తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 12తో మొదలై డిసెంబర్ 7 వరకూ వివిధ దశల్లో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ జరుగుతాయి. డిసెంబర్ 11న వెలువడబోయే ఈ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత మరో ఆరునెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయి గనుక వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఓటర్ల మనోగతం తెలిస్తే గెలిచిన పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన సమరోత్సాహంతో ఉరుకుతాయి. ఓడిన పక్షాలు భయసందేహాలతో అతి జాగ్రత్తగా అడుగులేయక తప్పదు. ఈసారి ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ సుదీర్ఘమైనది కావడం వల్ల మొదటగా ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్ ఫలితాల కోసం నెలరోజులపాటు వేచిచూడక తప్పదు. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో బీజేపీ ప్రభుత్వాలుండగా తెలంగా ణలో టీఆర్‌ఎస్, మిజోరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి.
జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు మాటేమోగానీ ఏబీపీ–సీ ఓటర్ కలిసి, సీ ఫోర్ విడిగా నిర్వ హించిన సర్వేలు కాంగ్రెస్‌కు సంతోషం కలిగించాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పిన ఏబీపీ– సీ ఓటర్ సర్వే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీకి అనుకూలత ఉన్నదని చెబుతోంది. మధ్యప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్యా 2 శాతం లోపు ఓట్ల తేడా ఉంది. కాంగ్రెస్‌కు 42.2 శాతంమంది, బీజేపీకి 41.5 శాతంమంది మద్దతు తెలుపుతున్నారని ఆ సర్వే లెక్కేసింది. ఛత్తీస్ గఢ్‌లో ఈ తేడా మరింత స్వల్పంగా ఉంది. కాంగ్రెస్‌కు 38.9, బీజేపీకి 38.2 చొప్పున మద్దతున్నట్టు తేల్చింది. మున్ముందు ఏర్పడే పరిణామాలనుబట్టి ఈ ఓట్ల శాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని వివరించింది. చిత్రమేమంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు ప్రస్తుత సీఎంలవైపే మొగ్గుచూపుతున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ బీజేపీ కంటే చాలా ముందంజలో ఉంది. అక్కడ కాంగ్రెస్‌కు 49.9 శాతంమంది మద్దతు పలుకుతుండగా, బీజేపీపై 34.3 శాతంమంది మాత్రమే సుముఖత చూపారని తెలిపింది. గత పాతికేళ్లుగా రాజస్తాన్‌లో ఏ పార్టీ వరసగా రెండుసార్లు అధి కారం నిలబెట్టుకున్న దాఖలా లేదు.
అయితే రాజకీయంగా ఈ రాష్ట్రాలన్నిటా కాంగ్రెస్ కష్టాలు ఎదుర్కొంటున్నది. బీజేపీకన్నా ముందంజలో ఉన్న రాజస్తాన్‌లో తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ చెప్పే పరిస్థితి లేదు. అలా ప్రకటిస్తే వెనువెంటనే పార్టీలో అలకలు, వివాదాలు మొదలవుతాయి. అదంతా చివరకు ఎటు దారితీస్తుందో తెలియదు. అందుకే కాంగ్రెస్ దాని జోలికి పోలేదు. అలాగే ఈ మూడు రాష్ట్రాల్లోనూ సమష్టిగా పోరాడతాయనుకున్న కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్‌వాదీలు వేరు కుంపట్లు పెట్టాయి. మూడుచోట్లా దళిత ఓటర్ల ప్రాబల్యం ఉన్నది గనుక బీఎస్పీతో కలిసి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ లెక్కేసినా సీట్ల లెక్కల్లో తేడాలొచ్చాయి. సమాజ్‌వాదీతోనూ ఆ విషయంలోనే తగాదా ఏర్పడింది. ఆ రెండు పార్టీలూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. విపక్షాల నన్నిటినీ కలుపుకొని వెళ్తామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తామని ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చెబుతున్నదంతా తాజా పరిణామాలతో కుప్పకూలింది. మొన్న మే నెలలో కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో జేడీ(ఎస్)–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీని వ్యతి రేకించే 12 పార్టీల అధినేతలు హడావుడి చేశారు. కలిసికట్టుగా ఉండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని చెప్పారు. కానీ అంతవరకూ పోకుండానే బోర్లా పడ్డారు. తమకు బాగా బలం ఉన్నదనుకున్న చోట ఇతరులను లక్ష్య పెట్టకపోవడం, బలహీనంగా ఉన్నామనుకున్నచోట సాధ్య మైనంత ఎక్కువ రాబట్టుకోవడానికి ప్రయత్నించటం కాంగ్రెస్‌కు అలవాటే. యూపీలో ఏణ్ణర్ధం క్రితం జరిగిన ఎన్నికల్లో సమాజ్‌వాదీతో కాంగ్రెస్ చాకచక్యంగా బేరమాడి ఏకంగా 105 స్థానాలు తీసుకుంది. వాటిలో కేవలం ఏడంటే ఏడు మాత్రమే గెలుచుకుంది. తమకు యూపీ, బీహార్‌లలో పొత్తు కుదిరితే చాలని... మిగిలినచోట్ల ఇతరుల అవసరం లేకుండానే నెగ్గుకురాగలమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ చెప్పిన మాట ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతుంది. కాంగ్రెస్ తీరు ఇలా ఉన్నదని తెలిశాక ఆ రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఇతర పార్టీలు మున్ముందు ఇదే తర్కాన్ని దానిపై ప్రయోగించవా? ఐక్యత ముఖ్యమని, సమష్టిగా కదలాలని నిర్ణయించుకున్నప్పుడు ఇచ్చిపు చ్చుకునే ధోరణి ప్రదర్శించాలి. అవసరమైతే కొన్ని కోల్పోవడానికి సిద్ధపడాలి. సిబల్ వంటివారి మాటలు గమనిస్తే కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని అనుకోవాలి.
ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాలకన్నా ముందే ఎన్నికలు జరుగుతాయని అంచనాలున్న తెలం గాణలో ఓటర్ల జాబితా వివాదం కారణంగా ఆ రాష్ట్రాలతోపాటే ఎన్నికలు ప్రకటించవలసివచ్చింది. ఈమధ్యకాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా అవకతవలపై ఫిర్యాదులు పెరిగాయి. బోగస్ ఓటర్లు వచ్చి చేరడం, నిజమైన ఓటర్ల పేర్లు గల్లంతుకావడం రివాజుగా మారింది. ఇది ఆందో ళనకరం. అవకతవకలు బయటపడినప్పుడు ఓటర్ల జాబితా రూపకల్పనలో పాలుపంచుకునేవారిని బాధ్యుల్ని చేయడంతోసహా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా నిబంధనలు రూపొందిస్తే తప్ప ఇవి తగ్గవు. తెలంగాణలో గత నెల 6నే పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న టీఆర్‌ఎస్‌కు ఎన్నికలు ఆలస్యం కావడం ఇబ్బందే. అయితే పొత్తుకు దిగిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల మధ్య సీట్ల పంపకాలు అంత సులభమేమీ కాదు. ఎలాగోలా కుదిరినా దాదాపు ఈ పార్టీలన్నిటిలోనూ తలెత్తే అసంతృప్తిని చల్లార్చడమూ కష్టమే. ఇక ఓట్ల బదిలీ సమస్య ఎటూ ఉంటుంది. పార్టీలు వైఖరి మార్చుకున్నంత సులభంగా ఆ పార్టీల ఓటర్లు మనసు మార్చుకుంటారా అన్నది అనుమానమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు డ్రెస్ రిహార్సల్ అనదగ్గ ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలపైనా సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Published Tue, Oct 9 2018 12:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment