సాధారణ ఎన్నికలకు ముందు తహశీల్దార్ల బదిలీలు సజావుగానే జరిగాయి. జిల్లా నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లారు.
కలెక్టరేట్ : సాధారణ ఎన్నికలకు ముందు తహశీల్దార్ల బదిలీలు సజావుగానే జరిగాయి. జిల్లా నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఆయా జిల్లాల నుంచి తహశీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. ఎన్నికలు పూర్తయి రెండు నెలలు అయింది. వేరే జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్లు వారి సొంత జిల్లాలకు వెళ్లారు. అక్కడ పనిచేసిన మన జిల్లా తహశీల్దార్లు 35 మంది జూన్ 16,17,18 తేదీల్లో జిల్లాకు వచ్చి ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారు.
అయితే అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో అప్పట్లో తహశీల్దార్ల అంశం చర్చనీయాంశమైంది. ఆయా మండలాల్లో తహశీల్దార్లుగా విధులు నిర్వర్తిస్తున్న వేరే జిల్లాలకు చెందిన తహశీల్దార్లు తిరిగి వారి సొంత జిల్లాలకు వెళ్లిపోవడంతో ఆ స్థానాలు ఖాళీగా మారాయి. మండలంలోని డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
మండలాల్లో తహశీల్దార్లు లేక సుమారు పదిహేను రోజులవుతుంది. బదిలీపై వెళ్లి వచ్చిన తహశీల్దార్లకు పదిహేను రోజులుగా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంతో జిల్లాలో తహశీల్దార్లున్నా లేనట్లుగా మారింది. పదిహేను రోజుల పాటు అంతరాయం ఏర్పడింది. తహశీల్దార్లు మంగళవారం కలెక్టర్ జగన్‌మోహన్‌ను కలిసి పోస్టింగ్‌ల విషయమై విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారని తహశీల్దార్లు పేర్కొన్నారు.
జీతాలపై అనుమానాలు
జిల్లాలో ఎన్నికల సందర్భంగా బదిలీ అయినా తహశీల్దార్లు ఇప్పుడు జీతాలు వస్తాయో.. లేదోననే సందిగ్ధంలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన 35 మంది తహశీల్దార్లు జూన్ 16, 17,18వ తేదీల్లో అక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. అంటే జూన్ 15వ తేదీ వరకు వారు వెళ్లిన జిల్లాలో తహశీల్దార్లుగా విధులు నిర్వర్తించారన్న మాట.
అయితే జూన్ నెల పదిహేను రోజుల వేతనం వారు విధులు నిర్వర్తించిన జిల్లాలో తీసుకునేందుకు అవకాశం ఉంది. జూన్ 16వ తేదీ నుంచి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లు ఖాళీగా ఉన్నారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండానే జూన్ నెల ముగిసింది. ఈ పదిహేను రోజులు తహశీల్దార్లు విధులు నిర్వర్తించలేదు. ఈ రోజుల వేతనంపై తహశీల్దార్లలో సందిగ్ధం నెలకొంది. పదిహేను రోజుల వేతనం ఇస్తారా? లేదా పోయినట్లేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
తహశీల్దార్లు లేక..
మండల కేంద్రాల్లో తహశీల్దార్లు లేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మండలాల పరిధిలోని తెల్లరేషన్ కార్డులను పీడీఎస్ డాటాబేస్‌లో జూలై 3లోగా అప్‌లోడ్ చేయాలని సంయుక్త కలెక్టర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అయితే నేడు, రేపు తహశీల్దార్లు బాధ్యతలు చేపట్టినా అది జరగని పని. దీంతోపాటు ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న భూ పంపిణీకి మండలాల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించడం, భూమి లేని నిరుపేదలను గుర్తించి ఉభ్నతాధికారులకు నివేదించాల్సి ఉంది.
దీనికి కేవలం వారం రోజుల సమయం మిగిలి ఉంది. ప్రభుత్వ భూముల స్థితిగతులు, జమాబందీ, పట్టాదార్, ఆధార్ అనుసంధానం, పహాణి, సర్కారు భూములు, వన్‌టైమ్ కన్వర్షన్ వంటి పనులు పూర్తి చేయాలి. తహశీల్దార్లు లేకపోవడంతో ప్రస్తుతం ఈ పనులు జరగడం లేదు. ఇందుకు తోడు అనునిత్యం మండలాల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు సార్లు లేక వెనుదిరుగుతున్నారు. పైగా మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయాల్సిన పనులు ఆగిపోతున్నాయి.