పొదుపును నిర్వీర్యం చేశారు : సారథి
నందిగామ : ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ హామీని అమలు చేయకపోవడంతో పొదుపు వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మాట తప్పిన ముఖ్యమంత్రిపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు మాటతప్పడంతో మహిళలు కొత్త రుణాలు పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలను అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. గొర్రెలు, మేకలు పెంపకందారులకు రూ.200 కోట్ల రుణాలు ఇచ్చి ప్రోత్సహించారని తెలిపారు. టీడీపీ ఎన్నికల హామీ మేరకు వ్యవసాయ అనుబంధ రుణాలన్నీ రద్దు చేయాలని సారథి డిమాండ్‌చేశారు. ఈ సమావేశంలో కార్యాలయ ఇన్‌చార్జి డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎన్.శివనాగేశ్వరరావు, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు సత్యనారాయణ, కౌన్సిలర్ శ్రీనివాసాచారి పాల్గొన్నారు.