించి విపులంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
బీజేపీకి భవిష్యత్తు లేదు
బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు క్యూ కడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. బీజేపీలోకి వెళుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీలో నిరర్ధక ఆస్తుల్లాంటి వారు. వారు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు. బీజేపీ అంటేనే అల్లర్లు సృష్టించడం... బీజేపీ అంటేనే అస్థిరత అనే భావనలో తెలంగాణ ప్రజలున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తే లేదు.
మేమొస్తే కొంగొత్త తెలంగాణ..
తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారు. బంగారు తెలంగాణలో బంగారం కేసీఆర్ కుటుంబానికి వెళితే తెలంగాణ మాత్రమే ప్రజలకు మిగిలింది. రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తే కొంగొత్త తెలంగాణను ఏర్పాటు చేస్తాం. యువకులు, రైతులు, మహిళలకు అవసరమైన సురక్షిత ప్రగతిశీల తెలంగాణ కోసం కృషి చేస్తాం.
మునుగోడులో విజయం మాదే..
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రజల కోసం బీజేపీలోకి వెళ్లలేదు. కాంట్రాక్టుల కోసం వెళ్లారు. అక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యనే జరుగుతుంది. టీఆర్‌ఎస్‌తో పాటు రాజగోపాల్‌రెడ్డిపై కూడా అక్కడ వ్యతిరేకత ఉంది.
కుటుంబంలో కలహాలు కామన్
కాంగ్రెస్ పార్టీ అంటే ఓ కుటుంబం లాంటిది. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు, కలహాలు సర్వసాధారణం. అయినా ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు. అలా మాట్లాడిన వారు కూడా మా కుటుంబ సభ్యులే.
అందులో వాస్తవం లేదు..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్టానం సులువుగా నిర్ణయించలేదు. అన్ని విధాలా సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. నేను ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానని అనడంలో వాస్తవం లేదు. కొందరికి కొన్ని లక్ష్యాలుంటాయి. వారు వారి లక్ష్యాల కోసం అనేకం మాట్లాడుతుంటారు. వాటితో నాకు సంబంధం లేదు. ధోని కెప్టెన్‌గా ఉన్న భారత క్రికెట్ టీంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కూడా సభ్యులుగా కొనసాగిన విషయాన్ని అందరూ గ్రహించాలి. మోదీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అప్పుడే పార్టీ నుంచి పంపించేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. వెంకట్‌రెడ్డితో నాకు ఎలాంటి విభేదాల్లేవు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఇద్దరం కలిసి బిర్యానీ కూడా తిన్నాం. అద్దంకి దయాకర్‌నే కాదు, పార్టీ నుంచి ఎవరినీ సస్పెండ్ చేసే ఆలోచన లేదు.
అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్‌కు మధ్య వారధిని..
పార్టీ అధిష్టానానికి, రాష్ట్రంలోని సీనియర్లకు మధ్య నేను అడ్డుగోడగా నిలబడ్డానన్న దాంట్లోనూ వాస్తవం లేదు. నేను అధిష్టానానికి, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మధ్య వారధిని. నేను హోమియో డాక్టర్‌ను కాను. సర్జరీ చేయడానికి వచ్చిన సర్జన్‌ను. నేను స్టార్ హోటల్‌లో ఉండే ఇన్‌చార్జిని కాను. సెకండ్ క్లాస్‌లో ప్రయాణించి 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే సోనియాగాంధీ ప్రతినిధిని. నేను తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలో, తెలంగాణ ఇన్‌చార్జిగా ఉండాలో సోనియాగాంధీ నిర్ణయిస్తారు. ఆమె ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా.
భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే..
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణను చాలా కీలకంగా భావిస్తోంది. అందుకే రాహుల్ ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. వచ్చే నెలలో 14 రోజుల పాటు దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా ప్రియాంకాగాంధీ కూడా రంగంలోకి వచ్చారు. ఆమె కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే.
Comments
Please login to add a commentAdd a comment