బాబూ.. ‘డ్వాక్రా’ ఛిన్నాభిన్నం
- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి
గన్నవరం : గ్రామాల్లో సజావుగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థను రుణమాఫీ ఆశ చూపి చిన్నాభిన్నం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి విమర్శించారు. కేవలం అధికారం కోసం ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన బాబు.. ఇప్పుడు మాట తప్పడం మహిళలను మోసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రెండు రోజులుగా జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 18వ మహాసభల ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది.
స్వరూపరాణి మాట్లాడుతూ...ప్రభుత్వ అసమర్థత కారణంగా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు మాఫీ కాక, బ్యాంకులు రుణాలివ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు ఎన్నికల హామీకి కట్టుబడి డ్వాక్రా రుణాలను పూర్తిగా రద్దుచేయాలని కోరారు. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మహిళలపై హింస విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్న విజయవాడనే రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో మహిళల సంరక్షణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో విధి విధానాలతో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధాని ఏర్పాటు చుట్టూ తిరుగుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు.
సంక్షేమ పథకాలన్నీ కుంటుపడుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్, మలేషియా, చికాగో చేస్తానంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీలు, ఆశా వర్కర్లు తదితర అవుట్ సోర్సింగ్ పనుల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్నవారిని తొలగించి అనుచరులను పెట్టుకోవడం దారుణమన్నారు. బెల్టుషాపులు ఎత్తి వేస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు.
పాలకులు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడలని, లేకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలపై హింసను నియంత్రించాలని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, బెల్టుషాపులు ఎత్తివేయాలని తీర్మానాలు చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె. సుబ్బరావమ్మ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీదేవి, పిన్నమనేని విజయ, ఉపాధ్యక్షురాలు వై. జోయ, జి. నాగమణి, మల్లంపల్లి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.