సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమేనని పేర్కొన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు థరూర్. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయటాన్ని సోనియా గాంధీ స్వాగతించారని, తమ కుటుంబం తటస్థంగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు థరూర్ చెప్పారు. తాను సోనియా గాంధీ ఆమోదం కోసం ఆమెను కలవలేదని, అయికే.. వారి అధికారిక వైఖరి ఏంటని తెలుసుకునేందుకే భేటీ అయినట్లు చెప్పారు.
‘మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మేము ఎల్లప్పుడూ ఏకాభిప్రాయంతో పనులు చేస్తాం, మాకు వదిలివేయండి, సరైన వ్యక్తిని కనుగొంటాము అని ఆమె చెప్పలేదు. దానికి విరుద్ధంగా.. ఎన్నికలు పార్టీకి మంచిదని నమ్ముతానన్నారు. నీవు పోటీ చాయాలనుకుంటే.. స్వాగతిస్తా అన్నారు. అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని చెప్పారు. ఈ పోటీ కేవలం సహచరుల మధ్య జరుగుతోన్న పోరు మాత్రమే. నాకు 14 ఏళ్ల అనుభవం ఉంది. అన్ని రకాలుగా పోటీకి అర్హుడినే. నా అభ్యర్థిత్వంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ’ అని తెలిపారు శశి థరూర్.
పార్ట చీఫ్ కోసం పోటీ పడుతోన్న ఏ అభ్యర్థి అయినా.. గాంధీ కుటుంబీకుల చేతిలో కీలుబొమ్మగా మారతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్‌లో గాంధీల స్థానం.. పార్టీ డీఎన్‌ఏతో వారికున్న అవినాభావ సంబంధాలు గొప్పవని నేను కచ్చితంగా నమ్ముతాను. వారి నుంచి, వారి వారసత్వం నుంచి మనల్ని మనం వేరు చేసే ప్రశ్నే లేదు. వారు క్రీయాశీలకంగా వ్యవహరించొద్దని భావిస్తే.. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు.’ అని పేర్కొన్నారు థరూర్. మరోవైపు.. రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ ఇంఛార్జ్‌గానే కనిపిస్తారని తెలిపారు. అలాగే.. తాను జీ-23 తరఫున అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవటం లేదని స్పష్టం చేశారు. నాకు కేవలం 23 మంది కాదు, 9,100 మంది మద్దతు కావాలంటూ తెలిపారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment