న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఇలా..
స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది.
Comments
Please login to add a commentAdd a comment