సమర సన్నాహాలు | Sakshi Editorial On Congress Party And Gandhi Family | Sakshi
Sakshi News home page

సమర సన్నాహాలు

Published Tue, Aug 22 2023 2:09 AM | Last Updated on Tue, Aug 22 2023 2:09 AM

Sakshi Editorial On Congress Party And Gandhi Family

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీ సొంత గూటిలో సర్దుబాట్లతో సమరానికి సన్నద్ధమవుతున్నట్టుంది. పది నెలల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. నిరుడు జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే ఆచితూచి వ్యవహరిస్తూ, ఇన్నాళ్ళకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ’ (సీడబ్ల్యూసీ)ని పునర్వ్యవస్థీకరించారు. సరికొత్త సీడబ్ల్యూసీపై గాంధీ కుటుంబ ముద్ర సుస్పష్టం. 

అయితే, ఒకపక్క విశ్వాసపాత్రులైన పాత కాపుల్ని కదిలించకుండానే, మరోపక్క కొత్త వారికీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారికీ, వివిధ సామాజిక వర్గాలకూ స్థానం కల్పించారు. ఇలా పార్టీలో నవనవోత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించడం స్వాగతనీయం. సోనియా కుటుంబానికి వీరవిధేయుడైనప్పటికీ, కేవలం డూడూబసవన్నలా ఖర్గే ఉండిపోలేదు.  కొత్త కార్యవర్గంలో గాంధీ శిబిరం వారితో పాటు తన సొంత శిబిరం వారికీ చోటిచ్చారు. వివిధ సామాజిక వర్గాలకు చోటిస్తూ సమ తూకం సాధించడంతో ఈ కొత్త కార్యవర్గం రానున్న ఎన్నికల టీమ్‌ అని అర్థమవుతోంది. 

సోనియా అధ్యక్ష కాలంలోని 2020 సెప్టెంబర్‌ తర్వాత సీడబ్ల్యూసీ ప్రక్షాళన మళ్ళీ జరగడం ఇప్పుడే! అనేక విడతల చర్చల తర్వాత కొత్త కమిటీ కొలువు తీరింది. 39 మంది శాశ్వత సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది రాష్ట్ర ఇన్‌–ఛార్జ్‌లు, నలుగురు సంస్థాగత ఇన్‌–ఛార్జ్‌లు, మరో 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు – ఇలా మొత్తం 84 మంది సభ్యులతో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద సీడబ్ల్యూసీ ఇది. పాత, కొత్తల మేలు కలయికగా ఏర్పాటైన వర్కింగ్‌ కమిటీలో ప్రజా స్వామ్య స్ఫూర్తిని పెంచడం హర్షణీయం.

రాజస్థాన్‌లో సొంత పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న సచిన్‌ పైలట్‌కు కార్యవర్గంలో స్థానమివ్వడం, అలాగే నిరుడు పార్టీ అంతర్గత ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి ఖర్గేతో పోటీపడిన శశి థరూర్‌కు సైతం చోటివ్వడం ఆశ్చర్యకరమే. అలాగే, పార్టీకి సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించిన జి–23 బృందంలోని అసమ్మతి నేతల్లో భాగమైన ఆనంద్‌ శర్మ, ముకుల్‌ వాస్నిక్‌లను సైతం కొత్త సభ్యులుగా తీసుకోవడం గమనార్హం. ఇది అవసరమైన రాజకీయ చాణక్యమే. 

విభిన్న స్వరాలు వినిపించేవారిని సైతం విధాన నిర్ణయాలు తీసుకొనే వేదికలో భాగస్వాముల్ని చేయడం అంతర్గత ప్రజాస్వామ్యానికి సూచిక. 138 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ఒక పార్టీ సమకాలీన చైతన్యశీల ప్రస్థానానికీ, పురోగతికీ దీర్ఘకాలంలో అది కీలకం కూడా! ముఖ్యంగా ఈ ఏడాది చివరి కల్లా మిజోరమ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలున్న వేళ ఆ ప్రాంతాలకూ ప్రాముఖ్యం, ప్రాతినిధ్యం ఇస్తూ ఈ పునర్వ్యవస్థీకరణ సాగడం గమనార్హం.

ఎన్నికలున్న రాజస్థాన్‌లో అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌కూ, అలాగే ఛత్తీస్‌గఢ్‌లో బలమైన ఫ్యాక్షన్‌ నాయకుడూ, ఓబీసీ అయిన మంత్రి తామ్రధ్వజ్‌ సాహూకూ పార్టీ అత్యున్నత వేదికలో చోటివ్వడం తక్షణ ప్రయోజ నాలకు తప్పక పనికొస్తుంది. అలా చూస్తే, ఆలస్యమైనా ఖర్గే ఆలోచించి పావులు కదిపారనుకోవాలి. గత కమిటీలో ఒక్క ఓబీసీయే ఉంటే, ఈసారి ఆరుగురికి స్థానం దక్కడం, 9 మంది ఎస్సీలకూ, ఒక గిరిజన నేతకూ సీటివ్వడం... ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌కూ, సామాజిక న్యాయానికీ కట్టుబడి ఉన్నామనే భావన కలిగించడానికీ కాంగ్రెస్‌కు ఉపకరిస్తుంది. అయితే, 15 మంది స్త్రీలకు స్థానం కల్పించినా, మహిళా సాధికారత మంత్రం పఠిస్తున్న పార్టీ ఈ సంఖ్యను మరింత పెంచుకోవడం అవసరం. 

నిజానికి, సీడబ్ల్యూసీలో 50 ఏళ్ళ లోపు వారు 50 శాతమైనా ఉండాలన్నది లక్ష్యమని కాంగ్రెస్‌ కొంతకాలంగా చెబుతోంది. గత ఏడాది మేలో ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్‌ శిబిర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయ్‌పూర్‌లో సాగిన పార్టీ ప్లీనరీలో ఆ మేరకు సంకల్పం కూడా చెప్పుకుంది. తాజా పునర్వ్యవస్థీకరణ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. అయితే, పవన్‌ ఖేరా, సుప్రియా శ్రీనతే లాంటి యువ నాయకత్వాన్ని సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నంగా భావించవచ్చు.

సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యుల సంఖ్యను 23 నుంచి 35కు పెంచుతామని రాయ్‌పూర్‌ ప్లీనరీలో చెప్పిన పెద్దలు ఆ అవధిని మరింత పెంచి, 39 మంది శాశ్వత సభ్యులను తీసుకోవడమూ అనేక రాజకీయ అనివార్యతలకు అద్దం పడుతోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరపకుండా, ఖర్గేయే నామినేట్‌ చేస్తారని నిర్ణయించిన పార్టీ ఇప్పటికి ఈ ఘట్టాన్ని పూర్తి చేసింది. వెరసి, కొత్త కార్యవర్గం కూర్పు కొంత సృజనాత్మక ధోరణిలో, మరికొంత రాజీ మార్గంలో పయనించిందని చెప్పక తప్పదు. 

శశిథరూర్‌ పేర్కొన్నట్టు, సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలే ఏ పార్టీకైనా జీవనాడి. వారితో నిండిన పార్టీలు, కార్యవర్గాలే ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో ముందడుగు వేయగలవు. సీడబ్ల్యూసీ కూర్పులో ఆ సంగతి ఖర్గే బాగానే గ్రహించారు. కానీ, సవాళ్ళు ముగిసిపోలేదు. అద్వానీ తర్వాత స్వతంత్ర భారతావనిలో ఏకకాలంలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతి పక్ష నేతగా ఉన్న 81 ఏళ్ళ ఖర్గే ఎన్నికల బరిలోనూ కాంగ్రెస్‌ను తీరానికి చేర్చాలి.

ఆ మధ్య దాకా నీరసించిన పార్టీ నిరుడు హిమాచల్‌లో, ఈ ఏడాది కర్ణాటకలో దక్కిన విజయాలతో తెరిపిన పడింది. ఆ విజయ పరంపరను కొనసాగించాలంటే అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలు,‘ఇండియా’ కూటమిలో ఇతర ప్రతిపక్షాలతో సంప్రతింపులు – ఇలా ఖర్గే చేతి నిండా పని ఉంది. సోనియా కుటుంబంతో సమన్వయం చేసుకుంటూనే ఆ పనిని ఆయన ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి. ఒక్కమాటలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement