ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్త ప్రభంజనమా అనే ఉత్కంఠకు తెర లేపింది. భారత ప్రజల చైతన్యస్ఫూర్తి ఈ ఎన్నికల్లో మరోసారి రుజువయ్యింది.
‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గేలా చేశాయి. కుల మతాలనూ, అయోధ్య రాముణ్ణీ ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు.
ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం నడపడంలో కొంత వరకు సఫలం అయిందని చెప్పవచ్చు. ‘మోదీ 3.0 మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు’ అనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళి, బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండి కొట్టింది. ఓటర్లు ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
ఈ సారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం... ముఖ్యంగా యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ వంటి వారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
ఉత్తర భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మిక– కర్షక సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. – పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment