
చల్లగా సర్దుకుని..
- టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి
- ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ
- వారం లోపు చేరే అవకాశం
- పరకాల కేడర్ అంతా ఆయన వెంటే..
- జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ
- ఇక ఆ పార్టీకి మిగిలింది ఒక్కరే..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కొంతవరకు పట్టు నిలుపుకున్న టీడీపీకి నాలుగు నెలల్లోనే గట్టి దెబ్బ పడుతోంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలోపే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌తో కలిసి ఆయన గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
అనంతరం వీరి తరఫున శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటిం చారు. అక్కడే ఉన్న చల్లా ధర్మారెడ్డి ఈ విషయాన్ని ఖండించ లేదు. దీన్నిబట్టి ధర్మారెడ్డి సైతం తలసానితోనే టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం సాయంత్రం చల్లా ధర్మారెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత కూడా ధర్మారెడ్డి పార్టీ మారబోనని చెప్పలేదు. ఈ మేరకు ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
పరకాల నియోజకవర్గంలోని మెజారిటీ టీడీపీ కేడర్ ఆయనతో వెళ్లే పరిస్థితి ఉంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన చల్లా ధర్మారెడ్డి అధికార పార్టీలోకి మారుతాడని ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ధర్మారెడ్డి మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ‘టీడీపీని వీడే ప్రసక్తేలేదు. టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయలేని కేసీఆర్... చంద్రబాబును తప్పుబట్టడం సరికాదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఒక్క సమస్యను పరిష్కరించలేదు.
తెలంగాణ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ గుప్పించిన కేసీఆర్ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు’ అని హన్మకొండలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. పరకాల నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇదే రకంగా మాట్లాడారు. ఇంతగా మాట్లాడి ఒక్క రోజులోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక చల్లా ధర్మారెడ్డిది శాయంపేట మండలం ప్రగతి సింగారం. 2008లో టీడీపీలో క్రీయాశీలక పాత్ర వహించారు.
2009లో టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టారు. 2012 జూన్‌లో పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో 30 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దసాని సహోదర్‌రెడ్డిపై 9,225 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు అధికార పార్టీ వారికి దగ్గరగా ఉండే తత్వం ధర్మారెడ్డిది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.