రుణ మాఫీ కాదు..నెత్తిన టోపీ! | The loan waiver kadunettina hat! | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ కాదు..నెత్తిన టోపీ!

Published Tue, Jul 22 2014 3:32 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

రుణ మాఫీ కాదు..నెత్తిన టోపీ! - Sakshi

రుణ మాఫీ కాదు..నెత్తిన టోపీ!

  •       డ్వాక్రా రుణాల మాఫీలో మాట తప్పిన చంద్రబాబు
  •      మొత్తం రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ
  •      ఇప్పుడేమో ఒక్కో సంఘానికి రూ.లక్ష అంటూ షరతు
  •      సంఘాలు రూ.1611.03 కోట్ల మేర బ్యాంకులకు బకాయి
  •      చంద్రబాబు షరతు వల్ల రూ.310 కోట్లే మాఫీ అవుతాయని అంచనా
  • ఇదో పచ్చిమోసానికి ప్రత్యక్ష సాక్ష్యం..! చంద్రబాబు ‘మార్కు’ మోసానికి నిలువెత్తు నిదర్శనం..! డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేసి, మహిళలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తానంటూ ఎన్నికల్లో ఊరూవాడ చంద్రబాబు ఊదరగొట్టారు. ఆయన మాటలు నమ్మి మహిళలు ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. సీఎంగా గద్దెనెక్కాక చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోమారు బయటపెట్టారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తానంటూ మెలిక పెట్టారు. దీనివల్ల జిల్లాలో రూ.1611.03 కోట్ల డ్వాక్రా రుణాలకుగాను రూ.310 కోట్లకు మించి మాఫీ కావు. ఆ మాఫీ కూడా ఎప్పుడు చేస్తానన్నది స్పష్టం చేయకపోవడం గమనార్హం.    
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడంలో తనను మించిన వాళ్లు లేరని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మరోసారి నిరూపించుకున్నారు. రుణాల మాఫీ కాదు.. ఆడపడుచుల నెత్తిన టోపీ పెట్టారు. ‘డ్వాక్రా మహిళలు కష్టాల్లో ఉన్నారు. ఏ ఒక్కరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు.. నేను సీఎంగా అధికారం చేపట్టగానే మీ రుణాలను మొత్తం మాఫీ చేస్తా’ అంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత సోమవారం చంద్రబాబు ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆ రూ.లక్ష కూడా మాఫీ చేసేందుకు నిధుల సమీకరణకు ఓ కమిటీ వేస్తానని చెప్పడంపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
     
    జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) పథకం కింద ఒక్కో మహిళా సంఘానికి గరిష్టంగా రూ.ఐదు లక్షల వరకూ రుణాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆర్థిక చేకూర్పు కింద ఒక్కో సంఘం రూ.ఐదు లక్షల చొప్పున 60 శాతం మహిళా సంఘాలు, రూ.4 లక్షల వంతున పది శాతం సంఘాలు, రూ.మూడు లక్షల చొప్పున 12 శాతం సంఘాలు, రూ.రెండు లక్షల చొప్పున ఎనిమిది శాతం సంఘాలు, రూ.లక్ష చొప్పున ఐదు శాతం సంఘాలు, రూ.50  వేల చొప్పున ఐదు శాతం సంఘాలు రుణాలు తీసుకున్నాయి.
     
    అప్పుడో మాట.. ఇప్పుడో మాట..
     
    అక్టోబరు 2, 2012న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ‘మీకోసం వస్తున్నా’ పేరుతో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. అక్కడ చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలను మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు ఇదే హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి మహిళలు టీడీపీకి ఓట్లేసి.. అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే నీరుగార్చేలా వ్యవహరించారు. ఒక్క సంతకంతో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ రుణాల మాఫీ విధి విధానాలను రూపొందించడం కోసం కమిటీ ఏర్పాటుచేసేందుకు సంతకం పెట్టారు.

    దీనిపై కమిటీ నివేదిక ఏమిచ్చిందన్నది చంద్రబాబుకే ఎరుక. కానీ.. చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోమారు ప్రదర్శించారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామని సోమవారం ప్రకటించారు. ఆ రుణమాఫీకి అయ్యే నిధుల సమీకరణ కోసం మరో కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు. అంటే.. ఆ రూ.లక్ష కూడా ఎప్పుడు మాఫీ చేస్తారన్నది స్పష్టంగా చెప్పలేదు.
     
    పొదుపు మొత్తం నుంచి జమ!
     
    ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచే సభ్యులకు తెలియకుండానే బ్యాంకర్లు కంతుల కింద జమ చేసుకుంటున్నారు. గుర్రంకొండ, వి.కోట, శాంతిపురం, పాలసముద్రం, ఏర్పేడు తదితర మండలాల్లో అధికశాతం బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను అధికారులు వసూలు చేశారు. చాప కింద నీరులా బ్యాంకర్లు రుణాల వసూళ్లకు దిగడంతో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి) నిధి రూ.196 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు తగ్గిపోయింది. సీఐఎఫ్ నిధి నుంచి బ్యాంకర్లు అప్పుగా మినహాయించుకున్న రూ.96 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్న అంశంపై చంద్రబాబు స్పందించకపోవడం కొసమెరుపు.
     
    మాఫీ అయ్యేదిరూ.310 కోట్లే..

    ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామన్న చంద్రబాబు ప్రకటన మేరకు జిల్లాలో రూ.1611.03 కోట్ల డ్వాక్రా రుణాలకుగానూ రూ.310 కోట్లకు మించి మాఫీ కావని ఇందిరాక్రాంతిపథం(ఐకేపీ) అధికారులే స్పష్టీకరిస్తున్నారు. తక్కిన రుణం ఆ మహిళా సంఘం సభ్యులు చెల్లించాల్సిందే. రూ.లక్షలోపు రుణం తీసుకున్న సంఘాలకు మాత్రమే పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తిస్తుందన్నమాట..! గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టడంతో మహిళలు మండిపడుతున్నారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

    బయటపడిన బాబు నైజం
    చంద్రబాబు ఏనాడు కూడా రైతులు మేలు చేసిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ఎంత రుణం ఉన్నా మాఫీ చేస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. గెలిచాక మాటమార్చి కుటుంబానికి ఒకటిన్నర లక్ష మాత్రమే రుణమాఫీ అని చేతులెత్తేశారు. మిగిలిన అప్పులు ఎవరు తీరుస్తారు.  రైతు నోట్లో మట్టి కొట్టారు. అసలే కరువు కోరల్లో  ఉన్నాం. పంట రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలి. లేదంటే చంద్రబాబు చరిత్ర హీనుడే.         
    -ఎస్ గంగిరెడ్డి, అంగళ్లు, కురబలకోట మండలం
     
    జనం చెవిలో పువ్వు పెట్టాడు
    సీఎం స్థానంలో ఉన్న వారు ఇలా మాటతప్పడం సరికాదు. రుణాలు మాఫీ చేస్తున్నాం..పండగ చేసుకోవచ్చని కోతలు కోశారు. సీఎం కుర్చీ కోసం రుణమాఫీ డ్రామా ఆడారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని అందరి చెవిలో పువ్వు పెట్టారు. రుణమాఫీ చేస్తానని దగా చేసిన బాబు క్షమాపణలు చెప్పాలి. సీఎంగా వెంటనే తప్పుకోవాలి. లేదంటే అణాపైసలతో సహా రుణమాఫీ చేయాలి.
     -ఎం నాతాను రెడ్డి, అంగళ్లు, కురబలకోట మండలం

     సీఎంగా పనికిరాడు
     డ్యాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చని చంద్రబాబు సీఎంగా అనర్హుడు. ఆడోళ్ల ఉసురు తగులుతుం ది. గ్రూపునకు లక్ష మాత్రమే ఎలా మాఫీ చేస్తారు. ఓట్లు వేసిన వారిని నట్టేట ముంచారు. ప్రతి గ్రూపునకు రూ.3  లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పులున్నాయి. లక్ష చేస్తే ఏమూలకు సరిపోతుంది. చంద్రబాబు నిర్వాకంతో డ్వాక్రా గ్రూపు సభ్యుల ఆశలు నీరుగారాయి. అన్ని డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పారు. చేతకానప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలి.  
     - చంద్రకళ , వసంత గ్రూపు లీడర్, కురబలకోట మండలం
     
     ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి
     ఎన్నికల సమయంలో ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే రైతులను మోసం చేశారు. రెతుకు రుణమాఫీ రూ. 1.50 లక్షలు మాత్రమే చేస్తానని ప్రకటించారు. మొత్తం రుణమాఫీ చేస్తాడని ఆశపడిన రైతులకు మొండిచెయ్యి చూపారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో మొత్తం రుణమాఫీ చేస్తానని ప్రకటించారని తేలిపోయింది.
     -వెంకటమల్లయ్య, చెరువుకిందపల్లె, పెద్దమండ్యం మండలం
     
     మాఫీ పేరుతో మోసం
     అధికారంలోకి రాగానే మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశారు. మాది మాషాఅల్లా స్వయం సహాయక సంఘం. సంఘంలో 9 మంది సభ్యులున్నాం. రుణం రూ. 2.35 లక్షలు తీసుకున్నాం. రుణ బాధ తీరిపోతుందని అనుకుంటే ఇపుడు ప్రతి సంఘానికి కేవలం రూ.లక్ష వరకు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం మోసమే.
     -సంతోషి, మాషా అల్లా సంఘం సభ్యురాలు, పెద్దమండ్యం
     
     మహిళలే తిరగబడతారు 
     చంద్రబాబు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలు ఇప్పటి నుంచే కట్టవద్దని ప్రచార సభల్లో చెప్పారు. ఆయన మాటలు నమ్మి మహిళలందరూ ఆశతో ఓట్లు  వేశారు. ఇప్పడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తానంటున్నారు. పూర్తిగా మాఫీ చేయకుంటే మహిళలు టీడీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయి.               
    -రాజకుమారి,కార్తికేయపురం, పెనుమూరు మండలం
     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement