
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాబోయే సాధారణ ఎన్నికల్లో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని, ఎంపీగా లోక్‌సభ స్థానానికి పోటీచేసే ఆలోచన లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలు తీర్చేందుకు తాను శాసనసభకే పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల 470 గ్రామీణ నీటి (ఆర్‌డబ్ల్యూఎస్) పథకాలు పడకేశాయని ఆరోపించారు.
ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండగా ఇప్పటివరకు ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చే నాథుడే కరువయ్యాడని అన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడిపై జిల్లా మంత్రి, కలెక్టర్ సమీక్షించి నీటి ఎద్దడి లేకుండా చూడాల్సి ఉన్నప్పటికీ వారు అదేమీ పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లోని సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద జిల్లాలో పని చేస్తున్న 340 మందికి 9 నెలలుగా జీతాలు రావట్లేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం అధిష్టానం పరిధిలో ఉంటుందని, త్వరలోనే అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని తెలిపారు.