అతిరథుల బాట
సెంటిమెంట్ కోట
టీఆర్‌ఎస్‌కు అచ్చొచ్చిన జిల్లా
కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వేదిక
రేపు సోనియా ప్రచార సభ
బీజేపీ అగ్ర నేతలదీ ఇదే రూటు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: టీఆర్‌ఎస్‌కు అచ్చొచ్చిన జిల్లా కావటంతో కేసీఆర్ ఇక్కణ్నుంచే సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి ఈనెల 13న శ్రీకారం చుట్టారు. పధ్నాలుగేళ్ల కిందట పార్టీ ఆవిర్భావంలో సింహగర్జన సభ నిర్వహించిన ఎస్సారార్ కాలేజీ మైదానంలోనే బహిరంగసభ ఏర్పాటు చేసిప్రచారానికి బయల్దేరారు. ముందుగా నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని పార్టీ షెడ్యూలు విడుదల చేసింది. ఆఖరి నిమిషంలో ఆ సభకు గైర్హాజరైన కేసీఆర్... ఆదివారం నాటి సభతోనే ప్రచారం ప్రారంభించటం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణలో మొట్ట మొదటగా కరీంనగర్ నుంచే ప్రచార ఢంకా మోగించేందుకు సమాయత్తమైంది. ప్రచార పర్యటనలో భాగంగా ఈ నెల 16న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. 2004 ఎన్నికల పర్యటనలో భాగంగా కరీంనగర్‌కు వచ్చిన సోనియా.. ఇదే వేదికపై నుంచి ‘మీ మనస్సులో ఏముందో.. నాకు తెలుసు...’ అని తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పదేళ్ల తర్వాత తెలంగాణ కల నెరవేరటంతో..
అదే సభా ప్రాంగణం నుంచిరాష్ట్ర ఏర్పాటు ఘనతను చాటి ెప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అదే వేదికపై తమ అధినేత్రి సోని యాకు కృతజ్ఞతలు తెలుపుకోవటంతో పా టు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని ప్రచారం హోరెత్తించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థులను ఇదే సభ నుంచి ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్ సెంటిమెంట్ కోట తమకు కలిసొస్తుందని.. అందుకే సోనియా సభకు ఈ వేదికను ఎంచుకున్నట్లుగా పార్టీ అభ్యర్థులు ధీమాతో ఉన్నారు.బీజేపీ సైతం ఎన్నికల ప్రచారానికి అతిరథ నేతలను జిల్లాకు రప్పించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఈనెల 23న రాష్ట్రానికి వచ్చే అవకాశముందని, అదే సందర్భంగా కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
23న మోడీ పర్యటన ఖరారు కాకపోయినా.. అదే వారంలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌ను జిల్లాకు రప్పించి ప్రచారం ఉధృతం చేయాలని యోచిస్తున్నారు. ఉద్యమంలో పాలుపంచుకోవటంతో పాటు తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన పార్టీని ఆదరించాలనే నినాదంతో జనంలోకి వెళ్లాలని బీజేపీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.